Thursday, December 26, 2024

‘క్రిస్మస్’ తోనే సరళీకరణ మొదలయింది…

జాన్ సన్ చోరగుడి

క్రిస్టమస్ చిత్రాల్లో బాలుడైన జీసస్ పుట్టిన పశువుల పాకలో ఆయన్ని చూడడానికి వచ్చినవారిలో గొర్రెల కాపరులు, తూర్పుదేశ జ్ఞానులు ఇద్దరు ఒకేచోట కనిపిస్తారు. జీసస్ జనన గాధను ఒక వర్ణ చిత్రంగా మలచడానికి చిత్రకారులు వారిద్దరిని ఒకచోట చూపించడం అప్పట్లో జరిగి ఉండవచ్చు. అదెలా ఉన్నప్పటికి, సమాజంలో వేర్వేరు స్థాయిల్లో వున్న గొర్రెల కాపరులు, తూర్పుదేశ జ్ఞానుల-‘మీటింగ్ పాయింట్’ జీసస్ జనన స్థలం కావడం ఎలా సాధ్యమయింది? మున్ముందు జరగబోయే ఎటువంటి సరళీకరణ ప్రక్రియ కోసం, వారు ఇరువురిది అక్కడ భవిష్యత్ చరిత్రకు ఒక ప్రతీకాత్మక సంగమంఅయింది?  దాన్ని అర్ధం చేసుకోవడానికి క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత అన్నట్టుగా జరిగిన బైబిల్ చరిత్రలోకి మనం విహంగ వీక్షణం చేయవలసి ఉంటుంది. 

అధికులం అనుకునేవారు

మోషే ధర్మశాస్త్రాన్ని (మోజెస్ లా) పాటిస్తున్న యూదుమతం నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన యూదు జాతీయులు, అన్య జాతి వారిని ఆదిమ క్రైస్తవ సంఘాల్లోకి అనుమతించే విషయంలో కీ.శ. 48-49లో జరిగిన ‘జెరూసలేం కౌన్సిల్’ లో సవివరమైన చర్చ జరిగింది. దీనికి పాల్, బర్నబా హాజరయ్యారు. చర్చ జరుగుతున్న క్రమంలో- సున్నతి, యూదుల ఆహార నియమాలు, అన్యులు యూదులతో కలిసి భోజనం చేయవచ్చా? లేదా? అనే అంశాలు ‘జెరూసలేం కౌన్సిల్’ లో కీలక ‘ఎజెండా’ అయింది. ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇవి నిషిద్ధం. ఈ సమావేశం గురించి బైబిల్ అ .కా. 15:1-29 గలతీ 2: 1-21 లో సవివరంగా ఉంటుంది. 

యెహోవా దేవుడు అబ్రాహాముతో చేసిన ఒడంబడికను, ఎట్టి పరిస్థితులలోను తాము పాటించవలసినది అని, అందులోని నియమాలు అతిక్రమణకు అసాధ్యమైనవని యూదుల నమ్మకం. ఆది .కా. 17:14 లో చెప్పిన- “సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో, అట్టివాడు తన జనులలోనుండి కొట్టి వేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని (దేవుడైన యెహోవా) అబ్రాహాముతో చెప్పెను” ఇది, వారు తాము ప్రత్యేకించబడిన జాతిగా భావించడానికి దోహదం చేసింది. అది వారు ధర్మశాస్త్రాన్ని తు .చ. తప్పకుండా పాటించవలసిన తప్పనిసరి పరిస్థితిని ఆ జాతిపై మోపింది. దాంతో వారు సున్నతి లేని వారితో కలిసి జీవించలేని పరిస్థితి ఏర్పడింది.

యూదులు ఆదిమ క్రైస్తవులుగా మారి, అన్యులను ఆరాధనా స్థలం అంశాల మేరకు తమతో కలుపుకున్నప్పటికీ, వారిది యూదు జాతి కావడంతో, తాము మిగతా వారికంటే  ఆధిక్యకత కలిగి ఉన్నామని అనుకునేవారు. ఇక క్రైస్తవ్యంలోకి కొత్తగా వచ్చిన అన్యులలో కొందరికి అబ్రహాం గురించి, యూదులు పాటించే న్యాయనియమావళి గురించి తెలియక; సంఘంలో తమ చేరికతో యూదులు ఎందుకు అసహనానికి గురి అవుతున్నారో తెలిసేది కాదు. అటువంటి పరిస్థితుల్లో, అంతిమంగా ‘జెరూసలేం కౌన్సిల్’ జరిగింది.

కౌన్సిల్ఎలా మొదలయింది?

