- తండ్రిని తలచుకొని కన్నీరుమున్నీరు
- తొలిరోజుఆటలో కంగారూ బ్యాటింగ్ జోరు
- ఆస్ట్రేలియా స్కోర్ 166/2
భారత్- ఆస్ట్ర్రేలియా జట్ల నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మూడోటెస్ట్ కు ..సిడ్నీ క్రికెట్ స్టేడియంలో భావోద్వేగాల నడుమ తెరలేచింది. సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి సమఉజ్జీలుగా నిలవడంతో ఈ మూడోటెస్టు కీలకంగా మారింది. భారత్ ..తన తుదిజట్టులోకి యువఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీని చేర్చుకొని టెస్ట్ క్యాప్ ఇస్తే…కంగారూజట్టు యువఓపెనర్ పుకోవస్కీతో టెస్ట్ అరంగేట్రం చేయించింది. అయితే..మ్యాచ్ ఆరంభానికి ముందు రెండుజట్ల జాతీయగీతాలాపన కార్యక్రమ సమయంలో భారత యువఆటగాడు, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టుకొని..తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాడు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలోని ఓ ఆటోడ్ర్రైవర్ కుటుంబం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో కి దూసుకొచ్చిన సిరాజ్ ఆస్ట్ర్రేలియా పర్యటనలో ఉండటం, కఠినతరమైన క్వారెంటైయిన్ నిబంధనల కారణంగా తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయాడు. కడచూపుకు సైతం నోచుకోలేకపోయాడు. మెల్బోర్న్ నుంచి హైదరాబాద్ వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనటానికి టీమ్ మేనేజ్ మెంట్ అనుమతి ఇచ్చినా టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉండడంతో జట్టుతోనే ఉండి పోయాడు.
ఇదీ చదవండి:సిడ్నీలో భారత్-కంగారూ టగ్ -ఆఫ్- వార్
భారతజట్టుకు ఆడాలన్న తన తండ్రి చిరకాల స్వప్నాన్ని మెల్బో్ర్న్ టెస్ట్ ఆడటం ద్వారా సిరాజ్ నెరవేర్చగలిగాడు. భారత జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సమయంలో సిరాజ్ కు తనతండ్రి గుర్తుకు రావడంతో కంటతడిపెట్టుకొన్నాడు. కన్నీటి బాష్పాలతో నాన్నకు అంజలి ఘటించాడు. టెస్ట్ అరంగేట్రం తొలిఇన్నింగ్స్ లో 2 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు పడగొట్టిన సిరాజ్w సిడ్నీలో ప్రారంభమైన మూడోటెస్ట్ తుదిజట్టులో సైతం తన స్థానం నిలుపుకోగలిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్ర్రేలియాను తొలిదెబ్బ కొట్టిన ఘనతను సిరాజ్ దక్కించుకొన్నాడు. కంగారూ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను సింగిల్ డిజిట్ స్కోరుకే పెవీలియన్ దారి పట్టించాడు.
26 ఏళ్ల మహ్మద్ సిరాజ్ గత నాలుగు దశాబ్దాల కాలంలో భారత్ కు ఆడిన రెండో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. మొదటి ఫాస్ట్ బౌలర్ ఆబిద్ అలీ. సిడ్నీ టెస్ట్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్ర్రేలియా 2 వికెట్ల కు 166 పరుగుల స్కోరుతో శుభారంభం చేసింది. వానదెబ్బతో తొలిరోజున 35 ఓవర్ల మేర ఆటను నష్టపోక తప్పలేదు.
ఇదీ చదవండి:భారత అమ్ములపొదిలో ఢిల్లీ బుల్లెట్