Thursday, November 21, 2024

ఉద్వేగంతో మౌనంగా ఉండిపోయిన సిరాజ్ తల్లి

  • సిరాజ్, షఫీ ప్రాణమిత్రులు, టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడేవాళ్ళు
  • కొడుకు విజయం సాధించాలని తల్లి ప్రార్థన

స్థానిక క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ బౌల్ చేస్తున్నప్పుడు అతని తల్లి ఏమి చేస్తున్నదో తెలుసా? కళ్ళు మూసుకొని అల్లాను ప్రార్ధించింది తన కొడుకు విజయం సాధించాలని, ప్రత్యర్థుల వికెట్లు పడగొట్టాలని. హైదరాబాద్ లోని టోలీచౌకీ ప్రాంతంలో అల్ హసనత్ కాలనీలో అన్ని ఇళ్ళలో లైట్లు వెలడగం లేదు కానీ ఒక ఇంట్లో మాత్రం సందడే సందడి. పెద్ద ఇంటి ముందు ఎత్తయిన గేట్ల ముందు కార్లు, మోటర్ సైకిళ్ళూ  ఆగాయి. ఇంట్లోనుంచి పెద్దగా నవ్వులు వినిపించడంతో రోడ్డు మీద పోయేవారు చిర్నవ్వు నవ్వుకుంటూ సాగిపోతున్నారు.

ఈ కాలనీలో సిరాజ్ ను ‘మియాభాయ్’ అని పిలుస్తారు. 10-2-46-4 అంటే పది ఓవర్లు బౌల్ చేసి, వాటిల్లో రెండు మెయిడన్లు వేసి, నలభై ఆరు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడని అర్థం. మంగళవారంనాడు హైదరాబాద్ లో జరిగిన మొదటి ఎన్ డే లో భారత, న్యూజిలాండ్ ఆటగాళ్ళు పరుగుల సునామీ సృష్టించాయి. అటువంటి పరుగులు వరదలో పది ఓవర్లు బౌల్ చేసి కేవలం 46 పరుగులు చేసి నాలుగు వికెట్లు తీసుకోవడం కచ్చితంగా ఘనకార్యమే. ఇండియా 12 పరుగుల విజయం నమోదు చేసుకోవడానికి గిల్ ద్విశతకం ఎంత కారణమో సిరాజ్ నాలుగు వికెట్లూ అంటే కారణం. మైఖేల్ శాంటర్ తో కలిసి బ్రేస్ వెల్ అద్భుతంగా ఆడుతూ ఇండియా మీద గెలవడమే తరువాయి అన్నట్టు చెలరేగిపోతున్న వేళ శాంటర్స్ వికెట్ పడగొట్టింది మన మియా భాయేనని గుర్తించాలి.

ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆ రోజు సందడితో నిండిపోయింది. ఆ స్టేడియంలోనే సిరాజ్ తన ప్రతాపం మొదట చాటుకున్నాడు.మ్యాచ్ జరిగిన రోజు ఇతర క్రికెటర్లతో కలిసి బస్సు ఎక్కి వచ్చిక సిరాజ్ కు ఆ రూటు కొత్తగాదు. తన బజాబ్ ప్లాటినా బండిపైన సంవత్సరాలపాటు తిరిగిన దారే. 31,187 మంది హైదరాబాదీ ప్రేక్షకులు స్టేడియంలో ఉండగా సిరాజ్ సమధికోత్సాహంతో బౌలింగ్ చేశాడు. సిరాజ్ క్లాస్ మేట్లూ, స్నేహితులూ, బంధువులూ స్టేడియంలోని రెండో అంతస్థులో కూర్చొని ఉన్నారు. భారత టెస్ట్ టీమ్ లో సభ్యుడైన తర్వాత హైదరాబాద్ లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడటం ఇదే ప్రథమం. ఈ రోజు కోసం వేయికళ్ళతో ఎదురు చేశాడు సిరాజ్.