అప్పుడే కొత్తగా అంతియొక పట్టణంలో ఒక క్రైస్తవ సంఘం కొత్తగా ఏర్పడింది. యూదులు–అన్యజాతులు ఒకే ఆరాధనా స్థలంలో చేరడం అనే అంశం సంక్లిష్టం కావడంతో, ఆచరణలో దాన్ని ఎలా అమలుచేయాలో ఆ సంఘానికి బోధపడడం లేదు. యెరూషలేము పట్టణంలోని క్రైస్తవ సంఘం అప్పటికి ఎంతో ప్రభావశీలమైనది కావడంతో, ఈ సంక్లిష్ట విషయంలో వారు దాన్ని తమ మార్గదర్శిగా భావించారు. ‘సున్నతి’ ఉండాలా లేకపోయినా సంఘాల్లోకి అన్యులను అనుమతించవచ్చా అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం కంటే, యెరూషలేము సంఘం దీనిపైన తీసుకునే నిర్ణయం ముఖ్యం అని వారు ఒక అభిప్రాయానికి వచ్చారు. శక్తివంతమైన యెరూషలేము సంఘాన్ని కాదని విస్మరించి,  కొత్తదైన అంతియొక సంఘం సున్నితమైన ఈ అంశాన్ని తనకు తానుగా అమలులోకి తెచ్చే ప్రయత్నం చేసే ధైర్యం చేయలేక పోయింది. చివరికి వారు యెరూషలేము సంఘం దృష్టిలో దీన్ని ఉంచి, అక్కడి అపోస్తులు తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. 

అందుకు వారు యెరూషలేము సంఘానికి ఒక బృందాన్ని తమ పక్షంగా పంపాలని నిర్ణయం తీసుకుని, తమ సంఘం నుంచి కొందరు విశ్వాసులను ఎంపిక చేసి, వారికి పాల్, బర్నబా నాయకత్వం వహించేలా నిర్ణయం తీసుకుని, వారిని యెరూషలేము పంపారు.

సభలో జరిగింది ఏమిటి?

పాల్, బర్నబాు స్వీయ అనుభవాన్ని వెల్లడిస్తున్న చిత్రం

బైబిల్లో అపోస్తులు కార్యములులోని వివరాలు ప్రకారం- ఆ సంఘం నాయకులు, అపొస్తలులు, పెద్దలు అంతియొక నుంచి వచ్చిన బృందాన్ని తమ మధ్యకు స్వాగతించారు. పాల్, బర్నబాలు తమ స్వీయ అనుభవాన్ని (సాక్షం) అక్కడ వెల్లడించారు. దేవుడు వారి ద్వారా జరిగించిన కార్యాల వివరాలతో సహా వారు అక్కడ వెల్లడించారు. వారు తాము మారుమనస్సు పొందిన వైనం వివరిస్తూ, తాము వచ్చిన కార్యానికి దాన్ని ‘లింక్’ చేస్తూ అక్కడి సభికులకు చెప్పి ఉండాలి.

దాంతో అక్కడున్న సాంప్రదాయ యూదా మత విశ్వాసులు కొందరు లేచి- ‘మీరు సాధించిన విజయాలతో మాకు పనిలేదు, అన్యులు దేవాలయంలోకి రావాలంటే, ‘సున్నతి’ తప్పనిసరి, వారు మోషే ధర్మశాస్త్రాన్నితప్పనిసరిగా పాటించాలి’ అన్నారు. ఇక్కడ ‘తప్పనిసరిగా’ అనడం ద్వారా అది నేరుగా దేవుని వద్ద నుండి వచ్చిన నియమం- కనుక ‘సున్నతి’ చేయించుకోవాలా? అక్కరలేదా? అనే విషయంలో మన స్థాయిలో చర్చకు అవకాశం లేదు. అది చేయుంచుకోవడం ‘తప్పనిసరి’ అది ఎంతమాత్రం స్వచ్ఛందం కాదు, అని సాంప్రదాయ యూదు మతస్థుల వాదన.

పీటర్ వాదన

మాట్లాడుతున్న పీటర్

అక్కడ పరిస్థితి గ్రహించి తప్పనిసరై పీటర్ మాట్లాడ్డానికి లేచి నిలబడ్డాడు. దేవుడు మనకు వారికి మధ్య ఎటువంటి వ్యత్యాసము పెట్టలేదు అని స్పష్టం చేసాడు. ఎప్పుడు ఎవరితోనైతే వారి అశుభ్రత కారణంగా సాంప్రదాయంగా వారితో మనం సంబంధాలు లేకుండా ఉన్నామో, వారు తమ విశ్వాసం వల్ల అకస్మాత్తుగా పరిశుభ్రత కలిగినవారై మనలో కలిసినవారైనారు. ఇదంతా దేవుని అనుమతితో జరుగుతున్నది. అలా కనుక కాకుంటే, అన్యులైనప్పటికీ ఈ విషయంలో ఎందుకు వారు దేవుని పరీక్షకు గురిచేస్తారు? దేవుడు- తన పరిశుద్ధాత్మను వారి మీదకు కూడా అనుమతించాడు అంటేనే, ఆ ప్రజలను ఆయన తనవారిగా భావించి, అనుమతించి మరీ వారిని అక్కున చేర్చుకున్నట్టు. ‘ఒకడు రక్షింపబడవలెను అంటే, అది దేవుడైన యేసు కృప వల్లనే సాధ్యం’ అంటూ పీటర్ తన మాటలు ముగించాడు.  

