- పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా
- ‘నేనెప్పుడో చెప్పాను’ అంటూ దెప్పి పొడిచిన అమరేందర్
- దిగ్భ్రాంతి చెందిన రాహుల్, ప్రియాంక
నవజోత్ సింగ్ సిద్ధూ అకస్మాత్తుగా పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. ఆయనకు మద్దతుగా మంత్రి రజియా సుల్తానా రాజీనామా చేశారు. పీసీసీ కార్యవర్గ సభ్యులు సైతం వైదొలుగుతామంటున్నారు. సోనియాగాంధీ చేతులలో నుంచి పార్టీ పగ్గాలను తాము తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం పంజాబ్ పీసీసీ అధ్యక్షుడుగా నవజోత్ సింగ్ సిద్ధూని నియమించడం. ఆ పని చేస్తే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పదవి నుంచి వైదొలుగుతారని తెలుసు. అయినా రిస్కు తీసుకున్నారు. అనుకున్నట్టు అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఒకరకంగా ఆయనకు పొగపెట్టారు. ఆయన వెళ్లిపోయారు. ఆయన స్థానంలో చరంజిత్ సింగ్ చన్నీ అనే దళితుడిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. అయినా సరే, వచ్చే ఎన్నికలలో సిద్ధూ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ పంజాబ్ వ్యవహారాల పర్యవేక్షకుడు హరీష్ రావత్ తో ప్రకటింపజేశారు.
Also read: పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రి చన్నీ
సిద్ధూ కోసమే చాలా సీనియర్ నేత, రాజీవ్ గాంధీ సహాధ్యాయి, పార్టీలో మంచి పేరున్న అగ్రనాయకుడు అయిన అమరీందర్ సింగ్ ను పోగొట్టుకున్నారు. సిద్ధూను సంప్రతించి, ఆయన సమ్మతి ప్రకారమే చన్నీని ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. కానీ సిద్ధూ అంటే సరిపడని కొందరికి మంత్రి పదవులు ఇచ్చారు. ముఖ్యమైన శాఖలు వారికి కేటాయించారు. ఇది జీర్ణించుకోలేకపోయిన సిద్ధూ తన నైజానికి తగినట్టు పీసీసీ పదవికి రాజీనామా చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి వైదొలిగి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలకు షాక్ ఇచ్చిన చందంగానే మరి మూడు మాసాలలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ లో సంక్షోభం సృష్టించి అన్నాచెల్లెలికి షాక్ ఇచ్చారు.
Also read: అవమానభారంతో గద్దె దిగిన అమరీందర్ సింగ్
క్రికెటర్ గా ఆవేశానికి లోనయ్యే అలవాటు ఉన్న సిద్ధూ రాజకీయాలలో సైతం అదే రకమైన ఆవేశకావేశాలను ప్రదర్శిస్తున్నారు. తనకు ఇష్టమైనట్టే పార్టీ నడుచుకోవాలనీ, ఏ మాత్రం తేడా వచ్చినా పార్టీ నాయకత్వాన్నిఖాతరు చేయకుండా తనకు తోచిన నిర్ణయం తీసుకుంటాననీ ఆయన మరోసారి చాటారు. ఆమ్ ఆద్మీపార్టీలో సిద్ధూకు ఆహ్వానం ఉన్నదని అంటున్నారు. మరో వైపు కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ కావడం కోసమే దిల్లీలో మకాం పెట్టారని అంటున్నారు. కేవలం రెండు మాసాల కిందట పంజాబ్ లో కాంగ్రెస్ మరో సారి గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావించారు. సిద్ధూ విజృంభించి, రాహుల్, ప్రియాంకలను ఊదరగొట్టి, వారిచేత తప్పులు చేయించి, చివరికి పార్టీలో మునుపెన్నడూ ఎరుగనటువంటి సంక్షోభాన్నిసృష్టించారు.
Also read: పీసీసీ పగ్గాలు చేతబట్టిన సిద్ధూ
ఒక వేళ ఇప్పుడు రాహుల్, ప్రియాంకాలు సిద్ధూతో మాట్లాడి పీసీసీఅధ్యక్షుడుగా కొనసాగటానికి ఒప్పించినప్పటికీ పార్టీ పరువు ఇప్పటికే యమునానదిలో కలిసిపోయింది. ఇప్పట్లో కోలుకోవడం కష్టం. కెప్టెన్ కనుక బీజేపీలో చేరితే, బీజేపీ అకాలీల మధ్య మళ్ళీ పొత్తు కుదురితే ఆ కూటమి గెలుపొందడం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం. ఆమ్ ఆద్మీ పార్టీని కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వాలని పంజాబ్ ప్రజలు నిర్ణయించినా ఆశ్చర్యంలేదు. ప్రస్తుత పంజాబ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం ఆమ్ ఆద్మీ పార్టీనే. మొత్తం మీద లక్షణంగా ఉన్న పంజాబ్ ను చేజేతులా చెడగొట్టుకున్నట్టు కాంగ్రెస్ చింతించవలసిన పరిస్థితి ఏర్పడింది. రాహుల్-ప్రియాంకా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని పంజాబ్ లో ఒక వినూత్న ప్రయోగం చేశామనీ, సీనియర్ నాయకుడిని ఇంటికి పంపించి నవజోత్ సిద్ధూను భావి నాయకుడిగా స్థాపించామనీ భావించారు. కానీ తాము ఎంపిక చేసిన నాయకుడు ఆవేశపరుడనీ, చంచల చిత్తుడనీ గుర్తించడంలో అన్నాచెల్లెలు విఫలమైనారని అనుకోవాలి. పప్పులో కాలేశారని భావించాలి.
Also read: రేవంత్ బాటలోనే సిద్ధూ నియామకం
Good