మొహమ్మద్ షమీ మొదటి ఓవర్ పూర్తి చేయగానే సిరాజ్ కొత్త బంతి తీసుకున్నాడు. ఒకటే చప్పట్లు,  ఈలలు. కార్పొరేట్ బాక్స్ లో మొదటి వరుసలో కూర్చున్న సిరాజ్ తల్లి షబనా బేగమ్ ఇక కుదురుగా కూర్చోలేకపోయింది.తన సోదరి పక్కనే కూర్చున్నది. అందరూ సిరాజ్ నామజపం చేస్తుంటే తల్లి భావోద్రేకానికి గురైంది. అందరూ ఆనందంగాకబుర్లు చెప్పుకుంటూ ఉంటే షబనా గ్రిల్ పట్టుకొని కదలకుండా నిలబడి ఉన్నది. తన చుట్టూ ఏమి జరుగుతున్నదో, ఏమి మాట్లాడుకుంటున్నారో పట్టించుకునే స్థితిలో ఆమె లేదు. ప్రేక్షకులు అప్పటికే శుభమన్ గిల్ వీరావేశాన్నీ, క్రీడాకౌశలాన్నీ చూసి కేరింతలు కొట్టారు. సిరాజ్ పరుగు తీస్తుంటే తల్లి మనసు అతనితో పాటే పరుగెత్తింది. మరెవ్వరూ ఆమెకు కనిపించలేదు. తాను, తన కొడుకు మాత్రమే ఉన్నట్టు ఆమె భావించుకున్నది. మొదటి విడత బౌలింగ్ లో డేవన్ కన్వాయ్ ను పెవిలియన్ కు పంపించాడు. అప్పటి లెక్క 5-2-20-1. అంటే అయిదు ఓవర్లు బౌల్ చేసి రెండు మెయిడన్లు సాధించి ఇరవై పరుగులు ఇచ్చి ఒక వికెట్టు తీసుకున్నాడు. షబనా కూర్చుంటుంది. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంది. సిరాజ్ చెప్పింది ఆ విధంగా ప్రార్థించమనే. జట్టు సభ్యులతో పాటు హోటల్ లో ఉంటున్న సిరాజ్ సోమవారం ఉదయం ఇంటికి వచ్చి తల్లిని ఆశ్చర్యంతో ముంచెత్తాడు. ‘అల్లాను ప్రార్థిస్తూ నమాజ్ చదువుతున్నాను. కళ్ళు తెరిచేవరకూ మా మియా ఎదురుగా కనిపించాడు. కొద్దిగా షాక్ తిన్నా. ఎందుకంటే వాడు మంగళవారంనాడు వస్తానన్నాడు. నీ ఆశీస్సులు ఇవ్వు. అవే పదివేలు అన్నాడు మా మియా’ అంటూ షబనా ఇండియన్ ఎక్స్ ప్రెస్ విలేఖరి బి. వెంకటకృష్ణతో అన్నది. ‘త్వరత్వరగా వాడికి ఇష్టమైన కిచిడీ తయారు చేశాను’ అని బేగం చెప్పింది. తల్లితోపాటు సిరాజ్ చెల్లి సోఫియా సుల్తానా, మేనమామ, అమ్మమ్మ, కొందరు బంధువులు, స్నేహితులు ఉన్నారు. మమ్మల్నందిరినీ స్టేడియంలో కూర్చోవాలని చెప్పి మాకు కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశాడు. ‘‘వాడికి ఎంత కీర్తి వచ్చినా, విజయాలు వరించినా అవి వాడు తలకెక్కించుకోలేదు. ఎటువంటి మార్పూ రాలేదు. మమ్మల్నందరినీ బాగా చూసుకుంటున్నాడు. అందుకు మేమంతా గర్విస్తున్నాం’’ అని షబనా బేగమ్ చెప్పారు.

తొట్టతొలి టెస్ట్ ఆస్ట్రేలియాపైన 2020 డిసెంబర్ లో ఆడి అరంగేట్రం చేశాడు మియా. అప్పుడు రెండు వికెట్లు తీసుకున్నాడు. భారత జట్టుతో సిరాజ్ కూడా నిలబడి జనగనమన చదువుతున్నప్పుడు తల్లి షబనా, ఆమె తల్లి భావావేశంతో పులకించిపోయారు. షఫీ, సిరాజ్ లు హైదరాబాద్ లో టెన్నిస్ బంతితో క్రికెట్  ఆడేవాళ్ళు. షఫీ సిరాజ్ కు కెప్టెన్. ఆటలో లేనప్పుడు షఫీ వేసుకున్న జీన్స్ షర్టు మీద సిరాజ్ పేరు ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతారు. ‘బచ్ పన్ కీ దోస్త్ హై’ అని షబనా బేగమ్ అంది. తన మిత్రుడి గురించి మాట్లాడుతూ షఫీ, ‘ఇది చూడండి. ఐఫోన్. ఇది ఖరీదైన వాచీ. ఇవన్నీ సిరాజ్ నాకు ఇచ్చినవే. అంత ప్రాణమిత్రుడు’ అంటాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles