Sunday, January 5, 2025

మహాభారత శోభ

అమితాఖ్యానక శాఖలన్ పొలిచి, వేదార్థామల చ్ఛాయమై,

సుమహద్వర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో

త్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై, ద్వైపాయనోద్యాన జా

త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీ సురప్రార్థమై!

నన్నయ భట్టారకుడు

ఆదిపర్వము 1.66

“వ్యాస మహర్షి అనబడే నందనోద్యానంలో జన్మించిన మహాభారతం ఒక కల్పవృక్షం.  వివిధానేకములైన ఉపాఖ్యానాలు ఈ భారతమనే కల్పవృక్షానికి వెల్లి విరిసిన శాఖోపశాఖలు.  చతుర్వేదములనే నిర్మల చ్ఛాయను ఈ తరువు సదా ప్రసాదిస్తుంది. చతుర్విధ పురుషార్థాలనే సుమహత్ పుష్ప సముదయ ప్రకాశాన్ని ఈ పాదపం దశదిశలా వెదజల్లుతుంది.  ఈ కల్పశాఖికకు కాసిన మధుర ఫలాలు కృష్ణార్జునుల ఉత్తమ నానా గుణ కీర్తనా ఫలాలు. స్వర్గలోకపు పారిజాతం సురగణంచే కీర్తింపబడినట్లే భారతమనే భూలోక పారిజాత వృక్షం భూసుర గణంచే కీర్తింపబడుతూ అప్రతిహతంగా వర్ధిల్లుతుంది.”

Also read: గంగిరెద్దు

ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రంగా, ఆధ్యాత్మ వేత్తలు వేదాంతంగా, నీతి కోవిదులు నీతి శాస్త్రంగా, కవులు మహాకావ్యంగా, లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహంగా, ఐతిహాసకులు ఇతిహాసంగా, పౌరాణికులు బహు పురాణ సముచ్చయంగా మహాభారతాన్ని భావిస్తారని శౌనకాది మహాముని సంచయానికి  ఉగ్రశ్రవసుడు వివరిస్తాడు. తదుపరి భారత పర్వానుక్రమాన్ని సవివరంగా పేర్కొంటాడు.

ఆపిదప భారత సంహితను కల్పవృక్షంతో ఉపమిస్తూ  మనోహర రూపకాలంకార ప్రయోగంతో ఉగ్రశ్రవసుడు గావించిన చిరస్మరణీయ ప్రశంసయే పై పద్యం.

భారతమనే  ఈ భూతల కల్పవృక్షం చతుర్వేదములనే చల్లని నీడనిస్తుంది. చతుర్విధ పురుషార్థాలనే  ప్రకాశమానమైన పూవులను పూచి, వాటి అపూర్వ సౌరభాలను దశదిశలా వెదజల్లుతుంది. అన్నిటికన్న ముఖ్యంగా కృష్ణార్జునుల ఉత్తమ నానా కీర్తనా మధుర ఫలాలను భూతల వాసులందరికీ  ప్రసాదిస్తుంది.

Also read: మహాభారతం అవతారిక

కథానాయకులు కృష్ణార్జునులే

మహాభారత మూల కథానాయకులు శ్రీకృష్ణుడు, అర్జునులనే  విషయాన్ని పేర్కొనడమే ఈ పద్యంలోని విశేషం. ఈ ఫలాలే విత్తనాలై సనాతన భారతీయ జ్ఞాన భాండాగారమనే పారిజాత తరువు యొక్క సంతానం భూగోళం నలుమూలలా వ్యాపించిందని ఈ పద్యం ధ్వని పూర్వకంగా తెలుపుతున్నది.

కృతయుగంలో దేవతలు నాయకులు, దానవులు ప్రతినాయకులు. త్రేతాయుగంలో మానవుడైన శ్రీరాముని రూపంలో పరమాత్మయే  నాయకుడు,  రావణబ్రహ్మ రూపంలో దానవుడే ప్రతినాయకుడు. ద్వాపర యుగంలో ధనుర్ధారియైన నరుడే నాయకుడు. శ్రీకృష్ణుని రూపంలో పరమాత్మయే అతని సారథి,  అతని సచివుడు,

అతని వియ్యము, అతని సఖుడు, అతని నెచ్చెలి, అతని గురువు, అతని దేవర.

అరిషడ్వర్గాలు

దక్షులైన వారు నియంత్రింపలేక నిస్సహాయులైన వేళ సృష్టి వినాశనానికి దోహదకారులైన నరలోకపు అరిషడ్వర్గాదులదే ప్రతి నాయకత్వం. చతుర్విధ పురుషార్థ సిద్ధికై ప్రయత్నించే మానవులను అరిషడ్వర్గాదులు కూడా వీడని నీడ వలె ఎప్పుడూ వెన్నంటే వుంటాయి. అరిషడ్వర్గాదులకు బందీయై ధర్మ కర్తవ్యమంటే పెడముఖం పెట్టిన దుర్యోధనుడే భారతంలో ప్రతినాయకుడు. విధి చేతిలో కేవలం నిమిత్త మాత్రుడు.

వ్యాసమహాముని తండ్రి పరాశర మహర్షి భారతీయ జ్యోతిష్య శాస్త్రానికి ఆద్యుడు. పరాశర హోర, పరాశర స్మృతి, పరాశర సంహిత, ఆయనకు, ఆయన శిష్యుడు మైత్రేయకు మధ్య జరిగిన ప్రశ్నలు, సమాధానాల ఫలితం. 360″ గల హైందవ జాతక చక్రంలో నాలుగు త్రికోణాలు వున్నాయి. మొదటిది లగ్న, పంచమ, నవమ స్థానాలతో ఏర్పడే ధర్మ త్రికోణం. రెండవది, ద్వితీయ, షష్ట, దశమ స్థానాలతో ఏర్పడే అర్థ త్రికోణం. మూడవది, తృతీయ, సప్తమ, ఏకాదశ స్థానాలతో ఏర్పడే కామ త్రికోణం. నాల్గవది చతుర్థ, అష్టమ, ద్వాదశ స్థానాలతో ఏర్పడే మోక్ష త్రికోణం. పరమపద సోపాన పదం వంటి జీవన సమరంలో అరిషడ్వర్గాదులనే కాలసర్పాల నోళ్ళల్లో పడి నశించే వారే లోకంలో కనబడతారు. “On every human face I see a sign of weakness”  అంటాడు ఆంగ్లకవి విలియమ్ బ్లేక్. నిజమైన చతుర్విధ పురుషార్థ సాధన పలువురికీ మృగతృష్ఢ వలె మిగిలిపోతుంది.

జీవన సమరాంగణం

ఇట్టి నైతిక బలహీనులచే భూతల సృష్టి పతనోన్ముఖమైనప్పుడు దానికి పునురుజ్జీవాన్ని ప్రసాదింపగల  మహాత్ములకై  దైవం సదా విధి రూపంలో ఎదురు తెన్నులు చూస్తుంది. అట్టి వారు లభించినప్పుడు వారి శక్తులను ఎగసన దోస్తూ, విసుగు విరామమూ లేని జీవన సమరాంగణంలో వారికి రథ సారధ్యం వహిస్తుంది. Life is a battle field without armistice అంటాడు రోమేరోలా.

ద్వాపర యుగపు బహు తరాల భారత గాథలో ధనుర్ధారియైన అర్జునుడు కథానాయకుడు. ధనుంజయునితో సరిసమానంగా ఎదగ గలిగే శక్తిగల ఏకలవ్యుని బొటనవేలు విధియే తెగగోసింది. విధియే గాండీవాన్ని, పాశుపతాస్త్రాన్ని శ్వేతవాహనునికి బహూకరించింది. విధియే పరమాత్మను, పార్థుణ్ణీ పరస్పర సమీప వర్తులను చేసింది.  విధియే గాండీవికి భగవద్గీత బోధించింది. విధియే అతనికి అంపశయ్యపై పడిన భీష్మునిచే  భీష్మగీతను బోధించింది. ఇదే విధియే అడుగడుగునా అర్జునుని సహన శక్తిని కూడా పరీక్షించింది. దీర్గవనవాసానికి పంపింది. సంవత్సరం పాటు పేడితనం ప్రసాదించింది. ఇదంతా పార్థుని నుండి ప్రతిఫలంగా “ధర్మ సంస్థాపనను” ఆశించి చేసినదే.

Also read: ఎవరి కోసం?

వీరాగ్రేసరులెంత వారైనా సరే అధర్మం పక్షాన నిలిచి ధర్మాన్ని స్థాపింపలేని నైతిక బలహీనులైనప్పుడు ఏదో రూపంలో విధి అట్టి వారిని కఠినంగా శిక్షిస్తూనే వుంటుంది. అట్టి దైవోపహతుల్లో ఒకడు కర్ణుడు. అడుగడుగునా జీవన నైరాశ్యమే ఎదురైన హతభాగ్యుడు.

ఏ యుద్ధమూ అకస్మాత్తుగా సంభవింపదు. ధృతరాష్ట్రుడు భౌతికంగానే గాక నైతికంగా కూడా గ్రుడ్డి వాడు.  యుద్ధము, శాంతి, వీటిల్లో దేన్ని ఎన్నుకోవాలనే నిర్ణయం అతనిదే. దైవమే దూతగా స్వయానా వచ్చి మానవుడైన ధృతరాష్ట్రునికి ఈ నిర్ణయాధికారం ఇస్తుంది. Free will or fate. పతన దిశగా వున్న మానవుడు ఆ అధికారాన్ని సరిగ్గా వినియోగించలేక చేసే  తప్పిదమే యుద్దానికి దారి తీస్తుంది.

దైవం శ్రీకృష్ణుని రూపంలో స్వయానా  నిండు సభలో ధృతరాష్ట్రునితో ఇట్లా అంటుంది:

వారలు శాంత శూరులు, భవచ్చరణంబులు గొల్వబూని యు

న్నారటు గాక మీకిది

మనంబున కప్రియమేని యింతకున్

పోరికి వచ్చు చుండెదరు భూవర! రెండు తెరంగులందు నీ

కారయ పథ్యమేది అగు అవ్విధ మేర్పడ నిశ్చయింపుమా!”

సారపు ధర్మమున్ విమల సత్యము, పాపము చేత బొంకుచే

పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులె

వ్వార లుపేక్ష సేసిరది వారల చేటగు గాని ధర్మ ని

స్తారకమయ్యు, సత్య శుభదాయక మయ్యును దైవముండెడున్!”

చరిత్ర చర్విత చర్వణం అనే సూక్తి ఉన్నది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్స్. ఇట్టి మహాభారత యుద్ధాలు ప్రపంచ వ్యాప్తంగా చరిత్రలో సంభవిస్తూనే వున్నాయి. నా చిన్నతనంలో మా తల్లి ముఖతః తరచు వినే ఒకానొక  గీతంలోని కొన్ని పంక్తులు సదా ఉత్కంఠభరితంగా వుండేవి.

మలయ, జావ, సుమత్ర,

మగధ సింహళ దేశ

మహిత శాసన సింహ

మందార వల్లీ!”

అంటూ భారతమాతను స్తుతించే ఈ గీతం ఒకానొక్కప్పుడు భారతీయులు సలిపిన విస్తృత  సముద్ర వాణిజ్యాలను, సముద్రగుప్తుని వంటి దక్షిణ భారత వీరాగ్రేసరుల నౌకా యుద్ధాలను సూచన ప్రాయంగా పేర్కొంటుంది.

