- అందరికీ శుభం కలగాలి
- శుభకృతునామ సంవత్సరం ఆరంభం
తెలుగువారికి ఉగాది ముఖ్యమైన పండుగ. కొత్త సంవత్సరం ఈరోజుతోనే ప్రారంభమవుతుంది. కాలచక్రానికి -మనిషి జీవితానికి ఉన్న అనుబంధం విడదీయలేనిది. కాలం ఎంత విలువైనదో మనిషి జీవితం కూడా అంతే విలువైనది. అందుకనే, కొత్త సంవత్సరం మొదలయ్యే రోజును పెద్దఉత్సవంగా జరుపుకుంటాం. తెలుగు సంవత్సరాలలోని ఒకొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ సంవత్సరాల సంఖ్య 60. అవి పూర్తవ్వగానే మళ్ళీ మరో 60ఏళ్ళ చక్రం మొదలవుతుంది. నిరంతర స్రవంతి. అవి ‘ప్రభవ’ తో మొదలై ‘అక్షయ’ తో ముగుస్తాయి. నేటి నుంచి ‘శుభకృతు’ నామ సంవత్సరం ఆరంభమైంది. ఈ పేరులోనే శుభం ఉంది. ప్రతి క్షణం శుభంగా సాగాలని ఆకాంక్షిద్దాం, సాగుతుందని విశ్వసిద్దాం, అందరికీ శుభంకరంగా ఉండాలని అభినందనలు అందిద్దాం.
Also read: కాలుష్యం కోరలు పీకే హైడ్రోజన్ కారు
శోభాయమానంగా అడుగుపెట్టాం
ప్రభవ,విభవలను పాదుకొల్పుకొని, వ్యయ, విరోధి, వికృతిలను అధిగమించి, ఖర, నందనలను ఎదిరించి, విజయ, జయ సమయాలను ఆస్వాదించి, మన్మధను ప్రేమించి, దుర్ముఖిని చూసి, వికారిని, శార్వరిని ‘ప్లవ’మెత్తి (ప్లవ అంటే ఎగరడం), ‘శుభకృతు’ లోకి శోభాయమానంగా అడుగు పెట్టాం. గడచిన ఏడాదులు
‘కరోనా’నామ సంవత్సరాలుగా మారి, మానవలోకాన్ని కకావికలం చేశాయి. కఠోరమైన ఆ చేదు అనుభవాలను గరళం వలె దిగమింగే ప్రయత్నం చేశాం. ‘అన్నీ మంచి శకునములే’ అన్నట్లుగా, భావికాలమంతా ‘శోభకృతు’వవుతుందనే అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాల్సిన సంరంభం నేటి సందర్భం. ఎండలు మండిపోతున్నాయి నిజమే! అన్ని రుతువులు అద్భుతంగా పనిచేసిన నిన్నమొన్నటి వేసవి వేళల్లో ఎండలు ఇంతకంటే ప్రచండంగా ఉండేవి. అడుగడుగునా నిలిచి మురిసిన పచ్చని చెట్లు ఆ వెచ్చదనాన్ని మరపింపజేసేవి. ఇప్పుడు మండుతున్న ఎండలను అనుభావించాల్సిన గడ్డుకాలంలోకి వచ్చాం. కాదు కాదు! మనమే తెచ్చుకున్నాం. అందివస్తున్న ఆధునిక సాంకేతికతో సౌకర్యాలను అనుభవించడం ఎంత ముఖ్యమో, అప్పనంగా వచ్చిన ప్రకృతిని,సహజంగా వచ్చే రుతువులను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. అన్ని రుతువులు సక్రమంగా నడచిన నాడే నిజమైన పండుగరోజు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఏడాదిలో కొత్త జిల్లాలు వచ్చేశాయి. నిన్నటి వరకూ మామూలు పట్టణాలుగా ఉన్న ఈ ఊర్లన్నీ నేడు జిల్లా కేంద్రాలుగా మారిపోయాయి. చాలామంది విలాసాలు మారిపోతున్నాయి. ఈ విస్తరణలో గొప్ప వికాసం జరిగినప్పుడే అచ్చమైన ఉత్సవం. పరిపాలనా వికేంద్రీకరణతో పాటు, సమాంతరంగా అంతకు మించిన అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన ప్రయోజనం.
Also read: అప్రమత్తతే అవశ్యం
శుభకృతు శుభంకరం కావాలి
ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ధరల మాటున పండగలు జరుపుకొనే పరిస్థితులు అందరికీ లేవు. ఆర్ధిక సమర్ధత పెరిగినప్పుడే ఇంటింటా వసంతం. దానిని కల్పించడంలో ప్రధాన భూమిక పోషించాల్సింది ప్రభుత్వాలే. మన స్వయంకృషి ఎలాగూ ఉంటుంది. ‘నవవసంతం’ నాడు కొత్త కవితలు పుట్టుకురావడం, పంచాంగ శ్రవణాలు, పద్యపఠనాలు,పురస్కార, సత్కారాలు షరా మామూలు! ఉగాది సందర్భంగా తెలుగుదనాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అది అభినందనీయమే. కొందరు స్ఫూర్తిని పొందుతారు. మరికొందరు మాటలకు, ఆటలకే పరిమితమవుతారు. ఇలా ఎన్నో ఉగాదులు గడుస్తూనే ఉంటాయి. ‘తెలుగుదనం’ ఒకరోజు వేసుకొనే ఫ్యాషన్ డ్రెస్ కాదు, అది మన అడ్రస్! ప్రతిమదిలో, హృదిహృదిలో నింపుకోవాల్సిన తేజస్సు. మన భాష,మన యాస, మన పద్యం, మన అవధానం, మన కూచిపూడి, మన పల్లెలు, మన పాడిపంటలతో నింపుకున్నదే ‘మనతనం’. ఆ మనతనానికి ఈ ఉగాది పూనిక అవ్వాలి.నవరసాల ‘నవవసంతం’ నవ్య చైతన్యానికి నాంది పలకాలి, నవ నందన ఆనంద వనములు వెలియాలి. ‘శుభకృత’ వసంతుడు ఎల్లెడలా శుభములు ప్రభవించాలి.
Also read: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కు ఎసరు