పాటలో మాటలుంటాయి. మాటల్లో భాష ఉంటుంది. భాషలో భావం ఉంటుంది. ఉండాలి! ఇది తెలిసిన ‘వాళ్ళే’ గీతాకారులు అవుతారు!
శాస్త్రిగారితో పరిచయం మూడున్నర దశాబ్దాలనాటిది. చెన్నయ్, సాలిగ్రామంలో ప్రముఖ గుణచిత్ర నటుడు సాక్షిరంగారావుగారింట్లో ఉంటున్నప్పటి నుంచి మొదలయిన పరిచయంలో అడపాదడపా కలుసుకోవడాలు, కబుర్లు చెప్పుకోవడాలు ఉండేవి. ఆ కబుర్లలో ఆ రోజు తాను రాసిన ‘పాట’ గురించిన ముచ్చట్లుండేవి. ఆ పాటని, నాతోబాటు మిత్రుడు, ప్రముఖ గీతరచయిత ‘‘వెన్నెలకంటి’’’ వాళ్ళు కూడా విని ఆనందించడం జరిగేది. శాస్త్రిగారి గీతాల్లో పెద్దగా సంస్కృత సమాసభూయిష్టమైన పదాలుండేవి కావు. సరళంగా, అతి సులభమయిన పదాల పోహళింపుతోనే, గొప్ప భావనను కలిగించడం ఆయన ‘గీత’ ప్రత్యేకత. ఇది భాషమీద, భావాలమీద పట్టున్న వారికే సాధ్యం! అది శాస్త్రిగారి విషయంలో సుసాధ్యం అయింది.
ఆయన నిశాచరుడు! నీరవ నిశ్శబ్ద ప్రేమికుడు! ప్రజ నిద్రలో ఉన్న వేళ ఆయనలోని ‘కవి’ మేలుకుంటాడు. ఒకసారి నేనూ, మరో ఇద్దరు మిత్రులం ‘వడపళని’ లోని థియేటర్లో సినిమాచూసి వస్తున్నాం. అప్పటికి అర్ధరాత్రి పన్నెండు దాటింది. అలాటి సమయంలో మూసి ఉన్న ఒక షాపు దగ్గిర ఏదో ఆలోచిస్తున్న శాస్త్రిగారిని చూశాము. ఇదేమిటి? ఈ వేళ ఇక్కడీయన? అనుకొన్నాం. దగ్గిరకెళ్ళి పలకరించాక తెలిసింది; ‘‘పాట’’ కోసం ఆయన రాత్రివేళల్లో ‘‘వీధివిహారం’’ చేస్తారని! విచిత్రమైన అలవాటు. ఆ వేళలో ఆయన ‘వీణాపాణి’ని కూడా తన దగ్గిరకు రమ్మని పిలుస్తూ ఉండచ్చు.ఆవిడ రానూ వచ్చు. రాకపోతే ఇన్ని రసరమ్య గీతాలు ఎలా వస్తాయి?
ఒక సారి అడిగాను, ‘‘ఇటీవల ఏ పాటకు మరి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది?’’ అని. దానికి ఆయన ‘‘ఇల్లాలికి ఏడాదికి ఒక సారే ప్రసవ వేదన. సినీగీత రచయితకి ప్రతిపాటకీ ప్రసవ వేదనే! నిత్య బాలింత’’ అన్నారు చమత్కారంగా! నిజం కదా!
భుజాన ఒక సంచీ, దానిలో తెల్లకాగితాలున్న అట్ట. జేబులో పెన్ను, లాల్చీ పైజమాతో, ఆయన సినిమా ఆఫీసుకు వచ్చేవారు. దర్శకుడు చెప్పిన సందర్భంలోని ముఖ్యాంశాలను వ్రాసుకునేవారు. అలాటి ఆయన ‘‘నిత్యవిద్యార్థి’’ రూపం, ఇంకా నేనూ, నా మిత్రులు మరిచిపోలేదు.
శాస్త్రిగారు మితభాషి! మృదుభాషి. అయితే సందర్భాన్నిబట్టి చమత్కారి.
మరోసారి, శాస్త్రిగారూ, నేనూ, మరో ఇద్దరు మిత్రులం హాబీబుల్లా రోడ్డులో ఉన్న ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలో కలుసుకోవడం జరిగింది. ఆ ఆఫీసులో ‘మేకప్ రూం’ ఉంది. శాస్త్రిగారు మేకప్ వేసుకునే కుర్చీలో కూర్చున్నారు. అప్పుడు సాగిన సంభాషణలో ‘మేకప్’ అంటే ‘‘మై’’ని కప్పడం అన్నారు. ‘‘మై’’ అంటే శరీరం! మేకప్ మొహానికే కాక, సందర్భాన్ని బట్టి శరీరం మీద కూడా వేస్తారు! అలా ‘మేకప్’కీ, ‘మైకప్పుకీ’ తేడా లేదని తమాషాగా విశ్లేషించారు.
ఇలాటి సరదా సంభాషణలు, సందర్భాలు ఆయనతో చాలాసార్లు పంచుకోవడం జరిగింది. అయితే ఏనాడూ, చమత్కారానికయినా, మరో వ్యక్తిని కించపరచడం, కొంచెం చేసి మాట్లాడటం చేయక పోవడం ఆయనలోని సంస్కార నిబద్ధత!
స్వరానికి, పదాలు పొదిగినా, స్వేచ్ఛగా పాట వ్రాసినా, శాస్త్రిగారి గీతాల్లో కవితాత్మతోబాటు, ఒక ‘‘తాత్వికత’’ ఉండటం విశేషం!
శాస్త్రిగారి పాటల్లోకి ఆ పదమాధుర్యం ఎలా వచ్చిందీ అంటే, ‘‘ఆయన పుట్టింది ‘అనకాపల్లి’’లో! ఆ ఊరు బెల్లానికి పేరున్న ఊరు కదా. అందుకే ఆ పదమాధుర్యం ఆయన పాటల్లో’’ అన్నాడొక మిత్రుడు.
అయితే శాస్త్రిగారే వ్రాసుకున్నట్టు, ‘‘జగమంత కుటుంబాన్ని,’’ వేలగీతాలని మనకు వదిలి; ‘‘అమరగీతాలు’’ సృజించడానికి, గగనాంచలాలకి పయనించడం విషాదభరితం!
‘‘సుమధుర గీతాల సీతారాముని మృతి;
సుకవితా ప్రియులకు కలకాల స్మృతి!’’
ఓంశాంతి!