రామాయణమ్ – 216
‘‘నాయనా, నా భర్తకు లభించిన ఈ విజయము వలన కలిగిన సంతోషముతో మాటలు రాని దాననైతిని. ఇంత ఆనందకరమైన వార్త తెచ్చినందులకు నేను నీకు ఏమియ్యగలదానను? ఏమిచ్చినా అది తక్కువే! నీకు ఈయగల వస్తువేదీ నాకు ఈ భూమండలము మీద కనపడుట లేదు.’’
సీతమ్మ మాటలు విని హనుమంతుడు, ‘‘అమ్మా, స్నేహపూర్ణమైన పలుకులు పలుకుటకు నీవే తగినదానవు. ఆ మాటలే చాలు తల్లీ! అమ్మా ఒక్క అనుజ్ఞ ఇవ్వుతల్లీ. ఈ రాక్షసి మూకేగదా నిన్ను చెండుకు తిన్నది. ఇప్పుడు వీరందరినీ ఒక పని పట్టవలెనని ఉన్నది. ఒక్కొక్క చుప్పనాతిని తెగరక్కి గోళ్ళతో రక్తం కారేటట్లుగా చీల్చవలెనని ఉన్నది. తొలిసారి నిన్ను చూసినప్పుడు ఆ పని చేయుటకు వీలు కలుగ లేదు. ఇప్పుడు నీ అనుమతి కావలె నాకు’’ అని ఆంజనేయుడు పలికెను.
Also read: విభీషణ పట్టాభిషేకం
అంత దయాంతరంగ సీతమ్మ హనుమను వారించి ఇట్లనెను, ‘‘నాయనా, వారేమి చేయుదురు? వారు వారి రాజాజ్ఞకు బద్ధులు. ఇకపై వారట్లు చేయరు’’ అని పలికెను.
అప్పుడు హనుమ సీతమ్మను చూచి ‘‘అమ్మా శ్రీరామునికి నీవిచ్చు సందేశమేమి’’ అని అడిగెను.
‘‘హనుమంతుడా, నేను నా భర్తను వెంటనే చూడగోరుతున్నాను’’ అని సీతమ్మ పలికెను.
రాముని వద్దకు వెళ్ళి హనుమ ఈ విషయము తెలిపెను.
‘‘స్వామీ ఏ తల్లికొరకు ఇంతచేసినామో ఆ తల్లిని నీవు చూడవలెను. సీతమ్మ నీ విజయవార్త వినగానే కన్నులనిండా నీరునింపుకొని నిన్ను చూడవలెనని తహతహలాడుచున్నది …’’అని ఆంజనేయుడు పలుకగా రాముడు సాలోచనగా ఆయనను చూసెను
రాముడు అప్పటివరకు ఒక యోధుడు.
Also read: మండోదరి విలాపము
సీతమ్మ ప్రసక్తి రాగానే ఒక బాధ్యత గల భర్త అయినాడు.
అంతలోనే ఆయనకు ఒక విషయము జ్ఞప్తికి వచ్చినది ..తాను ఒక మహారాజునని, తన రాజ్యపు ధర్మాన్ని, తన సంఘమర్యాదను కాపాడు కర్తవ్యము కూడా తనపై ఉన్నదని, అంతరంగంలో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నవి రామచంద్రునకు ….
సీతాలక్ష్మికి భర్తగా ఏమి చేయవలె?
రాజ్యలక్ష్మికి భర్తగా ఎలా నడుచుకోవలె?
దీర్ఘముగా నిట్టూర్పు విడిచి ప్రక్కనే ఉన్న విభీషణునితో ఇలా పలికెను.
Also read: రావణుడి అంత్యక్రియలు చేయడానికి విభేషణుడికి రాముని అనుమతి
రామచంద్రుడు తన చూపు నేలమీదనే ఉంచి, ‘‘విభీషణా, శిరఃస్నానము చేసి దివ్యాలంకారభూషిత అయిన అతివ సీతను ఇచటకు తీసుకొని రమ్ము’’ అని పలికెను.
రాముని నోట ఆ మాట వినగానే విభీషణుడు త్వరత్వరగా అంతఃపురమున ప్రవేశించి తన స్త్రీల ద్వారా ఆ విషయము సీతమ్మకు తెలియచేసెను.
విభీషణుడు సీతమ్మ వద్ద అంజలి ఘటించి నిలిచి, ‘‘అమ్మా, స్నానము చేసి దివ్యాంగరాగము పూసికొని నగలు అలంకరించుకొని వాహనము ఎక్కుమమ్మా. రామచంద్రుని పిలుపైనది’’ అని పలికెను.
అప్పుడు సీతమ్మ, ‘‘లేదు. ఇప్పుడు నేను ఏ విధముగా యుంటినో ఆవిధముగనే రామదర్శనము చేయగోరుచున్నాను’’ అని పలికెను.
Also read: రావణ సంహారం, విభీషణుడి విలాపం
అప్పుడు విభీషణుడు ‘‘అమ్మా, శ్రీరామచంద్రుని అభీష్టమది’’ అని తెలియచేసెను.
భర్తయన్న అమిత భక్తిగల సీతమ్మ శుచియై, శుభ్రవస్త్రాలంకృతయై, శ్రేష్ఠమైన ఆభరణములు ధరించి రాక్షసులు తెచ్చిన పల్లకి ఎక్కి పయనమాయెను.
‘‘రామా, సీతమ్మ వచ్చినది’’ అని విభీషణుడు ఆలోచనామగ్నుడైన రాఘవునికి తెలియచేసెను.
విభీషణుని ఆ మాట వినగానే రామచంద్రునకు….
సంతోషము
దైన్యము
రోషము ….ఈ మూడూ ఏక కాలములో మనసులో ఆవేశించినవి…
(ఇంత కాలానికి తన రమణి జానకి కనపడినందులకు “సంతోషము
ఇంతకాలము రావణుని బందీగా ఎంతో దుఃఖము అనుభవించినది గదా అని “దైన్యము”.
1) వద్దు అని వారించినా వినక మొండిపట్టుదలతో అడవులకు వచ్చి ఇంతవరకు తెచ్చినది.
2) మారీచుడిమాయ అది అని లక్ష్మణుడు నెత్తీనోరు మొత్తుకొని చెపుతున్నా వినక అదే మొండితనంతో రాముని ప్రోత్సహించి మృగము కోసము పంపినది
3) రామునికి ఏమీ కాదు ఆయన జగదేకవీరుడు అని లక్ష్మణుడు చెపుతున్నా మంకుపట్టు వీడక నానాదుర్భాషలాడి లక్ష్మణుని రక్షణను కూడా స్వయంగా దూరంచేసుకొని ఇంతవరకు తెచ్చినదే … అందులకు “కోపము”
జరిగినవిషయాలు, రాబోయే ప్రజాపవాదులు, తాను తీసుకున్ననిర్ణయము ఇవన్నీ కన్నులముందు గిర్రున తిరిగి రామునికి రోషావేశము ,కోపము కలిగినది)
Also read: తెగి మొలచిన రావణు శిరస్సులు
వూటుకూరు జానకిరామారావు