Friday, January 3, 2025

131 వ ఏట అడుగుపెట్టిన సింగరేణి

  • బ్రిటిష్ హయాంలోనే ప్రభుత్వరంగ సంస్థగా రాణింపు
  • ఉద్యోగులు అనారోగ్యం పాలైతే పిల్లలకు ఉద్యోగాలు
  • విద్యుదుత్పత్తిలోనూ ముందంజ

దేశంలోనే  మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే సింగరేణి ప్రభుత్వరంగంలో ఉన్నది. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన సింగరేణికి 131 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1920 డిసెంబరు 23న సింగరేణి లిమిటెడ్ కంపెనీగా మారింది. రాష్ట్రం 51శాతం, కేంద్రం 49 శాతం వాటా తో సంస్థ పబ్లిక్ సెక్టార్ గాఉంది.  బ్రిటీష్ కాలం నాటి నుంచే సింగరేణి ప్రభుత్వరంగంలో కొనసాగుతూ వస్తున్నది. 1990 దశకంలో రెండు సార్లు బీఐఎఫ్ఆర్ లోనికి వెళ్లి దాదాపు ఖాయిలా జాబితాలో పడి బయటకు వచ్చిన మొట్టమొదటి ప్రభుత్వ రంగసంస్థ సింగరేణి ఒక్కటే.  ఈ సంవత్సరం డిసెంబరు 23 నాటికి సింగరేణి లిమిటెడ్ సంస్థగా మారి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భం ఇది.

బొగ్గు తవ్వకాలు ప్రారంభించినప్పటి నుంచి 2020 నాటికి సింగరేణి 131 సం వత్సరాలలో అంటే 13 దశాబ్దాలలో 1490 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఐతే గడిచిన ఆరు సంవత్సరాలలో తెలంగాణ ఏర్పడిన తర్వాత 365 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పతి చేసింది. అంటే మొత్తం ఉత్పత్తిలో 22 శాతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించేందేనని సగర్వంగా పేర్కొనవచ్చు. డిసెంబరు 23న సింగరేణి తన వందవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. లిమిటెడ్ కంపెనీగా మారిననాటి నుంచి ఆవిర్భావ దినోత్సవాన్ని లెక్కలోకి తీసుకున్నారు.సంస్థ నష్టాల నుంచి బయట పడి 1998 నుంచి లాభల్లోకి వచ్చింది.  సింగరేణి 2001-02 నుంచి కార్మికులకు తన నికర లాభాల నుంచి వాటా బోనసు ను కార్మికులకు  చెల్లిస్తూ వస్తోంది.

లాభాలలో వాటా ఉద్యోగులకు బోనస్ రూపంలో

భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థలలో ఎక్కడా కూడా లాభాలలో వాటా బోనస్ ను ఉద్యోగులకు పంచి ఇస్తున్న సంస్థ లేదు. సింగరేణిలో మాత్రమే రెండు దశాబ్దాలుగా కార్మికులు లాభాలలో వాటా బోనసను పొందుతున్నారు. డిపెండెం ట్ ఎంప్లాయిమెంట్ ను కూడా అనారోగ్యంగా ఉన్న కార్మికుల ఇన్ వ్యాలిడేషన్ అనంతరం రెండు సంవత్సరాల మిగులు సర్వీసు నిబంధనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు కొనసాగిస్తున్నారు. కోల్ ఇండియాకు అదనంగా సింగరేణిలో పలు సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిచడం జరిగింది.

కార్మికుల ఆదాయంపన్ను మాఫ్ చేయాలని కేంద్రానికి రాష్ట్రం సిఫార్సు

కార్మికులకు ఇన్ కం ట్యాక్స్ మాఫీ చేయాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటే అతిశయోక్తి కాదు. తెలం గాణ రాకముందు 12 వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉండగా 118 శాతం వృద్దితో 26 వేల కోట్ల రూపాయలు టర్నోవరు సింగరేణి పెంచుకోవడం జరిగింది. 2019 సంవత్సరంలోనే 325 శాతం వృద్ధితో 11 వందల కోట్ల రూపాయలు లాభాలను సంస్థ గడించింది. ఇంతటి వృద్ధి రేటును దేశంలోని ఏ ఇతర బొగ్గుసంస్థ కాని, ప్రభుత్వరంగ సంస్థ కాని సాధించిన దాఖళా లేదు. సింగరేణి చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డులతో సంస్థ దుసుకువెళ్తున్నది. ఇతర రాష్ట్రాలలోనూ బొగ్గుగనులను తీసుకొని తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒడిస్సా రాష్ట్రంలోని నైనీ, పార్థపదా బొగ్గుగనులను గతంలో తీసుకున్నారు. ఈ గనుల నుంచి ఏటా 10 నుంచి 30 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

