ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వెలసిన ఈ దివ్యస్థానంలో ఏడాది పొడవునా నిత్య కల్యాణం పచ్చతోరణంలా ఎన్నో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. వాటిల్లో ప్రముఖమైంది ‘చందనోత్సవం’. వైశాఖ శుద్ధ తదియనాడు పగటిపూట స్వామివారి నిజరూప దర్శనం, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రాత్రిపూట చందన సమర్పణ నిర్వహిస్తారు.ఏడాది పొడవునా స్వామివారికి చందనాన్ని పూస్తూనే వుంటారు. ఎప్పుడూ చందనం పూతతోనే స్వామివారు దర్శనం ఇస్తూ వుంటారు. స్వామివారిపై ఉన్న చందనం మొత్తాన్ని తొలగించడం వల్ల స్వామివారి నిజరూప దర్శనం చేసుకొనే భాగ్యం దక్కుతుంది. దీనినే చందనోత్సవం, చందనయాత్ర అంటారు.
Also read: అక్షరానికి అందని అమ్మకు వందనం
పదేపదే చందన సమర్పణ
సంవత్సరం మొత్తం మీద కేవలం ఈ 12గంటలు మాత్రమే స్వామివారి నిజరూపం భక్తులకు కనిపిస్తుంది. అందుకే, ఈ ఉత్సవం కోసం భక్తులు సంవత్సరమంతా ఎదురుచూస్తూ వుంటారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతమే కాక, ఎక్కడెక్కడ నుంచో లక్షలాది మంది తరలి వస్తారు. ఇది ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు వస్తుంది. తదియనాటి రాత్రి చందన సమర్పణ చేస్తారు. ఇది చాలా విశేషమైన రోజు. నిజరూప దర్శనం అనంతరం బహు విడతల్లో మళ్ళీ స్వామివారికి చందనాన్ని పూస్తారు. తొలిగా 120కేజీల (మూడు మణుగులు) చందనాన్ని సమర్పిస్తారు. తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి దినాల్లో మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని పూతగా పూస్తారు. వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి స్వామివారి విగ్రహంపై ఉండే చందనాన్ని తొలగిస్తారు.
Also read: మనసుకవికి శతవత్సర వందనం
నడివేసవిలో నృసింహదర్శనం
దీనిని చందనోత్తరణం అంటారు.చందనోత్తరణం,నిజరూప దర్శనం, చందన సమర్పణ వరుసగా జరుగుతాయి. సహజంగా ఈ ఉత్సవాలు వేసవి కాలంలోనే వస్తాయి. దీనికి తోడు స్వామివారి నిజరూప దర్శన ప్రభావంతో సింహాచలం ప్రాంతమంతా వేడి సెగలతో భగభగమంటూ ఉంటుంది. సింహాచలంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ఉత్తరాంధ్రవాసులు ‘సింహాద్రి అప్పన్న’గా పిలుచుకుంటారు. కొండపై నిండుగా కొలువుండే ఈ స్వామి మాహాత్మ్యంపై ఎన్నో కథలుగాథలు లోకంలో ప్రసిద్ధంగా ఉన్నాయి.
Also read: బుధజన బాంధవుడు బూదరాజు
ప్రసిద్ధ వైష్ణవక్షేత్రం
విశాఖపట్నంకు 11కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పుణ్యక్షేత్రం సముద్ర మట్టానికి 244మీటర్ల ఎత్తులో కొండపై ఉంటుంది. దీనినే సింహాచలం,సింహగిరి, సింహాద్రి, అప్పన్నకొండ అనే పేర్లతో పిలుస్తారు. నృసింహస్వామి ఎందరికో ఇలవేలుపు. ముఖ్యంగా, ఉత్తరాంధ్రలో చాలామంది సింహాచలం, అప్పన్న, సింహాద్రి అనే పేర్లు పెట్టుకుంటారు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో సింహాచలం ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం.భారత ఇతిహాసాలు, పురాణాల ప్రకారం సింహాచలం అత్యంత ప్రాచీనమైంది. ఆధునిక చరిత్ర ప్రకారం సుమారు 11వ శతాబ్దం నుంచి కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. సింహ+ అచలం = సింహాచలం. అచలం అంటే చలనం లేనిది, స్థిరంగా ఉండేది అని అర్ధం.
Also read: ఆత్మీయునికి అశ్రునివాళి
రెండు అవతారాల కలయిక
మహావిష్ణువు దశావతారాలలోని వరాహనరసింహ అవతారల కలయిక ఈ స్వామి. స్థల పురాణం ప్రకారం మొదట్లో వరాహనరసింహస్వామి విగ్రహం ఉండేది. దాని ఆరాధన జరిగేది. చంద్రవంశానికి చెందిన పురూరవుడుకి ఆకాశవాణి ఒక ఆజ్ఞ చేస్తుంది. సంవత్సరం పొడవునా విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచుతూ, వైశాఖ శుద్ధ తదియనాడు చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేట్టు చెయ్యమని ఆమె చెపుతుంది. అప్పటి నుంచి ఈ ఆచారం వచ్చింది. వరాహనరసింహస్వామి దేవాలయన్ని పురూరవుడు నిర్మించాడని ప్రశస్తి. స్వామివారిలోని తీవ్రమైన వేడిని చల్లార్చడానికే ఏడాదిపాటూ చందనం సమర్పిస్తూ వుంటారు. ఈ నారసింహుని నిజరూపం త్రిభంగ ముద్రలో ఉంటుంది. దీనికి యోగశాస్త్ర పరంగా ఎన్నో విశేషాలు ఉన్నాయి. గజపతులు, తూర్పు గాంగులు, రెడ్డిరాజులు, శిలావంశజులు, మత్స్య వంశీయులు మొదలు ఎందరో ఈ దేవాలయ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. అనేక దానధర్మాలు చేశారు.
Also read: పత్రికాలోకాని వేగుచుక్క కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు
గొప్ప విద్యాకేంద్రం
శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎన్నో దానధర్మాలు చేశాడు. కుతుబ్ షాహీలు ఈ ప్రదేశంపై దండెత్తి, ఎంతో సంపదను దోచివేశారు. ఈ సంఘటన తర్వాత పద్మనాయక రాజులు స్వామివారి నిత్యనైవేద్య భోగాలకు నరవ అనే గ్రామాన్ని సమర్పించారు. సింహాచలక్షేత్రం గొప్ప విద్యాకేంద్రంగానూ విలసిల్లింది. కూచిమంచి తిమ్మకవి (1690-1757), కట్టమూరి రామేశ్వరకవి (1830-90) సింహాచల మాహాత్మ్యం, శ్రీలక్ష్మినృసింహ చరిత్రము మొదలైన ప్రబంధాలను రచించారు. గోగులపాటి కూర్మనాథకవికి కూడా ఈ దేవస్థానంతో అనుబంధం వుంది. కుళోత్తుంగ చోళుడు, వేంగి చాళుక్యులు కూడా ఈ దేవాలయన్ని దర్శించి స్వామివారి వైభవంలో పాత్రులయ్యారు.
Also read: బహుముఖ ప్రజ్ఞాశాలి కాళ్ళకూరి
అప్పన్న అన్నమయ్య కృష్ణమయ్య
శ్రీకృష్ణదేవరాయలు కూడా అనేకసార్లు ఈ దేవాలయన్ని దర్శించారు.తిరుమల వేంకటేశ్వరునికి అన్నమయ్య ఎలాగో, సింహాచలం నృసింహస్వామికి కృష్ణమయ్య అలాగా. ఈయన పూర్తిపేరు శ్రీకాంత కృష్ణమాచార్య. ఈయన వాగ్గేయకారుడు. అన్నమయ్య కంటే కూడా పూర్వుడు అని చెబుతారు. కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుని (1295-1323) కాలానికి చెందినవాడిగా గతంలో ‘భారతి’ పత్రికలో ప్రచురించిన వ్యాసాల ద్వారా తెలుస్తుంది. ఈ వ్యాసాలను నిడుదవోలు వెంకటరావు, తిమ్మావజ్ఝల కొండయ్య రాశారు. కృష్ణమయ్యను ప్రథమాంద్ర వచన నిర్మాతగా పేర్కొంటారు. కృష్ణమయ్య సింహాచలస్వామివారిపై అనేక కీర్తనలు రాశారు. ఎందరో వాగ్గేయకారులకు స్ఫూర్తినిచ్చిన తొలితరం పదకవితాచార్యుడు ఈయన.
Also read: సకల సద్గుణ సంపన్నుడు హనుమ
సింహగిరి వచనాలు
కృష్ణమయ్య సంకీర్తనలు పాడుతూ వుంటే, నృసింహస్వామి బాలుని రూపంలో వచ్చి నృత్యం చేసేవారని ఐతిహ్యం. జానపద బాణీలో వీరి కీర్తనలు సాగేవి. సామాన్యుడికి వేద, శాస్త్రరహస్యాలు చేరాలన్నది ఈ కవి ఆశయం. ఈయన రాసిన పదాలను ‘సింహగిరి వచనాలు’ అంటారు. వీరు రాసిన సాహిత్యం చాలా వరకూ నేడు అలభ్యం. చాలా తక్కువ కీర్తనలే దొరికాయి. సింహాచలంలో ‘కృష్ణమయ్య ప్రాజెక్టు’ను ఏర్పరచి, ఈ మహనీయుని పదకీర్తనలు, చరిత్రకు సుస్థిరస్థానాన్ని కల్పించాలి. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగాలి. కోట్లాది భక్తుల కొంగుబంగారమైన సింహాచలం నరసింహస్వామి దేవాలయ వైభవం మరింతగా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షిద్దాం.
Also read: మరో శ్రీనాథుడు మహాకవి దాసుశ్రీరాములు