Thursday, November 21, 2024

కేజ్రీవాల్ – క్రేజీవాల్?

  • దిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవాలలో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ
  • ఆప్ బలం, బలహీనతా రెండూ కేజ్రీవాలే

పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దూకుడు పెంచారు. మంగళవారంనాడు పంజాబ్, బుధవారంనాడు గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించారు. దేశ రాజధానిలో అధికార పీఠాన్ని సొంతం చేసుకున్న ఆయన తమ పార్టీని మిగిలిన రాష్ట్రాలకు విస్తరించాలనే కాంక్షతో ముందుకు వెళ్తున్నారు. దిల్లీలో రెండు పర్యాయాలు గెలుపుగుర్రం ఎక్కడంతో కేజ్రీవాల్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దిగ్గజాలైన కాంగ్రెస్, బిజెపిలు మొన్నటి వరకూ రాజధానిలో ఏలుబడిని పంచుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో పెద్దపార్టీల హవాకు దిల్లీలో బ్రేక్ పడింది. నరేంద్రమోదీ ఆకర్షణలో దేశం మొత్తంపడిపోయి, బిజెపిని అందలమెక్కించిన కొత్తల్లోనే, ఆ దూకుడుకు కళ్లెం వేసి, దిల్లీలో పాలనలోకి వచ్చిన ఘనత కేజ్రీవాల్ దే.ఈ ఘటనతో ఆయన ప్రతిష్ఠ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటింది. ప్రస్తుత రాజకీయ వాతావరణానికి భిన్నమైన సంస్కృతిని పాదు కొల్పుతానని ముందుకు వచ్చిన కేజ్రీవాల్ మిగిలిన రాష్ట్రాల వైపు కూడా దృష్టి సారించిన సంగతి తెలిసిందే.

Also read: షరతులతో ‘చింతామణి’ని అనుమతించాలి

పంజాబ్ లో విజయావకాశాలు

ఈ నేపథ్యంలో గుజరాత్, పంజాబ్, గోవా మొదలైన రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ పరుచుకోవడం ప్రారంభించింది. పంజాబ్ 2017అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి తన సత్తాను చాటుకుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువగా ఉన్నట్లు ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు.క్షేత్ర వాస్తవాలు కూడా దానికి దగ్గరగానే ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండో స్థానంలో ఉండడంతో పాటు మిగిలిన పార్టీల బలహీనతలు ఆమ్ ఆద్మీకి బలాలుగా మారుతున్నాయని వినపడుతోంది. పోయిన ఎన్నికల్లో 77 స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో రోజురోజుకూ క్షీణదశకు చేరుకుంటోంది. కాకలుతీరిన నాయకుడు కెప్టెన్ అమరేంద్రసింగ్ ను  ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించి గొప్పపని చేసినట్లుగా ఆ పార్టీ అధిష్టానం భావించింది. అతను సొంత దుకాణం పెట్టుకొని బిజెపికి దగ్గరయ్యారు. ఇది కొంత నష్టాన్ని కలిగిస్తోంది. నవ్ జోత్ సింగ్ సిద్దూకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పజెబితే తిరుగే ఉండదని ఎంతో విశ్వాసం పెట్టుకుంది. అతను చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తూ కొరకారని కొయ్యలా తయారయ్యారు. దళితనేత చన్నీని ముఖ్యమంత్రిగా నియమించి మొదట్లో ప్రశంసలు పొందింది. తదనంతరం,నవ్ జోత్ సింగ్ సిద్ధూ – చన్నీ మధ్య విభేదాలు శృతిమించి సాగుతున్నాయి.సిద్ధూ కూడా ముఖ్యమంత్రి రేసులోనే ఉన్నారు. పంజాబ్ లో దళితులు, జాట్ సిక్కుల ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా దళిత నేత చన్నీని ఎంచుకొని, పార్టీ రాష్ట్ర అధిపతిగా జాట్ వర్గీయుడైన సిద్ధూను నియమించడం వల్ల ఓటుబ్యాంక్ ను కొల్లగొట్టవచ్చని కాంగ్రెస్ వేసిన అంచనా అంతర్గత కుమ్ములాటలతో తల్లకిందులయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని పంజాబ్ లో గట్టిగా వినపడుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే పరిస్థితిలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లేదు.

Also read: వాక్సిన్ కి ఏడాది

గత ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే, శిరోమణి అకాలీదళ్ 15 స్థానాల బలంతో మూడో స్థానంలో ఉంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్ డి ఏ నుంచి బయటకు వచ్చింది. రేపటి ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలని ప్రయత్నం చేస్తోంది. క్షేత్ర పరిస్థితులను సమీక్షస్తే   పార్టీ పుంజుకునే వాతావరణం కనిపించడం లేదు. పంజాబ్ లో బిజెపి మొదటినుంచీ చాలా బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు దక్కించుకుంది. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా అధికారంలోకి వచ్చే శకునాలు ఎక్కడా కనిపించడం లేదు. కెప్టెన్ అమరేంద్ర సింగ్, శిరోమణి అకాలీదళ్ పార్టీల సహకారం అందిపుచ్చుకుంటే  కలసివచ్చే సంగతి ఇప్పుడే చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ రూటే వేరు

ఈ పార్టీలకు భిన్నంగా ఆమ్ ఆద్మీ వ్యవహరిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో కొత్తపాళీలకు స్వాగతం పలుకుతోంది.ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో టెలీఓటింగ్ మార్గంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి  వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఖరారు చేసింది. నిజానిజాలు ఎలా ఉన్నా, 93శాతం మంది భగవంత్ మాన్ నే ఎన్నుకున్నట్లు ఆ పార్టీ చెబుతోంది. ప్రస్తుతం ఆయన సంగ్రూర్ నుంచి లోక్ సభ అభ్యర్థిగా ఉన్నారు. పంజాబ్ యూనిట్ అధ్యక్షుడుగానూ వ్యవహరిస్తున్నారు. 117శాసనసభ నియోజకవర్గాలున్న పంజాబ్ లో రెండో స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి రేపటి ఎన్నికల్లో గెలుపు సంగతి ఎలా ఉన్నా గట్టిపోటీనిచ్చే అవకాశాలు ఉన్నాయన్నది వాస్తవమని చెప్పవచ్చు. గోవాలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంతో హడావిడి మొదలైంది. న్యాయవాది, సామాజిక కార్యకర్త అమిత్ పాలేకర్ ను సీఎం అభ్యర్థిగా వెల్లడించారు. గోవాలో 35శాతం ఓటుబ్యాంక్ కలిగిన బండారీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంచుకోవడంలోనే కేజ్రీవాల్ ఎత్తుగడలు తెలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గోవాలోని చారిత్రక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నిరసిస్తూ నిరాహార దీక్ష చేపట్టి పాలేకర్ వార్తల్లోకి ఎక్కారు.

Also read: ప్రపంచవ్యాప్తంగా సూర్య నమస్కారాలు

గోవాలో కసరత్తు

గోవా ప్రస్తుతం బిజెపి పాలనలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్, శివసేన కూడా బరిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో  ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకోతగ్గ వాతావరణంలో లేదు. అధికారాన్ని సొంతం చేసుకోవడం కష్టమేనని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.  మిగిలిన రాష్ట్రాలలో ఎలా ఉన్నా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంచనా వెయ్యవచ్చు. ఆమ్ ఆద్మీ అంటే కేజ్రీవాల్ – కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ. ఆ పార్టీకి బలం, బలహీనత రెండూ ఆయనే. దిల్లీ పాలన గొప్పగా లేకపోయినా తనదైన ముద్ర వేసుకున్నారనే చెప్పాలి. విద్య,ఆరోగ్యం,విద్యుత్ సేవలలో మెరుగైన ఫలితాలు రాబట్టారు. వినూత్నమైన పధకాలకు రూపకల్పన చేశారు. వ్యక్తిగతంగా ఆయనపై అవినీతి ముద్ర కూడా లేదు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి జనలోక్ పాల్ బిల్లు పై పోరాడిన సామాజిక కార్యకర్తగా వార్తల్లోకి ఎక్కిన మాజీ ఐ ఆర్ ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి, పార్టీని స్థాపించి, గెలుపుగుర్రం ఎక్కించారు. దిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో అత్యంత పిన్నవయస్కుడుగానూ రికార్డుకు ఎక్కారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేజ్రీవాల్ భవిష్యత్తు కాలపరీక్షలోనే తేలుతుంది. భవిష్యత్తు ఎలా ఉన్నా ప్రస్తుతం ఆయన మంచి ఊపులో ఉన్నారు. రాజకీయాల్లో మంచి వాతావరణం తెస్తే,కేజ్రీవాల్ చరిత్రలో మిగులుతారు.

Also read: యూపీలో బీజేపీకి టోపీ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles