ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరి లేరు. నాలుగు రోజుల కిందట న్యూమోనియా కారణంగా ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల సినిమాలో ‘విధాత తలపున…’ గేయం రాసి ప్రాచుర్యం పొందింది. ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా అమరింది. చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధి చెందారు. అనేక అజరామరమైన పాటలు అనేకం రాశారు. సిరివెన్నెల తర్వాత ‘రుద్రవీణ’లో ‘నమ్మకు నమ్మకు ఈ రేయినీ…’ గేయానికి విశేషమైన ప్రజాదరణ దక్కింది. అనంతరం ‘స్వర్ణకమలం’లో ‘ఆకాశంలో ఆశల హరివిల్లు…’అనే పాటను జనం విపరీతంగా మెచ్చారు. ఆ విధంగా మొదలైన సినీకవితా ప్రస్థానం తుది వరకూ సుసంపన్నంగా సాగింది. సుమారు మూడు వేల పాటలు రాశారు. 2019లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. పన్నెండు నందులను గెలుచుకున్నారు. ఇతర పురస్కారాలకూ, సన్మానాలకూ లెక్కలేదు.
అరవై ఆరు సంవత్సరాల సీతారామశాస్త్రికి యోగేశ్వరశర్మ, రాజా అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. రాజా చెంబోలు ‘నాపేరు సూర్య’ వంటి సినిమాలలో నటించారు. టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. నిరుడు ఆగస్టులో పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు.
విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని గ్రామంలో 20 మే 1956న డాక్టర్ సివి యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. అనంతరం కాకినాడలో ఇంటర్, తర్వాత డిగ్రీ ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగంలో చేరిపోయారు. రాజమండ్రిలో ఉద్యోగం. గాయకుడుగా రాణించాలని ప్రయత్నించి విఫలుడై గేయ రచయితగా ఎదగాలని ప్రయత్నించాడు. చిన్నతనం తెలుగు సాహిత్యం అంటే మక్కువ ఎక్కువ. సాహిత్య సభలకు హాజరయ్యేవారు. స్నేహితులంతా ‘భరణి’ అని పిలిచేవారు. ఎంఎ చదువుతుండగా విశ్వనాథ్ నుంచి పిలుపు వచ్చింది. అంతే. మళ్ళీ వెనక్కు తిరిగి చూడలేదు.
‘గాయం’ అనే సినిమాలో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని…’ అనే పాట బాగా పేలింది. ‘శ్రుతిలయలు’ లో ‘తెలవారదే స్వామి,’ ‘క్షణంక్షణం’లో ‘జామురాతిరి జాబిలమ్మా…,’ ‘మనీ’ అనే సినిమాలో ‘చక్రవర్తికీ భిక్షగత్తెకీ…’,‘సిందూరం’లో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే…,‘ అలవైకుంఠపురంబు’లో ‘సామజవరగమనా….’ సితారామశాస్త్రి రాసిన అద్భుతమైన గీతాలలో మచ్చుకు కొన్ని. సరస సంభాషణ ప్రియుడు, మంచి వక్త, గొప్ప కవి, సాహిత్య కృషీవలుడైన సిరివెన్నెల సీతారామశాస్త్రి లోటు సినీ పరిశ్రమలో తీర్చలేనిది. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం దివికేగిన సంవత్సరం తర్వాత పాటల రచయిత సిరివెన్నెల కూడా అక్కడికే చేరడం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద నష్టం.