మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీకృష్ణభగవానుడు మార్గశీర్షం ప్రాశస్త్యంగురించి భగవద్గీతలో వివరించాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ’ అంటూ ‘‘అన్ని మార్గాలను విడిచిపెట్టి, అత్యంత భక్తి ప్రపత్తులతో నన్ను శరణువేడు, తప్పక ఉద్దరింప బడతావు’’ అని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. “అనన్యచేతా స్వతతం యో మాం స్మరతి నిత్యం: తీస్యాహం సులభః పార్థ: నిత్యయుక్తస్య యోగినః” అని గీతాకారుడు నుడివి ఉన్నాడు.
ఎవడు అనన్యచిత్తుడై నన్ను యావజ్జీవం నిరంతరం స్మరిస్తుంటాడో, సదా సమాహిత చిత్తుడైన ఆ యోగికి నేను సహజ లభ్యుడను అని అర్థం.
ఈ గీతాసారాల ప్రకారం ఆండాళ్ కూడా అన్నీ విడిచిపెట్టి గోవిందుణ్ణి శరణు కల్గి ఉండడమే అన్న పరమోన్నతమైన ఆశయాన్ని లోకానికి ఉపదేశిస్తూ పై గీతోపదేశ సారాంశాన్ని సుస్పష్టం చేసింది.
పరమ పవిత్రమైన గోదాదేవి వ్రతం ఆరంభించి ఉపనిషత్తుల్యములైన పాశురములను అనుగ్రహించినది. పరోపకారార్ధం పది మందికి పంచేందుకు శ్రీవ్రతం లేదా తిరుప్పావు వ్రతాన్ని ఆచరించి, ఇష్ట సఖుడైన శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకోవడానికి 30 పాటలు లేదా పాశురాలను పాడింది. అవి ద్రావిడ భాషలో ఉన్నాయి. మార్గశిర మాసం మాసాల్లో గొప్పదని, అందరం కలిసి మార్గశిర వ్రతం ఆచరిద్దామని, నారాయణుడు తమ కోర్కెలు తప్పక తీరుస్తాడని వ్రేపల్లలోని గోపికలను రమ్మని పిలిచింది. హేమంత ఋతువు మార్గశిర ప్రధమ మాసంలో నందప్రజ కుమారికలు భగవంతుని మార్గాన్వేషణలో కాత్యాయనీ వ్రతం ఆచరించి నట్లు భాగవత దశమ స్కంధ పురాణ కథనం.
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్
మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః
‘‘వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువును’’ అంటూ సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతియోగంలో చెప్పిన శ్లోకమిది. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు వంటివారితో పాటు స్వయం భగవానుముఖతః ప్రకటితమైన శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం. సూర్యచంద్రుల సమాగమమును సంతరించుకున్న ఈ మాసం విష్ణు ఆరాధనతో మోక్షదాయిని అయింది.
ఒకప్పుడు మార్గశిరంలోనే సంవత్సరారంభం ఉండినట్లు వాడకంలో ఉంది. రుతువుల్లో హేమంత, మాసంలో మార్గశిరం మొదటివిగా ఋగ్వేద కాలంలో ఉండేవని ప్రమాణాలు ఉన్నాయి. నక్షత్రములు మృగశిరాదిగ, నెలలు మార్గ శీర్షమాదిగా లెక్కించెడివారు. అందువలన మార్గశిర మాసమునకు భగవానుడు ప్రాధాన్యత కలిగించాడు. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం. మార్గశీర్షం పరమ పవిత్రం. నక్షత్ర మండలంలో మూడు నక్షత్రాలు శీర్షాకృతిని పోలి ఉన్నందున “మృగశీర్ష” అని పేరువచ్చింది.
సంవత్సర ఆది విషువత్తు ఆధారంగా నిర్ణయించ బడేది. విషువత్తు అంటే రాత్రి దివసముల సమాన కాలము. మృగశిరా నక్షత్రముతో మనపూర్వ రుషులు విషువత్తు నిర్ణయం గావించారు. మృగశిరా విషువత్తుతో మొదలయ్యే కాలం మార్గశీర్షం.