- మలిసంధ్యలో సింగరేణి పొద్దు పొడుపు
- ఎగ్జిక్యూటివ్ డిఫైన్డు కాంట్రీబ్యూషన్ పింఛన్ పథకంతో విశ్రాంత అధికారులకు సింగరేణి ఆర్థిక ధీమా
- తొలి విడతలో రూ.19.5 కోట్లు ఎల్ఐసీకి చెల్లింపు
- దశల వారీగా రూ.271 కోట్లు జమ చేయనున్న యాజమాన్యం
దశాబ్దాల పాటు సింగరేణికి సేవలు అందించిన అధికారుల విశ్రాంత జీవితాలను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేయడానికి సింగరేణి సంకల్పించింది. విశ్రాంత అధికారుల జీవితాల్లో వెలుగులు నింపే నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2007 నుంచి సింగరేణిలో పనిచేసిన, చేస్తున్న అధికారుల్లో మనోధైర్యం నింపేందుకు, వారు తమ విశ్రాంత జీవితంపై ఆందోళన చెందకుండా ఆత్మ గౌరవంతో జీవించేందుకు సింగరేణి ఎగ్జిక్యూటివ్ డిఫైన్డు కాంట్రీబ్యూషన్ పింఛన్ పథకాన్ని (ఎస్‌సీసీఎల్ ఈడీసీపీఎస్) ప్రారంభించింది. ఈ పథకం కింద మొదటి విడతలో 389 మంది విశ్రాంత అధికారుల తరఫున రూ.19.5 కోట్ల ను ఎల్ఐసీలో జమ చేసినట్లు సింగరేణి ఈడీసీపీఎస్ ట్రస్టు ఛైర్మన్, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరాం తెలిపారు. అలాగే ఈ పథకం వివరాలను ఆయన వెల్లడించారు.
ఏమిటీ ఈడీసీపీఎస్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ సంస్థల్లో పనిచేస్తున్న అధికారుల ఆరోగ్య, ఆర్థిక భద్రత కోసం వారి బేసిక్, డీఏలో గరిష్టంగా 30 శాతానికి మించకుండా సూపరాన్యుయేషన్ నిధిని కేటాయించాలని రెండో వేతన సవరణ సంఘం 2007లో సిఫార్సు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ల విభాగం(డీపీఈ) మార్గనిర్దేశాల ప్రకారం ఆర్థిక వ్యయాన్ని భరించే స్థోమత ఉన్న సంస్థలు మాత్రమే అధికారుల కోసం ఎగ్జిక్యూటివ్ డిఫైన్డు పింఛన్ పథకం, ఎగ్జిక్యూటివ్ మెడికేర్ పథకాలను రూపకల్పన చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
Also Read : రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
ఈడీసీపీఎస్ ట్రస్టుకు ఆదాయపు పన్ను మినహాయింపు
సింగరేణి సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు 2019 మే 6వ తేదీన సింగరేణి ఎగ్జిక్యూటివ్ డిఫైన్డు కాంట్రీబ్యూషన్ పింఛన్ పథకం అమలుకు ఆమోదం తెలిపారు. 2019లో ఆగస్టు 30నలో సింగరేణి ఎగ్జిక్యూటివ్ డిఫైన్డు కాంట్రీబ్యూషన్ పింఛన్ పథకం అమలు కోసం ప్రత్యేకంగా సింగరేణి ఎగ్జిక్యూటివ్ డిఫైన్డు కాంట్రీబ్యూషన్ పింఛన్ ట్రస్టును(ఎస్‌సీసీఎల్ ఈడీసీపీఎస్) ప్రారంభించారు. అనంతరం జనవరి 2020లో ఈ పథకానికి ఆదాయపు పన్ను మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కరోనా మహమ్మారి కారణం విధించిన లాక్‌డౌన్‌తో కొంత జాప్యం జరిగినప్పటికీ సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎన్. శ్రీధర్, డైరెక్టర్లు (అడ్మినస్ట్రేషన్, ఆపరేషన్స్) ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరాం నిర్విరామ కృషితో 2021 జనవరి 19న ఆదాయపు పన్ను మినహాయింపు లభించడంతో పథకం అమలుకు మార్గం సుగమం అయింది.
రూ.271 కోట్లు జమ చేసిన సింగరేణి
2007 జనవరి 1 నుంచి సింగరేణి సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన, స్వచ్ఛంధ పదవీ విరమణ పొందిన వారు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగంలో మరణించిన అధికారి భార్యకు కూడా ప్రయోజనాలు అందిస్తారు. 2007 నుంచి అధికారులకు అందుతున్న బేసిక్, డీఏలో 9.84 శాతాన్ని యాజమాన్యం ఈడీసీపీఎస్ పథకం కింద జమ చేస్తూ వచ్చింది. అయితే 2017 అక్టోబరు 1 నుంచి యాజమాన్యం వాటాను 6.99 శాతానికి సవరించడం జరిగింది. ఈ మొత్తం సొమ్మును కేవలం సింగరేణి యాజమాన్యం మాత్రమే చెల్లిస్తోంది. మార్చి 31, 2020 నాటికి రూ.271 కోట్లను ఈ పథకం కింద జమ చేయడం విశేషం.
