శ్రేయస్, రవిచంద్రన్ అద్భుతంగా, నిలకడగా, ధైర్యం కోల్పోకుండా, ఆవేశపడకుండా,తోట్రుపాటు లేకుండా ఆడి భారత్ కు విజయం సాధించారు. బంగ్లాదేశ్ తో మీర్ పూర్ లో జరిగిన చివరి, రెండవ టెస్ట్ లో మూడు వికెట్లతో ఇండియా గెలుపొందడానికి కారకులైనారు. అంతకు ముందు అక్సర్ పటేల్ ముప్పయ్ పరుగులు చేసి ఆదుకున్నారు. ఆదివారం ఉదయం ఎనిమిదవ వికెట్టు భాగస్వామ్యాన్ని 71 పరుగులకు చేర్చి ఇద్దరు తమిళ యువకులు అశ్విన్, శ్రేయస్ లో ఇండియాను గెలిపించారు.
దీంతో బంగ్లాదేశ్ పర్యటన చివరిలో ఇండియా టీ-20 సిరీస్ ను గెలుచుకుంది. ఒన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ ను ఓడింది. టెస్ట్ సీరీస్ ను గెలుచుకొని తన ఆధిక్యం చాటింది.
కష్టసాధ్యం కానిదిగా కనిపించే 145 పరుగుల లక్ష్యం పిచ్ ఉన్న పరిస్థితులలో అసాధ్యంగా కనిపించింది. ఇండియా శనివారం సాయంత్రానికి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆదివారం ఆట మొదలుపెట్టిన తర్వాత మరో మూడు వికెట్లు పోగొట్టుకున్నది. పరాజయం తథ్యం అని అందరూ అనుకుంటున్న దశలో శ్రేయస్, రవిచంద్రన్ అశ్విన్ మొక్కవోని ధైర్యంతో, అంతులోని సహనంతో, విలువైన నైపుణ్యంతో ఆడి వికెట్లు కోల్పోకుండా నిలిచి అవసరమైన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. బంగ్లాదేశ్ బౌలర్లు మెహిదీ హసన్ మీర్జా, షాకిబ్ అల్ హసన్ లు అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శన ఇచ్చారు. వారి ధాటికి తట్టుకోలేక భారత బ్యాట్స్ మన్ ఒక్కొక్కరు వెనుదిరిగి పెవిలియన్ చేరుకున్నారు. శ్రేయస్, అశ్విన్ మాత్రం గుండె చెదరకుండా, నింపాదిగా ఆడి అవసరమైన పరుగులు సాధించారు.
ఒకానొక దశలో అశ్విన్ ఒక పరుగుపైన ఉన్నప్పుడు అతని బ్యాట్ కు తగిలి పక్కకు వెళ్ళిన బంతిని బంగ్లాదేశ్ ఫీల్డర్ పట్టుకోలేకపోయాడు. అతను పట్టుకొని ఉంటే భారత్ కు అంతేసంగతులు అనవలసి వచ్చేది. అశ్విన్ అదృష్ట వశాత్తు ఫీల్డర్ విఫలం కావడంతో అశ్విన్ విజృంభించి బ్యాట్ చేశారు. అప్పటి నుంచి అశ్విన్,శ్రేయస్ లు ఫోర్లు కొడుతూ విజయం దిశగా పరుగులు తీశారు.