పాల్ , బర్నబా ఏమన్నారు?

పాల్, బర్నబా తమ అనుభవాలను మరో మారు సభికులతో సవివరంగా పంచుకున్నారు. తమ ద్వారా అన్యుల మధ్యలో దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలను వారు వివరిస్తున్నపుడు, అక్కడ ఉన్నవారంతా ఎంతో ఏకాగ్రతతో ఆ విషయాలను ఆలకించారు. ఆ దశలో జాకబ్ లేచి చివరిగా విషయానికి ఒక ముగింపు ఇచ్చాడు.

జాకబ్ చెప్పింది…

చర్చకు ముగింపు బాధ్యత జాకబ్ పైపడింది. అప్పటివరకు జరిగిన చర్చ సారాంశం మొత్తం మరొకసారి క్లుప్తంగా చెప్పి, ఇదంతా ఎందుకు జరిగింది అంటే- “దేవుడు అన్యజాతుల పట్ల తనకున్న ఆపేక్షను వెల్లడించడానికి, ‘వారిని నా జనాంగం’ అంటున్నాడు” అని జాకబ్ ప్రకటించాడు. అప్పటివరకు- ‘నా జనాంగం’ అనే దేవుని పిలుపు యూదులకు తప్ప మరే ఇతర జాతులకు వర్తించేది కాదు. ఇదంతా లేఖనములో చెప్పబడిన ప్రకారము జరుగుతున్నదే తప్ప మరొకటి కాదు, అంటూ జాకబ్ తన వాదన కొనసాగిస్తూ- ఇప్పటి నుండి అన్య జనాంగము దేవుని ప్రజలుగా పిలవబడతారు అని ప్రకటించాడు.

చర్చకు ముగింపు పలుకుతున్న జాాకబ్

జాకబ్ ఇంకా కొనసాగిస్తూ- వారిని చేర్చుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతను విస్మరించలేము. దీన్ని యూదురాజ్య విస్తరణగా మనం చూడవలసి ఉంటుంది, అంటూ జాకబ్ ఇందుకు అవసరమైన లేఖన భాగాలను అక్కడివారికి వివరించి; ఇకముందు అన్యులు దేవుని వద్దకు రావడానికి, ‘సంఘము’ (చర్చి)వారికి ప్రవేశ  మార్గం అవుతుంది, అన్నాడు. కనుక “దేవుని వైపు తమ చూపును తిప్పుతున్న అన్యులకు, అది వారికి కష్టతరం కాకుండా చూద్దాం” అన్నాడు. అది అక్కడ తీసుకున్న తుది నిర్ణయం. దాంతో వివాదం ముగిసింది.

అపొస్తలుల డిక్రీ

యూదులు ధర్మశాస్త్ర బద్దులు కనుక, వారు తమ న్యాయ విధిని అనుసరించి జీవించవలసి ఉన్నది కనుక, అన్యులు వారి సంప్రదాయాలను గౌరవించవలెను. అందుకోసం అన్యులు  నాలుగు సూత్రాల ప్రణాళికను పాటించవలసి ఉంటుంది

1. విగ్రహాల వద్ద ఉంచిన ఆహారాన్ని తినరాదు

2. వ్యభిచారం చేయరాదు

3. రక్తం చిందించిన జంతువు మాంసమును మాత్రమే తినవలెను

4. జంతువుల రక్తము ఆహారముగా తినరాదు

ఈ నాలుగు కూడా ‘కామన్ సెన్స్’ కు సంబంధించినవి, ఏ విధంగానూ ఆచరణకు అసాధ్యమైనవి కాదు. కనుక, అన్యులు  వీటిని ఆచరిస్తే, యూదులకు వారితో సహవాసం విషయంలో ఎట్టి అభ్యంతరం లేదు. దీనిని-‘అపొస్తలుల డిక్రీ’గా ఆ సమావేశంలో ప్రకటిచడం జరిగింది.

పేదలను విస్మరించ వీలులేదు

‘జెరూసలేము కాన్ఫరెన్స్’ లో చివరి అంశం- ‘పేదలను విస్మరించడానికి వీలు లేదు’ అనే జాకబ్ ఉపదేశం. పాల్ దీన్ని ఆచరణలో చేసి చూపించాడు. అన్యుల సంఘాల్లో పాల్  సేకరించిన కానుకలను జెరూసలేములోని పేదల కోసం ఉపయోగించాడు. జీసస్ తర్వాత,‘క్రైస్తవ్యం’సరళీకరణ భావనగా ప్రపంచదేశాల్లో విస్తరించడానికి ఈ ‘కౌన్సిల్’ చేసిన తీర్మానం కారణం అయింది.

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles