- థాయ్ లాండ్ వేదికగా 2021 టూర్ ఫైనల్స్
- అర్హత సాధించిన సింధు, శ్రీకాంత్
కరోనా దెబ్బతో గత ఏడాదికాలంగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలకు దూరమై ఇంటిపట్టునే గడిపిన భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్లు పీవీ సింధు, కిడాంబీ శ్రీకాంత్ 2020 ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ ఫైనల్స్ కు తమతమ ర్యాంకింగ్స్ ప్రాతిపదికన అర్హత సంపాదించారు. ప్రతి ఏడాది బ్యాడ్మింటన్ సీజన్ ముగిసిన వెంటనే పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్,మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో మొదటి ఎనిమిది ర్యాంకుల్లో నిలిచిన క్రీడాకారులు, జట్ల మధ్య… టూర్ ఫైనల్స్ టోర్నీని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సంఘం నిర్వహిస్తూ వస్తోంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్ కార్యకలాపాలు స్తంభించిపోడంతో క్రీడాకారులంతా తమతమ నివాసాలకే పరిమితమయ్యారు. అయితే…2021 సీజన్ ను థాయ్ లాండ్ ఓపెన్ తో తిరిగి ప్రారంభించారు.
ఇది చదవండి: ఖాళీ స్టేడియంలోనే చెన్నై వేదికగా టెస్టులు
బ్యాంకాక్ వేదికగా ముగిసిన థాయ్ ఓపెన్ సెమీస్ రౌండ్ చేరడంలో సింధు విఫలం కాగా శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ఇద్దరూ గత ఏడాది మార్చి వరకూ జరిగిన టోర్నీల్లో కనబరచిన ప్రతిభ ప్రాతిపదికన పురుషుల, మహిళల సింగిల్స్ మొదటి ఎనిమిది ర్యాంకుల్లో చోటు సంపాదించగలిగారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ మొదటి ఎనిమిది స్థానాలలో నిలిచిన క్రీడాకారులకు మాత్రమే టూర్ ఫైనల్స్ టోర్నీలో తలపడే అవకాశం ఉంటుంది.
చైనా నుంచి థాయ్ లాండ్ కు :
వాస్తవానికి 2020 టూర్ ఫైనల్స్ టోర్నీని చైనా వేదికగా డిసెంబర్ లోనే నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనావైరస్ కు మూలకారణమైన చైనా నుంచి ఆటోర్నీని థాయ్ లాండ్ కు తరలించారు. జనవరి 27 నుంచి ఐదు రోజులపాటు జరిగే ఈటోర్నీలో నెగ్గిన ప్లేయర్లకు భారీ ప్రైజ్ మనీతో పాటు ర్యాంకింగ్ పాయింట్లు సైతం దక్కనున్నాయి. మరోవైపు థాయ్ లాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ విభాగాలలో సెమీఫైనల్స్ బెర్త్ లు సాధించినా రంకిరెడ్డి- చిరాగ్ షెట్టి, అశ్వనీ పొన్నప్ప- సాయిరాజ్ ల జోడీలకు టూర్ ఫైనల్స్ అర్హత లభించలేదు. దీంతో భారత క్రీడాకారుల పోటీ పురుషుల, మహిళల సింగిల్స్ కు మాత్రమే పరిమితమయ్యింది.
ఇది చదవండి: టోక్యో ఒలింపిక్స్ కు కరోనా గ్రహణం