- తనదైన శైలిలో మొబైల్ తో సిక్స్ కొట్టి ఉపన్యాసం ప్రారంభం
- ముఖ్యమంత్రితో భుజంభుజం కలిపి పని చేస్తానని ప్రకటన
- సిద్ధూ కుటుంబంతో తనకు దశాబ్దాల బంధం ఉన్నదన్న కెప్టెన్ అమరేందర్ సింగ్
- ఇద్దరి మధ్యా సయోధ్య కుదిరినట్టు సంకేతాలు
దిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడుగా మాజీ క్రికెటర్, శాసనసభ్యుడు, మాజీ పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారంనాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం పంజాబ్ భవన్ లో ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఇచ్చిన తేనీటి విందులో సిద్ధూ పాల్గొన్నారు. సిద్ధూను పీసీసీ అధ్యక్షుడుగా నియమిస్తున్నట్టు కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ప్రకటించిన తర్వాత వారిద్దరూ (సిద్ధూ, అమరేందర్) కలుసుకోవడం ఇదే ప్రథమం.
Also read: కాంగ్రెస్ కి రాహుల్-ప్రియాంక సారథ్యం
ప్రకటనలతో ప్రచ్ఛన్న యుద్ధం పరిసమాప్తి
కొన్ని మాసాలుగా ఇద్దరి మధ్యా ప్రకటనల యుద్ధం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రిపైన సిద్ధూ తరచు విమర్శనాస్త్రాలు సంధించేవారు. సిక్కు మతానికి అవమానం జరిగినా పట్టించుకోలేదనీ, విద్యచ్ఛక్తి చార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయనీ అమరేందర్ సింగ్ ప్రభుత్వంపైన బాణాలు వేశారు. సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేయడం మంచిది కాదనీ, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడూ ఒకే మతానికీ, ఒక కులానికీ చెందినవారు కావడం బాగుండదనీ, తానూ, సిద్దూ ఇద్దరం జాట్ సిక్కులమేననీ అమరేందర్ సోనియాగాంధీకీ, ఆమె నియమించిన ముగ్గురు నాయకుల కమిటీకి చెప్పి చూశారు. సోనియాగాంధీని తాను కలిసినప్పుడు సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించినట్టు చెప్పినప్పుడు, ‘‘అధిష్ఠానవర్గం’’ నిర్ణయం తనకు శిరోధార్యమని కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రకటించారు.
ఆ తర్వాత పంజాబ్ కు తిరిగి వెళ్ళిన తర్వాత తనను సిద్ధూ చాలా నిశితంగా, అన్యాయంగా విమర్శించారనీ, తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకూ ఆయనను కలుసుకోజాలననీ కెప్టెన్ ప్రకటించారు. సిద్ధూ బహిరంగ క్షమాపణ చెప్పలేదు. కానీ వారిద్దరి మధ్యా అధిష్ఠాన దూతలు రాయబారం చేసినట్టున్నారు. సయోధ్య కుదిర్చినట్టున్నారు. తాత్కాలికమైనదే కావచ్చు కానీ ఇద్దరి మధ్య సుహృద్భావం కనిపించింది. శుక్రవారం ఉదయం పంజాబ్ భవన్ లో జరిగిన టీ పార్టీలో ఇద్దరూ స్నేహంగానే మెలిగారు.
Also read: రేవంత్ బాటలోనే సిద్ధూ నియామకం
సిక్సర్ కొట్టినట్టు సంకేతం
ఆ తర్వాత అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న సునీల్ జాకఢ్, అమరేందర్ సింగ్ ల మధ్యన సిద్ధూ కూర్చొని కెప్టెన్ తో కబుర్లు చెప్పారు. తన పేరు పిలవగానే లేచి సభికుల కరతాళ ధ్వనుల మధ్య అభివాదాలు స్వీకరిస్తూ పోడియం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి చేరే ముందు చేతిలో ఉన్నమొబైల్ నే బ్యాట్ గా భావించి బంతిని సిక్సర్ కొడుతున్నట్టు గాలిలో తనదైన శైలిలో ఊపారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ప్రప్రథమంగా ప్రసంగిస్తూ, తనకు భేషజాలు లేవనీ, ఈ రోజు నుంచి పీసీసీ అధ్యక్షుడికీ, కార్యకర్తలకీ భేదం లేదనీ, అందరూ అధ్యక్షులేననీ, తాను ముఖ్యమంత్రితో భుజంభుజం కలిపి పనిచేస్తాననీ చెప్పారు. తమ మధ్య సమస్యలని పరిష్కరించుకోవాలనీ, ఈ సమస్యల కంటే దిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతుల గురించీ, పంజాబ్ లో వైద్యుల గురించీ, నర్సుల గురించీ పట్టించుకోవడం ముఖ్యమని అన్నారు. సిద్ధూ ట్రేడ్ మార్క్ కు అనుగుణంగా ‘‘జ్యాదానహీ బోల్నా సీ, పర్ విస్ఫోట్ బోల్నా సీ(ఎక్కువగా మాట్లాడకూడదు. కానీ మాట్లాడింది విస్ఫోటనంగా ఉండాలి,’’ అని పంజాబీలో చెప్పారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు కాకుండా ఈ రోజు పంజాబ్ లో కాంగ్రెస్ సమైక్యంగా ఉన్నదని సిద్ధూ సభికుల హరధ్వానాల మధ్య అన్నారు. ఇటీవల తనకూ, ముఖ్యమంత్రికీ మధ్య నడిచిన వాగ్యుద్ధానికి ప్రతీకగా ‘‘నన్ను వ్యతిరేకించేవారు నా ఉన్నతికే తోడ్పడతారు,’’ అని కెప్టెన్ ను పరోక్షంగా ఉద్దేశించి అన్నారు.
సంతోషంగా కనిపించిన అమరేందర్ సింగ్
కెప్టెన్ అమరేందర్ సింగ్ సరదాగా, సంతోషంగా కనిపించారు. కనీసం ఆ విధంగా కనిపించడానికి ప్రయత్నం చేశారు. ‘‘సిద్ధూ 1963లో పుట్టినప్పుడు నేను సైన్యంలో ఉన్నా. 1970లో సైన్యం నుంచి ఉద్యోగ విరమణ చేసినప్పుడు నన్ను రాజకీయాలలో చేరవలసిందిగా మా అమ్మగారు ప్రోత్సహించారు. ముందు సిద్ధూ తండ్రి భగవాన్ సింగ్ సిద్ధూని కలుసుకోమని చెప్పారు. అతడితో నాకున్న దశాబ్దాల అనుబంధం అటువంటిది,’’ అని సిద్ధూను చూపిస్తూ అమరేందర్ అన్నారు.
Also read: పంజాబ్ కథ మళ్ళీ మొదటికి
‘‘సోనియాగాంధీని కలుసుకున్నప్పుడు సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని అనుకున్నట్టు నాకు చెప్పారు. పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యమని చెప్పాను,’’ అంటూ వివరించారు. ఆమ్ ఆద్మీ హడావుడి చేస్తోందనీ, దానికంత బలం లేదనీ, ఆమ్ ఆద్మీకి పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నట్టు తన వద్ద సమాచారం ఉన్నదనీ అమరేందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి వంతపాడుతూ సిద్ధూ, దిల్లీ ప్రయోగాన్ని పంజాబ్ ప్రయోగం ఓడిస్తుందనీ, బాత్ ఖతమ్ (అంతే సంగతులు) అనీ అన్నారు. పంజాబ్ శాసనసభకి ఎన్నికలు వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరుగుతాయి.