శోభానాయుడు..
కూచిపూడికి కీర్తి పతాక!
భారతీయ నృత్య సౌందర్యానికి కలికితురాయి!!
శోభానాయుడు గారికి ముందు ఎంతోమంది కళాకారులుండవచ్చు. అయితే శోభానాయుడు లోని కూచిపూడి శోభ ఏమిటంటే అసమానమైన అందం, వన్నెతగ్గని నృత్య కౌశలం, అలుపెరగని సాధన, అనంతంగా సాగిన పరిశోధన – ఈ నాలుగు అపురూపమైన జీవధర్మాల మేలుకలయిక! కనుకనే శోభానాయుడు 2020 అక్టోబర్ 14 తెల్లవారుజామున హైదరాబాదులో కనుమూసినపుడు ఎంతోమంది తల్లడిల్లారు!
ఒకవైపు తన గురువు వెంపటి చినసత్యం ఇచ్చిన శిక్షణ, మరోవైపు తెలుగు ప్రాంతంలో విలసిల్లిన నృత్య రంగమూ కలగలిపి శోభానాయుడుకి దివిటీలు పట్టాయి. ప్రలోభాలు జయించి కూచిపూడి కళకే పూర్తిగా అంకితమయిన ప్రతిభాశాలి, విజ్ఞతగల వినయమణి అయిన శోభానాయుడు ఎన్నోసార్లు సినిమా రంగం నుంచి ఆహ్వానం అందినా అటు వెళ్ళలేదు!
మూడున్నర దశాబ్దాల క్రితం తొలిసారి తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో శోభానాయుడు గారి నృత్య ప్రదర్శనను చూసింది మొదలు – ఎన్నోసార్లు వారి నృత్య ప్రదర్శనలు చూడటం తటస్తించింది. దశాబ్దం క్రితం అన్నమయ్య కీర్తనలలోని నృత్య లక్షణాలను అలవోకగా, సాధికారంగా వివరించి ఆశ్చర్యం కలిగించారు. ఆకాశవాణి కడప కేంద్రం కోసం రూపొందించిన ‘అన్నమయ్య పద గోపురం’ ధారావాహికలో శోభానాయుడు చేసిన ఆ కార్యక్రమం శిఖరాయమానంగా నిలవడమే కాక అన్నమయ్య అసమాన ప్రతిభకు ఒక దీపస్తంభంగా మిగిలింది! అలాగే అంతకుముందు ఆకాశవాణి హైదరాబాద్ ప్రోగ్రామ్ అడ్వయిజరీ కమిటీ సభ్యులుగా శోభానాయుడు సూచనలు చేసిన రెండేళ్ల కాలంలో వారితో సన్నిహితంగా మసలే అవకాశం కూడా కలిగింది. మద్రాసులో ఒక నృత్య ప్రదర్శన సమయంలో తనే పలకరించడం నాకు మహదానందాన్ని కలిగించింది!
పద్మశ్రీ, నృత్య శిరోమణి వంటి గౌరవాలు, సత్యభామ, పద్మావతి, చండాళిక వంటి పాత్రలు తెచ్చిన కీర్తి ప్రతిష్ఠలు వారి మేధస్సుకు సోకలేదు. కనుకనే ఎదుటి వ్యక్తి ఎవరైనా ఆమెలో ఒకేరకమైన వినయం, అభిమానం వ్యక్తమయ్యేవి. కాలానుగుణంగా నృత్యప్రదర్శనలు, నృత్య పరిశోధన, నృత్య శిక్షణ, నృత్య ప్రచారం అనే రీతిలో శోభానాయుడు సాధన వేయి రేకుల పద్మమయింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో నృత్య రీతులను వివరించి, విశదం చేసే కార్యక్రమం వారికెంతో పేరును సాధించిపెట్టడమే కాకుండా మరెంతోమందికి నృత్య శిక్షణను, నృత్యాభిలాషను అలాగే నాలాంటి వారితో సహా మరెంతమందికో నృత్యావగాహనను ఇవ్వగలిగింది.
శోభాయుడుగారి శోధన, సాధన అలుపెరగకుండా సాగాయి. అప్పుడప్పుడు నృత్య సాహసాలు చేయడానికి కూడా వారు వెనకాడలేదు. అలా చేసిన ప్రయత్నమే షిర్దీ సాయిబాబా నృత్యాభినయం. మంజు భార్గవి శ్రీనివాసుడుగా, శోభానాయుడు పద్మావతిగా చేసిన నృత్య ప్రయత్నం ఎంతోమందికి నేటికీ కళ్ళలో మెదులుతూనే వుంటుంది.
శోభానాయుడు గారు కాస్త అర్ధాంతరంగానే అస్తమించినా వారు భారతీయ నృత్యరంగంలో అసమాన తారగా మిగిలిపోయారు. కూచిపూడి నృత్యానికి శాశ్వత చిరునామాగా కలకాలం భాసిస్తూనే వుంటారు.
పొరపాటున జారిపడిన దివిలోకపు పారిజాతం..
ఈ కూచిపూడి కళామతల్లి… శోభానాయుడు!!
(అక్టోబర్ 14, శోభానాయుడు వర్థంతి)
(2020 అక్టోబర్ లో రాసింది)
— డా. నాగసూరి వేణుగోపాల్
9440732392