- బ్యాంకాక్ వేదికగా టూర్ ఫైనల్స్ షురూ
- శ్రీకాంత్ కూ తప్పని తొలిరౌండ్ ఓటమి
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలలో భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. కరోనాతో గత ఏడాదిగా స్తంభించిపోయిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. గతవారం ముగిసిన థాయ్ ఓపెన్ క్వార్టర్స్ లో పరాజయం పొందిన సింధుకు ర్యాంకింగ్స్ ఆధారంగా…బ్యాంకాక్ దికగానే జరుగుతున్న ప్రపంచ టూర్ బ్యాడ్మింటన్ ఫైనల్స్ లో పాల్గొనే అవకాశం దక్కింది. ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మొదటి ఎనిమిది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ల కు మాత్రమే గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ గా జరిగే ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. తాయ్ జు ఇంగ్, రచనోక్ ఇంటానాన్, పోర్నపావీ చోచువాంగ్ లతో కూడిన గ్రూపు రౌండ్ రాబిన్ లీగ్ లో సింధు తలపడాల్సి వచ్చింది.
ప్రపంచ టాప్ ర్యాంక్ ప్లేయర్ తాయ్ జు ఇంగ్ తో సింధు మూడుగేమ్ ల పాటు పోరాడి ఓడింది.
16వ ఓటమి:
తైవాన్ ప్లేయర్ తాయ్ జు ఇంగ్ తో హోరాహోరీగా సాగిన మూడుగేమ్ ల పోరులో 21-19, 12-21, 17-21తో సింధు పరాజయం చవిచూడాల్సి వచ్చింది. మొత్తం 59 నిముషాలపాటు నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోటీ తొలిగేమ్ ను 21-19తో గెలుచుకొన్న సింధు…కీలకరెండోగేమ్ లో అదే దూకుడు కొనసాగించలేకపోయింది. 12-21తో రెండు, 17-21తో మూడోగేమ్ చేజార్చుకోడం ద్వారా ఓటమితో రౌండ్ రాబిన్ లీగ్ ను ప్రారంభించాల్సి వచ్చింది.2018 ప్రపంచ టూర్ విజేతగా నిలిచిన సింధు…రౌండ్ రాబిన్ లీగ్ రెండోరౌండ్ మ్యాచ్ లో థాయ్ స్టార్ రచనోక్ ఇంటానాన్ తో తలపడాల్సి ఉంది. తన కెరియర్ లో తాయ్ జు ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ 21సార్లు తలపడిన సింధుకు ఇది 16వ పరాజయం కావడం విశేషం.
ఇది చదవండి: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ కు సింధు, శ్రీకాంత్
మరో గ్రూపు రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ సీడ్ కారోలినా మారిన్, యాన్ సీ యంగ్, మిషెల్లీ లీ, ఎవజీనియా కోసెట్సాకాయా ఢీ కొంటున్నారు.
కిడాంబీ శ్రీకాంత్ కు తొలిషాక్:
పురుషుల సింగిల్స్ గ్రూప్ రౌండ్ రాబిన్ లీగ్ తొలిమ్యాచ్ లో ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు, డేనిష్ ప్లేయర్ యాండర్స్ యాంటోన్ సెన్ చేతిలో భారత ఆటగాడు కిడాంబీ శ్రీకాంత్ పరాజయం చవిచూశాడు. తొలిగేమ్ ను 21-15తో నెగ్గి శుభారంభం చేసిన శ్రీకాంత్…ఆ తర్వాతి రెండుగేమ్ లను 16-21, 16-21తో చేజార్చుకొని ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ రౌండ్ రాబిన్ లీగ్ లో తలపడుతున్న ఆటగాళ్లలో ప్రపంచ నంబర్ వన్ కెంటో మోమాటో, విక్టర్ యాక్సిల్ సన్, టో టీన్ చెన్, ఆంథోనీ జింటింగ్, లీ జీ జియా ఉన్నారు. కరోనా నిబంధనల కారణంగా చైనా స్టార్ ప్లేయర్లందరూ…బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న టోర్నీలకు దూరంకాక తప్పలేదు.
ఇది చదవండి: క్రీడాకారులకు పద్మ అవార్డులు