- ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
- సీఐడీ నుంచి సిట్ కు విచారణ బదిలీ
రామతీర్థం తో పాటు రాష్ట్రంలోని దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం కేసులపై దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్ జీవీజీ ఆశోక్ కుమార్ అధ్యక్షతన 16 మందిసభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ గౌతం సవాంగ్ మెమో జారీ చేశారు. సెప్టెంబరు 2020 నుంచి ఇప్పటివరకు జరిగిన విగ్రహ ధ్వంసం కేసులను సిట్ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. సిట్ అధిపతిగా ఏసీబీ అదనపు డైరెక్టర్ గా జీవీజీ అశోక్ కుమార్, సభ్యులుగా కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రబాబు, ఎస్ఐబీ అదనపు ఎస్పీ సుధీర్, సైడీ అదనపు ఎస్పీ ఎల్వీ శ్రీనివాసరావులతో పాటు ఇద్దరు డీఎస్పీలు నరేంద్రనాథ్ రెడ్డి, ఎం. వీరారెడ్డిలను సిట్ సభ్యులుగా నియమంచారు. వీరితో పాటు విజయవాడ వెస్ట్ ఏసీసీ హనుమంతరావు, విశాఖ ద్వారకా నగర్ ఏసీపీ ఆర్వీఎస్ మూర్తిలు కూడా సభ్యులుగా ఉంటారు. విజయవాడ సీఐ సెల్, పాడేరు, పొదిలి వెంకటగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లు సిట్ లో సభ్యులుగా ఉంటారని డీజీపీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఆలయాల దాడులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
దర్యాప్తులో సిట్ బృందానికి సహకరించాల్సిందిగా ఫోరెన్సిక్, సీఐడీ, ఇంటెలిజెన్స్, సైబర్ క్రైం విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక జిల్లా ఎస్పీలతో సమన్వయం చేసుకుంటూ కేసుల దర్యాప్తును వేగంగా చేయాలని సిట్ కు సూచించారు. దర్యాప్తులో పురోగతిని ఎప్పటికప్పుడు శాంతిభద్రతల అదనపు డీజీకి తెలియజేయాలని స్పష్టం చేశారు.
అదనపు సిబ్బందికి అనుమతి:
కేసు విచారణలో భాగంగా అవసరం అయితే డీజీపీతో సంప్రదించి కావాల్సిన అదనపు పోలీసు సిబ్బంది వినియోగించవచ్చని సవాంగ్ తెలిపారు. ఆలయాలు, విగ్రహాల ధ్వంసం ఘటనలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తిరిగి ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పడంతో పాటు విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
ఇదీ చదవండి: ఆలయాల పునర్మిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