30 విద్యుత్ అవసరాలు తీర్చుతున్న సింగరేణి

నైనీ బొగ్గు బ్లాకు నుంచి 2021లో అలాగే పార్థపదా బొగ్గుబ్లాకు నుం చి మరో రెండేళ్లలో బొగ్గును ఉత్పత్తి చేసే ప్రణాళికలను రూపొందించడం జరిగింది. సింగరేణి స్వంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేసిన 1200ల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు నుంచి రాష్ట్రానికి విద్యుత్తును అందిస్తూ 30 శాతం రాష్ట్ర విద్యుత్ అవసరాలను సంస్థ తీరుస్తున్నది. దీని వల్లా సంస్థకు ప్రతి సంవత్సరం నాలుగు వందల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. సోలార్ విద్యుత్ రంగంలోనూ అడుగు పెట్టి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 30 మెగావాట్ల వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

యువతకు ఉద్యోగాల కల్పన

డిపెండెంటు, ఇతర మొత్తంగా 12 వేల వరకు ఉద్యోగాలను సింగరేణి గడిచిన 5 సంవత్సరాలలో యువతకు కల్పించడం జరిగింది. ఉద్యోగులకు స్వంత గృహం నిర్మించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం, ఇంటింటికి ఏసీలు పెట్టుకునే అవకాశంతో పాటు సింగరేణి విస్తరించి ఉన్న జిల్లాలలో 2015 నుంచి ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్టుకు 2500 కోట్ల రూపాయలు సింగరేణి ఇవ్వడం జరిగింది.  దీనితోనే అభివృద్ధి పనులు జరుగు తున్నాయి.  సింగరేణికి మరో 150 సంవత్సరాల భవిష్యత్తు ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి తీరంలో విస్తరించి ఉన్న సింగరేణికి సబంధించిన అన్వేషణ విభాగం గుర్తించిన బొగ్గు నిక్షేపాలు 11 వేల మిలియన్ టన్నులకు పైగా ఉన్నాయి. ఐతే వందవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సింగరేణి భవిష్యత్తు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి అమలు చేస్తున్న ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రైవేటు మల్టీ నేషనల్స్ తో కలిసి వేలంలో పాల్గొంటే తప్ప కొత్త బొగ్గుబ్లాకులు సింగరేణికి కేటాయించే పరిస్థితి లేదు. అటు కోల్ ఇండియా దుస్థితి కూడా ఇలాగే ఉంది.

కేంద్రం అనుమతి రాని కారణంగా 6 బొగ్గుబావుల తవ్వకం నిలిపివేత

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెంట్లు, పన్నులు, రాయల్టీల పేరిట ప్రతి సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న సింగరేణికి ఇప్పుడు కొత్త బ్లాకులు వచ్చే పరిస్థితి లేదు. కొత్త బ్లాకులు రావాలంటే వేలంలో పాల్గొనాల్సిందే. ఈ పరిస్థితులలో ఇటీవల సింగరేణి తవ్వాలని నిర్ణయించుకొని బడ్జెట్ ను కూడా కేటాయించుకున్న తెలంగాణలోని ఆరు బొగ్గుబ్లాకుల తవ్వకాన్ని కేంద్రం కేటాయించని కారణంగా ఉపసంహరిచుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకున్నట్టు మాత్రం కనబడడం లేదు. వాస్తవానికి సింగరేణి అంటే తెలంగాణకు గుండెకాయ లాంటిది. వేలాది మందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించే తల్లిలాంటిది. అలాంటి సంస్థను ప్రభుత్వరంగంలో కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపై ఉంది.

దశాబ్దాల పోరాట చరిత్ర

స్వాతంత్రానికి ముందు నుంచి ప్రభుత్వరంగంలో ఉన్న సింగరేణిలో కార్మిక సంఘాలకు కూడా దశబ్దాల పోరాట చరిత్ర ఉంది. హక్కుల కోసం 1936లో ఉబాసిలాల్ ఫాసి అనే కార్మికుడి నేతృత్వంలో 13 రోజులు సమ్మె జరిగిన దాఖలాలున్నాయి. 1945 నుంచి కార్మిక సంఘాల కార్యకలాపాలు, పోరాటాలు కొనసాగుతున్నాయి. 1998 నుంచి దేశంలోని ఎక్కడా బొగ్గు సంస్థలలో లేని విధంగా యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి సింగరేణిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు జరగకుంటే ఇంత అభివృద్ధి, సంక్షేమం భవిష్యత్తులో ప్రశ్నార్థకం అవుతందంటే అతిశయోక్తి కాదు.కొత్త బొగ్గు బ్లాక్ల విషయంలో సీరియస్ గా ఆలోచించాలి.

(ఈ నెల 23న సింగరేణి 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా)

ఇదీ చదవండి:కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఆందోళన

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles