Tuesday, January 21, 2025

సిరిసంపదలకేమి కొదవ రారండి సిరినోము

తిరుప్పావై 3

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్

నమ్మిన వారికోసం మరుగుజ్జుగా మారినవాడు

అంతలోనే పెరిగి అంతరిక్షాలు తాకి లోకాల కొలిచినాడు

ఆతని కొనియాడి, ఉదయాన స్నానమాడి

తెలుగుభావార్థ గీతిక

మనసున నమ్మిన వారి గావ మరుగుజ్జుగా దిగి వచ్చినాడు

అంతలోనె ఆకాశానికెదిగి లోకాలనెల్ల పాదాల కొలిచినాడు

నోముస్నానాల పునీతమై త్రివిక్రముని నోరార వేడుదాము

నెలమూడు వానల, వెన్నెల సోనల వ్రేపల్లె సస్యశ్యామలంబు

ఎదిగిన పైరుల నిండిన జలాల త్రుళ్లి పడు మీన సంచయంబు

తెలుపుకలువపూల తెలవారుదాక నిదిరుంచు తుమ్మెదలు

కృష్ణువేణువు తాకి సేపులెగసి గోవులిచ్చును క్షీర కుంభవృష్ఠి

సిరిసంపదలకేమి కొదవ రారండి సిరినోము జేయ సీమంతులార.

అర్థం
         ఓంగి =సమున్నతంగా పెరిగి, ఉలగు = మూడులోకాలను, అళంద = కొలిచిన, ఉత్తమన్ =పురుషోత్తముడైన పరంధాముని, పేర్ = తిరునామాలను, నాంగళ్ =మేము, పాడి= స్తుతిస్తూ, నం పావైక్కు చ్చాత్తి = వ్రతం నెపంమీద, నీర్ ఆడినాల్ =స్నానం చేస్తే, తీంగిన్ఱి = ఈతిబాధలేవీ లేకుండా, నాడేల్లాం = దేశమంతటా, తింగళ్ =నెలకు, ముమ్మారి పెయ్దు=మూడు వానలు కురుస్తాయి, ఓంగు పెఱుం జెన్నెలూడు =బాగాపెరిగి ఎరుపు రంగులో ఉన్నధాన్యపు గింజలు వేలాడే వరిపొలాల మధ్యలో, కయల్ ఉగళ= చేపలు తుళ్లిపడుతూ ఉంటే, పూంగువళై ప్పోదిల్ = సుందరమైన కలువ పూవులలో, పోఱివండు = అందమైన తుమ్మెదలు, కణ్-పడుప్ప= నిద్రిస్తూ ఉంటే, తేంగాదే = సంకోచం లేకుండా, పుక్కు = పాలుపిండడానికి, ప్రవేశించి, ఇరుందు= స్థిరంగా ఉండి, శీర్ త్త ములై = నిండిన పొదుగులను, పత్తి(ట్రి) =పట్టుకుని, వాంగ= పిండగా, క్కుడం నిఱైక్కుం= కుండలునిండిపోతున్నాయి, వళ్ళల్ = ఉదారంగా, పెరుం పశుక్కళ్= పెద్దగా పెరిగిన పశువులను, నీంగాద శెల్వం =ఈ విధమైన అక్షయమైన సంపద నిఱైందు = నిండి ఉంటుంది.

Also read: తెల్లారి స్నానాలు కద్దు, పూలు కాటుకల సొబగులొద్దు

పరమార్థం

శరీరమనే క్షేత్రంలో జీవుడనే విత్తనాన్ని పరమాత్ముడు నాటుతాడు. ఆత్మసస్యం ఫలించాలంటే ఈతి బాధలు ఉండరాదు. నెలకు మూడు వానలు కురియాలి.

ఆయన త్రివిక్రముడు. మూడులోకాలను రెండడుగుల్లో కొలిచిన వాడు. స్నానంచేసి వ్రతం పేరుతో ఆ వామనుడిని స్తుతించితే ఈతిబాధలు ఉండవు. నెలకు మూడు వానలుకురుస్తాయి. వరిపంటలు బాగా పెరిగి ఎర్రని గింజలు చూడవచ్చు. ఆ వరిచేలల్లో నిండిన జలాల్లో చేపలు తుళ్లిపడుతాయి. కలువపూల మకరందాలను గ్రోలుతూ అందమైన తుమ్మెదలు మైమరచి నిద్రిస్తాయి. పశుసంపద కూడా తక్కువేమీ కాదు. బాగా బలిసిన పశువులు గోపాలకులు పాలు పితకడానికి సంశయించకుండా దగ్గరికివచ్చి పొదుగులు పట్టుకోగానేపాలు కురిసి కుండలు నిండిపోతున్నాయి. అక్షయమైన సంపద వెల్లివిరుస్తున్నది.

అర్థిస్తే కాదనడు నారాయణుడు. రాముడైనా, వామనుడైనా, కృష్ణుడైనా ఔదార్యంతో రక్షిస్తాడనే నిర్భరహృదయంతో గోపాల గోపికలు నిశ్చింతగా ఉన్నారు.

మొదటి పాశురంలో భగవంతుడి పరత్వం, రెండో పాశురంలో వ్యూహం, మూడో పాశురంలో విభవాన్ని గోదమ్మ ప్రస్తావించింది. మొదటి పాశురం లో నారాయణతత్వం అనే స్థానం, రెండో పాశురంలో రెండో స్థానం పాల కడలి, ఇక్కడ భగవంతుడి మూడో స్థానం అయిన విభవం (అవతారాలు) గురించి సవిస్తరంగా వివరించింది. దిగివచ్చిన వామన మూర్తిని కొలిచింది.  అందమైన సుసంపన్నమైన పల్లె వైభవాన్ని మనకోసం చిత్రించిందీ పాశురంలో.

Also read: కోదై తులసీవనంలో దొరికిన సుమబాల

తెలుగు సేత మాడభూషి శ్రీధర


Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles