- పాటను చీకటి చేస్తూ దివికేగిన వెన్నెల
- ప్రకృతి ఆరాధకుడు, అజ్ఞానాన్ని ప్రశ్నించినవాడు
- వేటూరి తర్వాత నిలిచిన దీపస్తంభం
- శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి అంశలతో పదవిన్యాసం
పాట ద్వారా వెన్నెలలు, వెలుగులు, వెలుతురులు పంచిన ‘సిరివెన్నెల’ పాటను చీకటి చేస్తూ వెళ్లిపోయారు. వెండితెరకు నిండువెన్నెలను అందించిన మహనీయులు ఒక్కొక్కరూ వెళ్లిపోవడం అత్యంత విషాదం. నిన్న బాలు, నేడు సీతారామశాస్త్రి.. ఊహించని దుర్ఘటనలు. పాట ఏమై పోతుందో? అంటూ అభిమానులు బావురుమంటున్నారు. ‘‘తెలవారదేమో స్వామీ నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలవేలు మంగకు..’’ ఈ పాటను అన్నమయ్య కీర్తనగా భావించి కె జె ఏసుదాసు ఎన్నో కచేరీలలో ప్రకటించి, గానం చేశారు. ఆయనే కాదు, చాలామంది ఇప్పటికీ అన్నమయ్య కృతిగానే అనుకుంటున్నారు. ఈ ఒక్కపాట చాలు సీతారామశాస్త్రిని గొప్పకవిగా చరిత్రలో నిలపడానికి.
Also read: అందని లోకాలకు ఏగిన అందరి శేషాద్రి
పాట పుట్టుకలో ప్రసవవేదన
పాటను పుట్టించడంలో ఆయన ఎంతటి ప్రసవవేదనను అనుభవిస్తారో, ఆయన గురించి తెలిసిన వారందరికీ తెలుసు. అనుభవించి పల్లవించకుండా ఒక్క పాట రాసిన దాఖలా లేదు. ఈ ప్రస్థానంలో మనసును, మెదడును,శరీరాన్ని చాలా ఖర్చు పెట్టారు,కష్ట పెట్టారు. ఈరోజు (మంగళవారంనాడు) అర్ధాంతరంగా శరీరాన్ని వదిలి అందరినీ కష్ట పెడుతున్నారు. ఆ కలంలో నవరసాలు అలవోకగా వలుకుతాయి. జాతిని జాగృతం చేసే గీతరచనలకు సీతారామశాస్త్రి పెట్టింది పేరు. ఆ తరంలో శ్రీ శ్రీ, ఈ తరంలో శాస్త్రి అని చెప్పవచ్చు. సినిమా కవిగా ప్రసిద్ధుడు కాకముందే కవితామయ జీవితాన్ని గడిపి కె విశ్వనాథ్ వంటి కళాతపస్వులను ఆకర్షించారు. కథలు కూడా అద్భుతంగా రాశారు. ‘కార్తికేయుని కీర్తికాయం’ గొప్ప కథ. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ నేపథ్యంలో నడిచినా, సంప్రదాయానికి, సనాతన ఆచారాలకు విలువ ఇస్తూనే విప్లవ భావాలను, అభ్యుదయ జ్యోతులను వెలిగించుకున్నారు. ‘లలిత ప్రియ కమలం విరిసినదీ’ అని చెబుతూ ప్రకృతిని ఆరాధించే లక్షణం, ‘‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమంటామా, నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’’ అంటూ ప్రశ్నించే లక్షణం రెండింటినీ అలవరుచుకున్న ప్రగతిశీలి. ‘భరణి’ కలం పేరుతో ఆ కాలంలో వచ్చిన రచనలు నాటి తరం వారికి సుపరిచయం. ‘‘తరలి రాదా? తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం’’ అంటాడు. వనాల కోసం వసంతమే తరలి వస్తుంది కానీ,వసంతం కోసం వనాలు వెంటాడక్కర్లేదు, వెంపర్లాడనక్కర్లేదు అన్నది సారాంశం. భావుకతకు పరాకాష్టగా నిలిచే ఇటువంటి గీతాలకు విలాసం ఈ కవి.
Also read: సంపాదక శిరోమణి ముట్నూరి కృష్ణారావు
అణువణువూ పదునైన కలం
ఆ కలానికి రెండు పక్కల కాదు, ఆణువణువునా పదును ఉంది. తెల్లారింది లెగండోయ్ అంటూ ‘‘పెను నిద్దర వదిలించే వైతాళికుడు, ప్రాగ్దిశ వేణియపైన, దినకర మయూఖ తంత్రులపైన’’ అని రాసిన ఆధునిక ప్రబంధకవి వతంసుడు కూడా ఆయనే. సీతారామశాస్త్రి నడకలో శ్రీ శ్రీ, కృష్ణశాస్త్రి తొంగి చూస్తూ ఉంటారు. ‘‘జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది’’ అని చెప్పుకున్న వేదాంతి కూడా. విధాత తలపున ఏమి ఉదయించిందో తెలియదు కానీ, అప్పుడే ఈ కవీంద్రుడిని కనుమరుగు చేశాడు. సరస స్వర సుర ఝరీ తరంగం ఆ కవనం. సురాజ్యం లేని స్వరాజ్యం ఎందుకంటాడు. నా ఉఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం అని ఆయనే రాసినట్లు అలాగే జీవించారు. వారింట్లో ఆయన కూర్చొనే టేబుల్ వెనకాల పతాక శీర్షికలో ఈ పదాలు కనిపిస్తూ ఉంటాయి. చెంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’గా ప్రభవించిన వైనం జగద్వితం. కాశీనాథునివారికి ఆస్థానకవి. కె.విశ్వనాథ్ ను ‘‘నాన్నగారూ..’’ అని సంబోధించడంలో ఆ కృతజ్ఞత, గౌరవం దాగి వున్నాయి. తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తెచ్చిన కవులలో సీతారామశాస్త్రి స్థానం ప్రత్యేకమైంది. వేటూరి సుందరరామ్మూర్తి తర్వాత ఆ కవితా జగతికి ప్రతినిధిగా నిలిచిన కవనీయుడు. సిరివెన్నెల అంటే? శోభాయమానమైన వెన్నెల. ఆ శోభ ఎప్పటికీ వెలుగుతూనే వుంటుంది. ఆ గీతాలు తెలుగువారి గుండెల్లో మోగుతూనే ఉంటాయి. ‘సిరివెన్నెల’ ఇంటిపేరుగా మారిన ఈ కవి గురించి రాయాలంటే ఎన్ని పంక్తులైనా సరిపోవు. పాటకు ప్రాణం పోసిన సీతారామశాస్త్రి చిరంజీవి.