Also Read : సీఎంకు సింగరేణి ప్రగతి నివేదిక
మృతిచెందిన అధికారుల కుటుంబాలకు చేయూత
ఎగ్జిక్యూటివ్ డిఫైన్డు కాంట్రీబ్యూషన్ పింఛన్ పథకం కింద విశ్రాంత అధికారి తరఫున యాజమాన్యం జమ చేసిన మొత్తంతో రూ.వెయ్యి పింఛన్ రాని పక్షంలో ఆ సొమ్మును విశ్రాంత అధికారికే ఇవ్వడానికి ట్రస్టు నిర్ణయించింది. ఇప్పటికే రూ.2 లక్షల కన్నా తక్కువ మొత్తం జమ అయిన సుమారు 261 మందికి రూ.3 కోట్ల ను యాజమాన్యం పంపిణీ చేసింది. అలాగే విశ్రాంత అధికారి చనిపోయిన పక్షంలో వారి తరఫున జమ చేసిన మొత్తాన్ని కూడా వారి జీవిత భాగస్వామికి లేదా నామినీకి ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఫండ్ మేనేజర్‌గా ఎల్ఐసీ
సింగరేణి ఎగ్జిక్యూటివ్ డిఫైన్డు కాంట్రీబ్యూషన్ పింఛన్ పథకం నిధుల నిర్వహణ కోసం ఫండ్ మేనేజర్‌గా ప్రతిష్ఠాత్మక జీవిత బీమా సంస్థ ఎల్ఐసీని ఎంపిక చేశారు. విశ్రాంత అధికారులకు రెండో పింఛన్ అందించే యాన్యూటీ సర్వీసు ప్రొవైడర్లుగా ఎల్ఐసీ, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌తో ఒప్పందం చేసుకున్నారు. తొలి విడతగా 389 మంది అర్హులైన విశ్రాంత అధికారులకు యాన్యూటీ ప్రారంభించేందుకు వీలుగా శుక్రవారం (మార్చి 5) రూ.19.5 కోట్ల ను ఫండ్ మేనేజర్‌కు పంపించారు. వాళ్లందరూ కోరుకున్న యాన్యూటీ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వచ్చే నెల రెండో వారం నుంచి సీఎంపీఎఫ్ పింఛన్ తో పాటు మరో పింఛన్ కూడా మొదలు కానుండటం విశేషం. ఒకవేళ విశ్రాంత ఉద్యోగి కోరుకుంటే యాజమాన్యం జమ చేసిన మొత్తంలో మూడోవంతును ఆయనకు ఇచ్చే వెసులు బాటును కల్పించారు. మిగిలిన మొత్తంపై పింఛన్ పొందే అవకాశం ఉంది. మిగిలిన విశ్రాంత అధికారులకు, పనిచేస్తున్న అధికారులకు సంబంధించిన రూ.300 కోట్లను త్వరలోనే ఎల్ఐసీకి బదిలీ చేయనున్నారు. వారికి కూడా అతిత్వరలోనే మరో పింఛన్ అందనుంది.
Also Read : సింగరేణిలో ఎంఎల్సీ ఎన్నికల లొల్లి
విశ్రాంత అధికారులు, అధికారుల కోసం ఈడీసీపీఎస్‌ను అమలు చేస్తుండటంపై సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షులు జక్కం రమేశ్, జనరల్ సెక్రటరీ ఎన్.వి.రాజశేఖర్ రావు, విశ్రాంత అధికారుల సంఘం నాయకులు వాసుదేవరావు, దత్తాత్రేయులు సంస్థ సి & ఎండి ఎన్ శ్రీధర్ కు డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలియ చేశారు.
విశ్రాంత అధికారులకు వరం
సింగరేణి సంస్థలో అమలు చేస్తున్న ఈ పథకం విశ్రాంత ఉద్యోగులకు, పనిచేస్తున్న వారికి ఆర్థిక భద్రత లభిస్తుందని ఈడీసీపీఎస్ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. సంస్థ లాభాల్లో ఉంటే ఉద్యోగులకు, అధికారులకు ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సింగరేణిని అభివృద్ధి పథంలో నిలపాలి
ఈడీసీపీఎస్ పథకం కోసం సింగరేణి దాదాపు 271 కోట్ల రూపాయలను కేటాయించింది. తొలి దశలో 389 మంది విశ్రాంత అధికారుల తరఫున 19.5 కోట్లు ఎల్ఐసీకి అందించాం. రానున్న రోజుల్లో పదవీ విరమణ పొందిన మరో 500 మందికి సంబంధించిన 52 కోట్ల రూపాయలను కూడా ఎల్ఐసీకి డిపాజిట్ చేయనున్నాం. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇలాంటి పథకాలేవీ అమలు కావు. అందుకే మరింత పట్టుదలతో పనిచేసి సంస్థను లాభాల బాటలో నిలిపాలని అప్పుడే నిరాటంకంగా సంక్షేమ పథకాలను పొందడం సాధ్యం అవుతుందని ఈడీసీపీఎస్ ట్రస్టు ఛైర్మన్ ఎన్.బలరాం అన్నారు.