* లాంక్ షైర్ కౌంటీతో కాంట్రాక్టు
ఇంగ్లండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో నిలకడగా రాణించడంతో పాటు భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన యువఆటగాడు శ్రేయస్ అయ్యర్ ను..విదేశీ క్రికెట్ లీగ్ అవకాశాలు వెతుక్కొంటూ వస్తున్నాయి.
ఇప్పటికే భారతజట్టు తరపున వన్డే, టీ-20 ఫార్మాట్లతో పాటు…దేశవాళీ క్రికెట్లో ముంబై కీలక ఆటగాడిగా ఉన్న అయ్యర్.. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
Also Read : లెజెండ్స్ టీ-20 విజేత భారత్
ఇంగ్లీష్ కౌంటీ లీగ్ లో
క్రికెటర్ల సత్తాకు అసలు పరీక్షగా నిలిచే ఇంగ్లీష్ కౌంటీ లీగ్ లో తొలిసారిగా పాల్గొనే అవకాశం అయ్యర్ కు దక్కింది. 2021 రాయల్ లండన్ కప్ వన్డే క్రికెట్ టోర్నీలో పాల్గొనటానికి తాము అయ్యర్ తో కాంట్రాక్టు కుదుర్చుకొన్నట్లు లాంక్ షైర్ కౌంటీ యాజమాన్యం ప్రకటించింది. జులై 15 నుంచి నెలరోజులపాటు అయ్యర్ తమ కౌంటీజట్టులో సభ్యుడిగా ఉంటాడని తెలిపింది.
29 టీ-20లు, 21 వన్డేలు
మిడిలార్డర్లో నమ్మదగిన, దూకుడుగా ఆడే నవతరం ఆటగాడిగా పేరున్న శ్రేయస్ అయ్యర్ కు భారత్ తరపున 21 వన్డేలు , 29 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది. గతంలో భారత దిగ్గజ క్రికెటర్లు ఫరూక్ ఇంజనీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లాంక్ షైర్ జట్టుకు ఆడినవారే. అలాంటి జట్టు తరపున ఆడే అవకాశం రావడం తన అదృష్టమని, అవకాశం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు అయ్యర్ తెలిపాడు.
Also Read : టీ-20ల్లో విరాట్ రికార్డుల పర్వం
26 సంవత్సరాల అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా గత సీజన్లో 123 స్ట్రయిక్ రేటుతో 519 పరుగులు సాధించాడు. ఆస్ట్ర్రేలియాతో గత ఏడాది ముగిసిన మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో సైతం అయ్యర్ పాల్గొన్నాడు.
2017 సిరీస్ లో భారత వన్డే క్యాప్ సంపాదించిన అయ్యర్ ఓ సెంచరీ, 8 హాఫ్ సెంచరీలతో సహా 45కు పైగా సగటు నమోదు చేశాడు.
50 ఏళ్ల అనుబంధం
ఓల్డ్ ట్రాఫోర్డ్ కేంద్రంగా పనిచేసే లాంక్ షైర్ తో భారత క్రికెటర్లకు గత 50 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. 1968లోనే భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ కాంట్రాక్టు కుదుర్చుకొన్నారు. ప్రస్తుతం ఆ కౌంటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఫరూక్ ఇంజనీర్ తర్వాత మురళీ కార్తీక్, దినేశ్ మోంగియా లాంటి ఆటగాళ్లు సైతం లాంక్ షైర్ కు ప్రాతినిథ్యం వహించారు.
Also Read : ఆల్-ఇంగ్లండ్ లో సింధుకు సెమీస్ షాక్