Sunday, December 22, 2024

నిశ్శబ్ద గీతిక

కొన్ని ముఖాలు మాయమయ్యాయి ,  కొన్ని నిర్జీవ  నిశ్చలతతో బ్రతికే ఉన్నాయి.

కొన్ని రక్తారుణ దుఃఖాన్ని పులుముకున్నాయి.

కాలం చరిత్రకు కొన్ని కొత్త పుటలను కలుపుతూ

పాపప్రక్షాళనకు వాన రావాలని వేచివుంది.

విషం మింగిన నింగి నెలల తరబడి వమన ప్రయాసలో ఉండిపోయింది.

ఎక్కడికో ఎగిరి పోయిన పక్షులు తిరిగివచ్చి కాలి బూడిదైన గూడుల వద్ద

కూడబలుకు కున్నట్లు ఒక్కసారిగా రోదించాయి . 

గాయపడ్డ గాలులు మొన్నటి మర తుపాకుల  రణగొణ ధ్వనిని

కర్ణకఠోరంగా రోజు  ప్రతిధ్వనిస్తూనే ఉన్నా యి.

ఒకప్పటి పచ్చటి పచ్చిక బయళ్లు యుద్ధయాగాగ్నిలో

సమిధలైనాయి.

భూమాత తన గుండెలపై చెల్లా చెదురుగా చిమ్మబడ్డ

తన బిడ్డల మాంసాన్ని తనలోకి ఇమిడ్చుకోలేక

వేదన అనుభవిస్తుంటే,  అప్పుడే ముగిసిన యుద్ధపు

రక్త ఛిన్హాలు మోస్తున్న ప్రకృతి  ఆమెపై వడలి,  వాలి,  మోడు వారింది.

వృద్ధ విరించి తను వ్రాయని విధి

పుడమి పై వక్ర వాక్యాలుగా విస్తరిస్తుంటే 

తన వాడి పోతున్న కమల సింహాసనంపై

 నిస్తేజుడై వాలిపోయాడు.

మధుతప్త గళాలతో మత్తుగా శాంతి స్థాపనకు ప్రతినలు చేస్తున్న ఉన్మత్త నాయకుల

ప్రల్లదనాల వికృత ధ్వనిలో మునిగి  విగత  జీవాత్మల ఘోష నిశ్శబ్ద గీతిక అయ్యింది.

MAHATHI
MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles