- ఆఖరిరోజుఆటలో భారత్ 192 ఆలౌట్
- ఇంగ్లండ్ కు 227 పరుగుల విజయం
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల సిరీస్ ను భారత్ ఓటమితో ప్రారంభించింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఆఖరి రోజు ఆట టీ విరామానికి ముందే భారత్ 227 పరుగుల పరాజయం చవిచూసింది. ఇంగ్లండ్ కెప్టెన్,డబుల్ సెంచరీ హీరో.. జో రూట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
లీచ్, యాండర్సన్ మ్యాజిక్ :
420 పరుగుల భారీలక్ష్యంతో ఆఖరిరోజు ఆట కొనసాగించిన భారత్ 58.1 ఓవర్లలో 192 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ వెటరన్ స్వింగ్ బౌలర్ జిమ్మీ యాండర్సన్ రివర్స్ స్వింగ్ తో భారత్ మిడిలార్డర్ ను కుప్పకూల్చాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టి విజయంలో తనవంతు పాత్ర నిర్వర్తించాడు. భారత ఆటగాళ్లలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ , కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రమే హాఫ్ సెంచరీలు సాధించగలిగారు. గిల్ 83 బాల్స్ లో 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసి యాండర్సన్ ర్వివర్స్ సింగ్ కు అవుటయ్యాడు. వన్ డౌన్ పూజారా 15, రహానే డకౌట్ కాగా రిషభ్ పంత్ 11, సుందర్ పరుగులేవీ లేకుండానే అవుటయ్యారు. అశ్విన్ 9, ఇశాంత్ 5 పరుగులు సాధించారు.
Also Read: అశ్విన్ వందేళ్ల టెస్టు రికార్డు
కొహ్లీ ఒంటరిపోరాటం :
2019 నవంబర్ లో చివరిసారిగా బంగ్లాదేశ్ తో జరిగిన డే-నైట్ టెస్టులో సెంచరీ సాధించిన తర్వాత నుంచి భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మూడంకెల స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. అయితే చెన్నై టెస్టు ఆఖరిరోజుఆటలో కొహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. 153 నిమిషాల పాటు క్రీజులో నిలదొక్కుకొని 104 బాల్స్ ఎదుర్కొని 9 బౌండ్రీలతో 72 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో భారత్ పోరాటం ముగిసింది.
Also Read: శత టెస్టులో శతకవీరులు
ఇంగ్లండ్ బౌలర్లలో లీచ్ 4 వికెట్లు, యాండర్సన్ 3 వికెట్లు , ఆర్చర్, స్టోక్స్, బెస్ తలో వికెట్ పడగొట్టారు. మొత్తం నాలుగు మ్యాచ్ ల సిరీస్ మొదటి టెస్టు ముగిసే సమయానికి ఇంగ్లండ్ 1-0తో పైచేయి సాధించింది. సిరీస్ లోని రెండోటెస్టు చెపాక్ వేదికగానే ఫిబ్రవరి 13 నుంచి 17 వరకూ జరుగుతుంది. మొత్తం ఐదురోజుల ఆటలో ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంలో కీలక టాస్ నెగ్గడం, కెప్టెన్ జో రూట్ సూపర్ డబుల్ సాధించడం, తొలిఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించడం తొలిటెస్టుకే హైలైట్స్ గా మిగిలిపోతాయి.