తరలి వచ్చిన బంజార పక్షులు
కువకువల గీతికలని ఆలపిస్తాయి
గుండెల్లో దాచుకున్న ప్రేమనిధుల్ని
గుదిగూట్లో ఆరాబోస్తాయి
ప్రణయ కలాప లాటీల ఘోషకు
చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి
తరుణ హృదయకేళీ విలాసాలు
యామిని ఏకాంతంలో కోరిక లూదుతాయి
ఉదయం దినబాలుడు కిరణకరాలు చాచి
గోరింట పూసుకుంటాడు గుంభనంగా
హృదయకవాటాలు తెరిచి కుసుమాలు
రంగులద్దుకుంటాయి నిర్మలంగా
వర్ణం ప్రాణ పల్లవ మహిత స్వరూపం
మొన్నటి వరకూ ఎవరూ పలకరించని
అనామిక నేలపట్టు
నేడు ఖగసమాగమానికి ఆయువుపట్టు
నిన్నటి దాకా వెలవెల బోయిన వృక్షాలు
నేడు తీగలు మీటిన వీణియలు
వేయి వేణువుల కృష్ణగీతికలు..
ఇప్పుడు నేలపట్టు ఉదయాలు
స్వరమకరంద తరంగ ఝరులు
ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలు
అనురాగ గీతామృత స్రవంతులు
ఒక ఫెలికాన్ రెక్కల గుడారంలో
ప్రియరాల్ని పొదువుకుంటుందిక్కడ
ఎర్ర కాళ్ల కొంగ ఒకటి పక్కన చేరి
పొడువు ముక్కుతో సఖి నలరిస్తుందిక్కడ
శబరి కొంగ శృంగార రాగంలో
ప్రేయసి ప్రియగానంలో మైమరుస్తుంది
వళ్లంతా ఊపిరి చేసి వడ్లపిట్ట
చెలియ మేనంతా స్పృశిస్తుంది
క్షీరదాల ప్రేమ వరదలే కాదు
అండజాల అనురాగాలూ ప్రవహిస్తాయి
సంతాన లక్ష్మి మహాయజ్ఞంలో
కోటిప్రాణాలు ఉదయిస్తాయి..!!
Also read: ఫ్లెమింగో-1
Also read: ఫ్లెమింగో-2
Also read: ఫ్లెమింగో-3
Also read: ఫ్లెమింగో-4
Also read: ఫ్లెమింగో-5
Also read: ఫ్లెమింగో – 6
Also read: ఫ్లెమింగో-7
AAlso read: ఫ్లెమింగో-8