60.87 శాతం విజయాలతో టాప్
46 టెస్టుల్లో 28 విజయాలు
రంగం ఏదైనా విజయవంతమైన ప్రతిపురుషుడి వెనుక ఓ స్త్రీ మూర్తి ఉన్నట్లే అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ప్రతిజట్టు వెనుక ఓ ప్రధాన శిక్షకుడు ఉండి తీరుతాడు. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు సాంప్రదాయ టెస్టు క్రికెట్ తో పాటు ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో విజయవంతమైన జట్టుగా నిలవడం వెనుక ప్రధాన శిక్షకుడు రవిశాస్త్రి పాత్ర అంతాఇంతా కాదు.
భారత జట్టు మాజీ కెప్టెన్ గా, ఓపెనర్ కమ్ స్పిన్ ఆల్ రౌండర్ గా సేవలు అందించిన రవిశాస్త్రికి…ఆరోజుల్లోనే తుదివరకూ పోరాడే నేర్పు,ఓర్పు ఉండేవి. ఆ లక్షణాలనే ప్రస్తుత భారతజట్టులో పాదుకొల్పడంలో రవిశాస్త్రి ప్రధానపాత్ర వహించాడు. రవిశాస్త్రి నేతృత్వంలోనే భారతజట్టు ప్రారంభ ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు చేరుకోగలిగింది. జూన్ 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగే టైటిల్ సమరంలో..భారతజట్టు తలపడనుంది.
ఇదీ చదవండి: అశ్విన్ కు ఐసీసీ అవార్డు
కుంబ్లే చేతినుంచి పగ్గాలు :
ముంబయి స్కూల్ ఆఫ్ క్రికెట్ నుంచి భారత క్రికెట్లోకి వచ్చి అంతర్జాతీయ క్రికెటర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న రవిశాస్త్రి రిటైర్మెంట్ తర్వాత ప్రపంచమేటి క్రికెట్ వ్యాఖ్యాతలలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత భారత సీనియర్ జట్టు శిక్షకుడిగా అనీల్ కుంబ్లే నుంచి పగ్గాలు చేతపట్టిన తర్వాత నుంచి రవిశాస్త్రి వెనుదిరిగి చూసింది లేదు. ఆధునిక భారత క్రికెట్లో గ్రెగ్ చాపెల్, జాన్ రైట్, డంకన్ ఫ్లెచర్,గ్యారీ కిర్ స్టెన్, అనీల్ కుంబ్లే లాంటి విదేశీ, స్వదేశీ కోచ్ లు జాతీయ జట్టుకు ప్రధాన శిక్షకులుగా వ్యవహరించినా రవి శాస్త్రి మాత్రమే అత్యంత విజయవంతమైన గురువుగా నిలిచాడు. రవిశాస్త్రి నేతృత్వంలో ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ వరకూ 46 టెస్టులు ఆడిన భారత జట్టు 28 విజయాలతో 60.87 సక్సెస్ రేటును నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాలలో జాన్ రైట్, గ్యారీ కిర్ స్టెన్,డంకన్ ఫ్లెచర్, అనీల్ కుంబ్లే, గ్రెగ్ చాపెల్ ఉన్నారు. రవిశాస్త్రి చీఫ్ కోచ్ గానే భారతజట్టు రెండుసార్లు కంగారూ గడ్డపై ఆస్ట్ర్రేలియాను ఓడించడం ద్వారా సిరీస్ విజేతగా నిలిచింది. స్వదేశీ, విదేశీగడ్డపై జరిగిన సిరీస్ ల్లో తొలిటెస్టు ఓడినా ఆ తర్వాత పుంజుకొని ఆడి విజేతగా నిలవడం ఓ అలవాటుగా మార్చుకోగలిగింది. యువ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, తగిన అవకాశాలు కల్పించడం, అత్యుత్తమంగా రాణించేలా చేయడంలో రవిశాస్త్రి పాత్ర అంతా ఇంతా కాదు.
వన్డేల్లో 62.64 శాతం విజయాలు :
రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా భారతజట్టు మొత్తం 91 వన్డేలు ఆడి…57 విజయాలతో 62.64 సక్సెస్ రేటును నమోదు చేసింది. జాన్ రైట్ శిక్షకుడుగా 130 వన్డేలు ఆడిన భారతజట్టు 68 విజయాలు నమోదు చేసింది. డంకన్ ఫ్లెచర్ కోచ్ గా 108 వన్డేలు ఆడి 65 విజయాలు, గ్యారీ కిర్ స్టెన్ శిక్షకుడిగా 93 వన్డేలు ఐడి 59 విజయాలు నమోదు చేయటం విశేషం. కిర్ స్టెన్ చీఫ్ కోచ్ గానే భారతజట్టు 2011 వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకోగలిగింది. ఏడాదికి 7 కోట్ల రూపాయల కాంట్రాక్టుపై భారతజట్టుకు చీఫ్ కోచ్ గా సేవలు అందిస్తున్న రవిశాస్త్రి ఇప్పటి వరకూ ఒక్క ప్రపంచకప్ టైటిలూ అందించలేకపోయాడు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ లో భారత్ ను విజేతగా నిలిపే సువర్ణ అవకాశం రవిశాస్త్రి కోసం ఎదురుచూస్తోంది.
ఇదీ చదవండి: భారత మహిళా క్రికెటర్ ప్రపంచ రికార్డు