Sunday, December 22, 2024

రేవంత్ బాటలోనే సిద్ధూ నియామకం

  • మారిన గాంధీల వైఖరి
  • గెలుపు గుర్రాలపైనే పందెం కట్టాలని నిర్ణయం

కాంగ్రెస్ పార్టీలో సోనియా శకం ముగిసి రాహుల్ –ప్రియాకల శకం ఆరంభమైందనడానికి పంజాబ్ పీసీసీ అధ్యక్షుడుగా నవజోత్ సింగ్ సిద్ధూను నియమించిన తీరు నిదర్శనం. రేవంత్ రెడ్డి ఎంపికలో కూడా ఇదే స్పష్టంగా తెలిసివచ్చింది. రేవంత్ రెడ్డి విషయంలో సిద్ధూ వ్యవహారంలో ఉన్నన్ని మెలికలు లేవు. ఘర్షణ లేదు. పోటీ అంతగా లేదు. ఎన్నికలు నామమాత్రంగా నిర్వహించి మళ్ళీ రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ తీరు ఇట్లాగే ఉండబోతోంది.  

2019 ఎన్నకల సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించినప్పటికీ సోనియాగాంధీ, అహ్మద్ పటేల్ వంటి నాయకులతో సంప్రతింపులు ఉండేవి. వారు పార్టీలో మూడు, నాలుగు దశాబ్దాలుగా ఉంటూ సేవలందిస్తున్నవారికి ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేవారు. రాహుల్ గాంధీకేమో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, జితిన్ ప్రసాదా, మురళిదేవర, నవజోత్ సింగ్ సిద్ధూ వంటి యువనాయకులు సన్నిహితంగా ఉండేవారు. సీనియర్లు 23 మంది కలసి పార్టీ నడుస్తున్న తీరు పట్ల అసంతృప్తి వెలిబుచ్చుతూ సమర్థ నాయకత్వం అందించాలని బహిరంగ లేఖ రాసిన తర్వాత సీనియర్లపైన సోనియా విశ్వాసం తగ్గింది. అహ్మద్ పటేల్ మరణం తర్వాత సోనియా కుటుంబ సభ్యులతో సీనియర్ల తరఫున వాదించేవారు లేకుండా పోయారు. గులాంనబీ ఆజాద్, చిదంబరం, శశిథరూర్ వంటి పలుకున్న సీనియర్లూ పార్టీ అధిష్ఠానానికి దూరమైనారు.

Also read: నదీజలాల నిర్వహణ కేంద్రం చేతుల్లోకి

జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ లో సుమారు ఇరవై మంది ఎంఎల్ఏలతో పార్టీ నుంచి నిష్క్రమించి బీజేపీతో షరీకై కమల్ నాథ్ మంత్రివర్గాన్ని పడగొట్టడంతో యువమిత్రులపైన రాహుల్ నమ్మకం తగ్గిపోయింది. సింథియా కారణాలు సిథియాకు ఉన్నాయి. నిరీక్షణ అనంత కావడంతో ఓపిక నశించి తెగించారు. రాహుల్ ను నమ్ముకుంటే ప్రయోజనం లేదని భావించిన జ్యోతిరాదిత్య తన నిర్ణయం తాను తీసుకున్నారు. జ్యోతిరాదిత్యకు బీజేపీలో చేరడానికి పెద్దగా అభ్యంతరం లేదు. ఆయన నాయనమ్మ విజయరాజే సింథిగా బీజేపీ అగ్రనాయకులలో ఒకరుగా చెలామణి అయ్యారు. ఆయన మేనత్త వసుంధరరాజే సింథిగా రాజస్థాన్ లో బీజేపీ ముఖ్యమంత్రిగా పని చేశారు. తండ్రి మాధవరావ్ సింథియా మాత్రం రాజీవ్ గాంధీ, సోనియాగాందీలకు సన్నిహితంగా ఉంటూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే వరకూ కాంగ్రెస్ లోనే కొనసాగారు.