దూరప్రాచ్యంలో హైందవధర్మం

ఒకానొకప్పుడు మలయ, సుమత్ర, సింహళ ద్వీపాల్లో భారతీయ సంస్కృతి ఎంతగా విస్తరించి వుండేదో ఈ గీతం తెలుపుతుంది. దూర ప్రాచ్య దేశాల్లో ఒకప్పుడు బౌద్ధమతం భారత దేశం నుండి వలస వెళ్ళి విరివిగా వ్యాపించిందని చరిత్ర చెప్పడం మనకు తెలుసు. కానీ సనాతన  హైందవధర్మం సైతం దూర ప్రాచ్య దేశాల్లో ఒకానొక నాడు వటవృక్షం వలె వెళ్ళూనిదని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇండోనేషియా దేశం చరిత్ర క్రమంలో మహమ్మదీయ మతం స్వీకరించింది. కానీ వారి కరెన్సీ నోట్లపై  గణేశుని బొమ్మ వుంటుంది. వారి విమాన యాన సంస్థ పేరు  “గరుడ”.  ఆ దేశంలో ఇప్పటికీ రామాయణ  భారత గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నవి. నాటకాలుగా ప్రదర్శింపబడుతున్నవి.

కంబోడియా దేశంలో అద్వితీయమైన హైందవ  ఆంగ్కర్ వాట్ దేవాలయం వున్నది. ఆ సువిశాల దేవాలయ ప్రాంగణంలో వ్యాసమహాముని గజాననునికి మహాభారతాన్ని డిక్టేట్ చేసే శిలాప్రతిమ చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్నది.

అపూర్వ విజ్ఞాన కోశమే మహాభారతం

వ్యాసమహాముని ఏకాగ్ర చిత్తుడై లోకకళ్యాణం కోరి పునరుద్ధరించిన అపూర్వ భారతీయ విజ్ఞాన కోశమే మహాభారతం. భారతమనే సనాతన భారతీయ పారిజాత  పాదపానికి కాసిన పండ్లే కృష్ణార్జున కీర్తనా ఫలాలు. ఆ ఫలాలకై కొమ్మ కొమ్మకూ వ్రాలి విహంగ సంచయం వలె  భారతామృతాన్ని పిపాసతో గ్రోలిన మానవకోటియే ఆ చెట్టు యొక్క జ్ఞాన బీజాలను తరతరాలుగా దశదిశలకూ మోసుకొని పోయింది. ఆ విత్తనాలే దేశదేశాలలో శతసహస్ర పారిజాత తరువులై  మొలకెత్తి, శాఖోపశాఖలుగా విస్తరించి, అశేష జనవాహానికి ఒకానొక నాడు విజ్ఞాన ఫలాలు పంచిపెట్టిన వనడంలో అతిశయోక్తి లేదు.

భరతమాత సకలజగన్మాత

ప్రముఖ అమెరికన్ రచయిత, చరిత్రకారుడు; మేధావి, బహు గ్రంధకర్త, విల్ డ్యురాంట్, 1930లో ప్రచురింపబడిన  ‘ఎ కేస్ ఫర్ ఇండియా’ అనే తన పుస్తకంలో ఏమన్నాడో ఒక్కసారి చూడగలరు:

“India was the motherland of our race & Sanskrit the mother of Europe’s languages. India was the mother of our philosophy, of much of our mathematics, of the ideals embodied in Christianity, of self-governance and democracy. In many ways, Mother India is the mother of us all.”

“భరతభూమి సమస్త మానవాళికీ పురాతన మాతృభూమి. పాశ్చాత్య భాషలకు సంస్కృతమే  మాతృక.  ప్రపంచ వేదాంతానికి హైందవ వేదాంతమే  ప్రేరణ. ప్రపంచ గణితానికి హైందవ గణితమే మూలబీజం”

“క్రైస్తవ ధర్మంలో పొందుపరచిన ఉన్నతాదర్శాలకు హైందవాదర్శాలే ప్రేరణ. ప్రపంచదేశాల స్వయం పాలనా విధానానికీ,  ప్రజాస్వామ్యానికీ, హిందూదేశమే పుట్టినిల్లు”.

“భరతమాత సకల జగన్మాత”.

Also read: మహాభారతం అవతారిక

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles