సైబీరియా నుండి వస్తాయి పక్షులు
వేల మైళ్ళు దాటి దారి తప్పకుండా
ప్రతి సంవత్సరం అదే చోటికి.
అంత చిన్న బుర్రలో
ఎంత ఙ్ఞాపక శక్తో,
అంత దూరం ఎగిరి రావడానికి
ఆ రెక్కల్లో ఎంత బలమో.
తీరాలు దాటి
దూరాలు మరచి
ఆనందంగా గడుపుతాయి.
నేలను సారవంతం చేస్తాయి
రైతుకు సిరులందిస్తాయి
అదను దాటగానే పిల్లలతో సహా
ప్రయాణ మవుతాయి స్వస్థలానికి
ఈ వలస ఉభయ తారకం.
మనుషులూ వలస పోతారు
కూలి కోసం, భుక్తికోసం
కొందరు అదను దాటగానే
వెనక్కి వస్తారు నాలుగు డబ్బులతో
మరికొందరు మాతృభూమిని మరచి
మిగిలి పోతారు విదేశాల్లో
మాతృ సంస్కృతిని వదిలేసి.
మీ ఇంట్లో నాదే పెత్తనం
అని భంగపడతారు కొందరు లంకేశులు
మరికొందరు రాజకీయ,
మతఛాందసుల మద్దత్తుతో
వలస ప్రాంతాన్ని ఆక్రమించే
ప్రయత్నం చేస్తున్నారు
గుడారంలో ఒంటెలా.
ప్రతికూల పరిస్థితుల్లో
వలస రావడం
కష్టం తొలగగానే తిరిగి పోవడం
ప్రకృతి ధర్మం
కాదని కల్లోలం సృష్టించడం
సహజత్వానికి వ్యతిరేకం
అసహజమైనదాన్ని
మననివ్వదు ప్రకృతి
వికృత భావాలను విడనాడి
ప్రకృతితో మమేకం కావడం
అందరికి శుభం, క్షేమం, ధర్మం
అందుకే వలస పక్షుల దారిన నడుద్దాం.
Also read: బేరీజు
Also read: కశ్మీర్
Also read: గుడిపాటి వెంకట చలం
Also read: బాల్యం
Also read: న స్వాతంత్ర్య మర్హతి