సిద్ధూ

సచిన్ సంగతి సపరేటు

సచిన్ పైలట్ విషయం భిన్నమైనది. జ్యోతిరాదిత్య చేరినంత తేలికగా బీజేపీలో సచిన్ చేరలేకపోయాడు. దానికి కారణం ఆయన నేపథ్యం. ఆయన కుటుంబంలో మొదటి రాజకీయ నాయకుడు తన తండ్రి రాజేష్ పైలట్. రాజేశ్ జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన వారసుడు సచిన్. పైగా సచిన్ జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారుఖ్ అబ్దుల్లా కుమార్తెను వివాహం చేసుకున్నాడు. హిందూత్వ సిద్ధాంతాన్ని పాటించే బీజేపీలో చేరడం ఆయనకు  కష్టం. అయినా సరే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆధిపత్యంలో అవమానాలకు గురి అవుతూ ఉండటం కంటే బీజేపీలో చేరుతున్నట్టు నటించి కాంగ్రెస్ లోనే గౌరవప్రదమైన పాత్ర సాధించాలని సచిన్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. జ్యోతిరాదిత్య వలె సచిన్ తగినంత మంది ఎంఎల్ఏలను తనతో తీసుకొని విడిదికి వెళ్ళలేదు. పైగా తనతో వచ్చిన ఎంఎల్ఏలలో కొంతమందిని అశోక్ గెహ్లాట్ వెనక్కి పిలిపించుకొని తాయిలాలు ఇచ్చి తన దగ్గరే పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ శాసనసభ్యుల సంఖ్యతో తేడా స్వల్పంగా ఉంది. జ్యోతిరాదిత్యతో వెళ్ళిన కాంగ్రెస్ ఎంఎల్ ఏలను మొత్తం ఎంఎల్ ఏ ల సంఖ్య నుంచి తగ్గిస్తే కాంగ్రెస్ బలం సగం కంటే తక్కువకు పడిపోయింది. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల ఆధిక్యం ఉంది. అందుకని కలమనాథ్ నిలదొక్కుకోలేకపోయారు.

Also read: పంజాబ్ కథ మళ్ళీ మొదటికి

రాజస్థాన్ లో కాంగ్రెస్ కీ, బీజేపీ కీ ఎంఎల్ఏల బలంలో మధ్యప్రదేశ్ కంటే ఎక్కువ వ్యత్యాసం ఉంది. పది మంది వెళ్ళిపోయినా గెహ్లాట్ ప్రభుత్వానికి గండం లేదు. పైగా సచిన్ పైలట్ ను బీజేపీ నాయకత్వం పూర్తిగా నమ్మలేదు. కాంగ్రెస్ తో జ్యోతిరాదిత్య మాదిరి తెగతెంపులు చేసుకొని రాగల తెగింపు సచిన్ లో ఉన్నదని వారు విశ్వసించలేదు. వారు ఊహించినట్టు గానే రాహుల్ గాంధీ, ప్రియాంక మాట్లాడే సరికి సచిన్ చల్లబడ్డారు. భవిష్యత్తులో తన అవకాశం కోసం ఎదురు చూడటానికి అంగీకరించారు. ఆ అవకాశం ఎన్నికలు వచ్చేవరకూ అందుబాటులోకి వచ్చే సూచనలు లేకపోయినా సచిన్ చేయగలిగింది ఏమీ లేదు. రాజస్థాన్ క్రీడలో ముఖ్యమంత్రి గెలిచారు. మధ్యప్రదేశ్ గోదాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓడిపోయారు.

పంజాబ్ సంగతి వేరు

ఈ రెండు రాష్ట్రాలకూ, పంజాబ్ కూ తేడాలు కొన్ని ఉన్నాయి. కెప్టెన్ అమరేందర్ సింగ్ బలవంతుడు. వ్యక్తిగత ప్రాబల్యం కలిగిన రాజవంశీయుడు. అవినితికి పాల్పడతాడనే పేరు లేదు. అవసరం కూడా లేదు. రాజవంశీయుడు కావడం వల్ల దళితులకూ, వెనుకబడినవర్గాలవారికీ దూరంగా ఉంటారని పేరు వచ్చింది. కాంగ్రెస్ ఎంఎల్ఏలకు కూడా ముఖ్యమంత్రితో ఇంటర్వ్యూ దొరకని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి తెలుగురాష్ట్రాలలో  ఉన్నప్పటికీ పంజాబ్ లో ఉన్నది జాతీయ పార్టీ కనుక, ఆ పార్టీకి అధిష్ఠానదేవతలు ఉంటారు కనుక, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చెప్పే ఫిర్యాదులు వారు చెవివొగ్గుతారు కనుక అసమ్మతికీ, ముఖ్యమంత్రికి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకోవడానికీ అవకాశం ఉంది. కెప్టెన్ అమరేందర్ సింగ్ ముభావి. సోనియాగాంధీతో మాత్రమే మాట్లాడతారు. అది కూడా చాలా ముఖ్యమైన విషయాలనే ఆమెతో చర్చిస్తారు. ఇతర ముఖ్యమంత్రుల లాగా ప్రతి చిన్న విషయానికీ అధిష్ఠానం అనుమతి తీసుకోవడం అంటూ ఆయన విషయంలో ఉండదు. సహజంగా అధికారం చెలాయిస్తన్న ముఖ్యమంత్రికి పార్టీలో అసమ్మతి ఉంటుంది. సిద్ధూ వంటి నాయకుడితో పెట్టుకున్నప్పుడు అసమ్మతివాదాన్ని ఎగతోసి అధిష్ఠానికి సమర్థంగా వినిపించే అవకాశం ఉంటుంది.

Also read: కాంగ్రెస్ లో చేరనున్న ఎన్నికల మాంత్రికుడు పీకే?

సిద్దూ మాటకారి

అమరేందర్ సింగ్ లాగా కాకుండా సిద్ధూ ఎక్కువగా మాట్లాడతారు. టీవీ షోలలో లాగానే రాజకీయ వేదికలపైన కూడా ఖుల్లంఖుల్లాగా మాట్లాడే స్వభావం ఆయనది. సోనియాగాంధీతో పాటు రాహుల్ తో, ప్రియాంకతో అతడికి సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ప్రియాంకతో నాలుగు గంటలు చర్చలు జరిపి ఆమె మద్దతు సంపాదించడంతో పాటు తన కేసును రాహుల్ కి ప్రియాంక చేత సిఫార్సు చేయించుకున్నారు.  తనను కలవమని ప్రియాంకతో రాహుల్ కి చెప్పించుకున్నారు. నాలుగు నెలలుగా సాగిన అసమ్మతి వ్యవహారంలో సోనియానూ, ఆమె పిల్లలనూ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుసుకునే అవకాశం సిద్ధూకి ఉంది. కెప్టెన్ ఒక్కసారి మాత్రమే సోనియాను కలిశారు. ఆమె నియమించిన నాయకత్రయంలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రావత్ తోనే రెండు, మూడు సార్లు కలుసుకున్నారు. గాంధీ కుటంబంతో సిద్ధూకు ఉన్నంత చొరవ అమరేందర్ కు లేదు. పార్టీ పదవులకు ఎన్నిక జరిపించకుండా నియామకాలతో కాలక్షేపం చేసే పార్టీలలో అధిష్ఠాన దేవతలతో సాన్నిహిత్యం కలిగిన నాయకులదే హవా. సోనియా దగ్గర ప్రవేశం  ఉన్న సిద్ధూను స్థానిక ఎంఎల్ఏలు విశ్వసిస్తారు. ముఖ్యమంత్రికి నలభై శాతం ఎంఎల్ఏల మద్దతు ఉంటే సిద్ధూకి అరవైశాతం ఎంఎల్ఏల తోడ్పాటు ఉంది. ముఖ్యమంత్రిపైన ఎంఎల్ఏలలోనే కాకుండా ప్రజలలో కూడా అసంతృప్తి ఉంది. పైగా ఆయన వయస్సు 79 ఏళ్ళు. 2017లోనే అవి తన చివరి ఎన్నికలనీ, ఇకమీదట ఎన్నికలలో పోటీ చేయబోననీ అమరేందర్ ప్రకటించారు. కానీ అయదేళ్లు అధికారంలో ఉన్న వ్యక్తికి మరో అయిదేళ్ళు కొనసాగాలని ఉండడం అత్యంత సహజం.

అమరేందర్ సింగ్ తో సిద్ధూ

అమరేందర్, సిద్ధూల మధ్య విభేదాలు

పోయిన అసెంబ్లీ ఎన్నికలలో అమరేందర్ సింగ్ తో కలసి సిద్ధూ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికలకు కొద్ది వారాల ముందే  బీజేపీని వీడి కాంగ్రెస్ తో ప్రవేశించారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందు ఆమ్ ఆద్మీలో చేరే ఆలోచన చేశారు. ఆమ్ ఆద్మ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో సమాలోచన చేశారు. కాంగ్రెస్ లో చేరడం ఉత్తమమంటూ సిద్ధూకి సలహా ఇచ్చిన వ్యక్తి ఎన్నికల మాంత్రికుడు ప్రశాంత్ కిషోర్ (పీకే). పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంలో కూడా పీకే పాత్ర ఎంతో కొంత ఉంటుంది. ఇటీవలే గాంధీ కుటుంబంతో మూడు, నాలుగు గంటలు పీకే భేటీ జరిగింది.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అమరేందర్ సింగ్ ముఖ్యమంత్రిగా, సిద్దూ ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ భావించారు. కానీ అందుకు అమరేందర్ సింగ్ అడ్డంకొట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఎన్నికలలో మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పార్టీ గెలిచింది.  ప్రధానిగా పదవీ ప్రమాణం చేయబోయే సందర్భంలో ఇస్లామాబాద్ కి తన అతిథిగా రావలసిందిగా క్రికెట్ మిత్రుడు సిద్ధూను ఆయన ఆహ్వానించారు. ప్రమాణానికి వెళ్ళి తన మానాన తాను తిరిగి రాకుండా అక్కడ కనిపించిన పాకిస్తాన్ సైనికాధికారిని కావలించుకున్నారు సిద్ధూ. అది వివాదాస్పదమైంది. కెప్టెన్ అమరేందర్ సింగ్ సిద్ధూ ప్రవర్తనను ఆక్షేపించారు. మంత్రివర్గ విస్తరణలో శాఖల మార్పిడి తనకు నచ్చని కారణంగా మంత్రివర్గంనుంచి సిద్ధూ రాజీనామా చేశారు. పీడవిరగడైనట్టు కెప్టెన్ భావించారు. దాదాపు మూడేళ్ళు మౌనంగా టీవీ షోలతో కాలక్షేపం చేసిన సిద్ధూ నాలుగునెలల కిందట రాజకీయ బ్యాటింగ్ ప్రారంభించారు. కెప్టెన్ అమరేందర్ సింగ్ కూ గుగ్లీలు వేయడం ఆరంభించారు. విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు. చివరికి సిక్సర్ కొట్టారు. మొదటినుంచి అమరేందర్ సింగ్ అంటే కొన్ని అభ్యంతరాలు ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంకా వద్రా 57 ఏళ్ళ సిద్ధూను ప్రోత్సహించారు. చివరికి జూనియర్ గాంధీలైన రాహుల్, ప్రియాంకాలు అనుకున్నట్టే సిద్ధూకు సోనియా పట్టం కట్టారు.

Also read: ఆఫ్ఘానిస్థాన్ లో మళ్ళీ తాలిబాన్ పాలనకు రంగం సిద్ధం!

నాదారి లేదా రహదారి

బీజేపీ తిరస్కరించిన నాయకుడంటూ సిద్ధూను కెప్టెన్ మద్దతుదారులు ఆటపట్టించినట్టే సిద్ధూ బీజేపీ నుంచి నిష్క్రమించిన తరుణంలో కాంగ్రెస్ నాయకులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో కూడా మంతనాలు జరిపారు. ఇప్పుడు కూడా కెప్టెన్ మాట సాగినట్లయితే సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిపోయేవారనడంలో సందేహం లేదు. బీజేపీ నుంచి ఎందుకు నిష్క్రమించారు? అమృతసర్ స్థానానికి పోటీ చేసేందుకు టిక్కెట్టు ఇవ్వలేదని. తన అభీష్టం ప్రకారం జరిగితే సరి లేకపోతే పార్టీ నుంచి నిష్క్రమిస్తాననే ధోరణి కలిగిన సిద్ధూను ఎట్లా నమ్ముతారని కెప్టెన్ వర్గం గాంధీలను ప్రశ్నిస్తున్నది. ఆ మాటకు వస్తే  కెప్టెన్ అమరేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి ఎంత విధేయుడనే విషయంలోనూ సందేహాలు లేకపోలేదు. 2017 ఎన్నికలలో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చిన తర్వాత కెప్టెన్ కు పగ్గాలు అప్పజెప్పడం విషయంలో రాహుల్ గాంధీ తాత్సారం చేస్తుంటే కెప్టెన్ వేరే ప్రాంతీయపార్టీ పెట్టుకుంటాడనే వదంతులు సృష్టించారు. పంజాబ్ రాజకీయలలో, ముఖ్యంగా కెప్టెన్ అమరేందర్ సింగ్, నవజోత్ సిద్ధూ వంటి రాజకీయ నాయకుల విషయంలో అయితే ‘మై వే’ లేకపోతే ‘హై వే.’ అయితే నాదారి లేదంటే రహదారి.

సీనియర్లతో చేదు అనుభవం

సీనియర్లతో చేదు అనుభవం ఎదురైన సోనియాగాంధీ, యువనాయకులలో నమ్మకం కోల్పోయిన రాహుల్ గాంధీ తమ పంథాను మార్చుకున్నారు. ప్రియాంక చెప్పిన పాఠాలు వంటబట్టించుకున్నారు. గెలుపు గుర్రాలపైన పందెం కాయాలి కానీ కాంగ్రెస్ వాదులకే పట్టం కట్టాలనీ, నికార్సయిన కాంగ్రెస్ వాదులకే కీలకమైన పదవులు ఇవ్వాలని కానీ అనుకోకూడదు. సూత్రబద్ధమైన రాజకీయం కంటే గెలుపు ప్రధానం. గెలిచి చట్టసభలలో ఉంటేనే కదా, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తేనే కదా ప్రజలకు సేవ చేసేది. అందువల్ల గెలిపించే గుర్రాలకే పదవులు ఇవ్వాలి. వారిచేతికే పగ్గాలు ఇవ్వాలి. కాంగ్రెస్ లోనే జీవితపర్యంతం ఉంటూ, గెలవలేనివారిని, సత్తా లేనివారిని వెనకేసుకొని వస్తే పార్టీ మరింత కుంగిపోతుంది కానీ లేచి పరుగులెత్తలేదు. గెలవాలంటే బయటినుంచి పార్టీలోకి ఇటివల వచ్చినవారైనా సరే సత్తా ఉన్నవారికి పగ్గాలు ఇవ్వాలి. పార్టీని పరుగులు పెట్టించేవారికి పట్టం కట్టాలి. అదే సూత్రంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించారు.  

Also read: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతల స్వీకరణ

రేవంత్ రెడ్డి ఒక నమూనా

ఒక వైపు నరేంద్రమోదీ, అమిత్ షా కలిసి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి హిమంత విశ్వాస్ శర్మకి అస్సాం ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు, బీజేపీతో రోజువారీ సంబంధాలు లేని, తనకంటూ ఒక ప్రైవేటు సైన్యం కలిగిన ఒక మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ కు ఉత్తర ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి బాద్యతలను అప్పగించినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడంలో తప్పేమిటని వాదించారు జూనియర్ గాంధీలు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు దిల్లీ  వెళ్ళి రాహుల్ గాంధీ మెడలో కాంగ్రెస్ కండువా వేశారు. టీడీపీ అధినేతకు లేని పట్టింపు మనకెందుకు ఉండాలనే వాదన జూనియర్ గాంధీలది.  సోనియా కుమారుడితో, కుమార్తెతో ఏకీభవించారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తికి, నోటుకు ఓటు కేసు ఎదుర్కొంటున్న వ్యక్తి, కాంగ్రెస్ లో చంద్రబాబు మనిషని ముద్రపడిన వ్యక్తికి పీసీసీ పగ్గాలు ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయం. తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే ఆ పని రేవంత్ రెడ్డి వల్లనే అవుతుందని సుమారు రెండు వందలమంది రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులతో మాట్లాడి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణలో కాంగ్రెస్ బాధ్యుడు మణిక్కం టాగూర్ సూచించారు. గాంధీలు అమోదించారు. పదవీ బాధ్యతలు తీసుకోకముందే రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించారు. పాత కాంగ్రెస్ నాయకుల గడప తొక్కి వారిని తిరిగి పార్టీలో చురుకుగా పాల్గొనవలసిందిగా అభ్యర్థించారు.

ఘర్ వాప్సీ

పార్టీ వీడిపోయిన నాయకులను సైతం కలుసుకొని తిరిగి పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను వీడిపోయినవారిని తిరిగి ‘ఘర్ వాప్సీ’ అంటూ ఆహ్వానించడం ఇదే మొదటిసారి. చాలామంది సానుకూలంగా స్పందించారు. ఈ సంయమనవాదం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠ పెంచుతున్నది. ఎక్కువమందికి ఆమోదయోగ్యుడైన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఆదివారంనాడు మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవేందర్ గౌడ్ ఇంట్లో రేవంత్ చాలాసేపు చర్చలు జరిపారు. దేవేందర్ గౌడ్ కుమారుడు ఇటీవల టీడీపీ వదిలి బీజేపీలో చేరారు. అతనిని కూడా పునరాలోచించుకొని కాంగ్రెస్ లోకి రావలసిందిగా సూచించారు. ఇది కాంగ్రెస్ పార్టీలో కనీవినీ ఎరుగని కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్నిరాహుల్ గాంధీ సైతం దేశవ్యాప్తంగా అమలు చేయాలి. దేశంలోని పీసీసీల కార్యనిర్వాహకసభ్యులందరికీ  ఈ విధంగా చేయమని ఆదేశించాలి.

ముఖ్యంగా నవజోత్ సిద్ధూ రేవంత్ రెడ్డిని ఈ విషయంలో అనుకరించాలి. కెప్టెన్ అమరేందర్ కు బహిరంగ క్షమాపణ చెబితే సిద్దూకు వచ్చే నష్టం ఏమీ లేదు. వయస్సులో చిన్నవాడు. పెద్దవాడిని మన్నించమని అడిగితే నామోషీ ఏమున్నది? మాజీ రాజావారి అహం దెబ్బతిన్నది కాబట్టి అనునయ వాక్యాలు పరిస్థితిని సరి చేస్తాయి. కాంగ్రెస్ పార్టీకి కొండంత మేలు చేస్తాయి. కెప్టెన్ అనుచరులూ, తనను వ్యతిరేకించివారూ అందరినీ కలుసుకొని, వారిని సుముఖులను చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధూ శ్రమిస్తే పంజాబ్ లో కాంగ్రెస్ మళ్ళీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Also read: దిలీప్ కుమార్ శకం ముగిసింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles