- ఏడున్నరేళ్ళు నరకం అనుభవించాను:శశిథరూర్
- పనికట్టుకొని దుష్ప్రచారం చేశారు
- న్యాయవ్యవస్థపైన విశ్వాసంతోనే అన్నీ భరించాను
తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బహుగ్రంథకర్త శశి థరూర్ కు భార్య దివంగత సునంద పుష్కర్ మరణానికి సంబంధించిన కేసులో విముక్తి లభించింది. బుధవారంనాడు దిల్లీ సెషన్స్ జడ్జి అన్ని ఆరోపణల నుంచీ విడుదల చేశారు. దిల్లీలోని ఒక విలాసవంతమైన హోటల్ గదిలో 17 జనవరి 2014నాడు సునంద మృతదేహం కనిపించింది. శవపరీక్షలో ఆమె శరీరంగా మాదకద్రవ్యాల తాలూకు అవశేషాలు ఉన్నట్టు నివేదిక వచ్చింది. అప్పటి నుంచి శశిథరూర్ ను అనుమానించి ఆరోపణలు చేయడం ప్రారంభించారు. పోలీసులు హత్య ఆరోపణను కొట్టివేశారు. కానీ ఆత్మహత్య కారణంగానే ఆమె చనిపోయారని తీర్మానించారు.
శశిథరూర్ ప్రముఖ రాజకీయవాది కూడా కావడంతో ఆయనపైన ఆరోపణల వెల్లువ విరుచుకుపడింది. టీవీ చానళ్ళలో, సోషల్ మీడియాలో అదే పనిగా ఆయనపైన విమర్శలు వెల్లవెత్తాయి. తనపైన వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవనీ, తన పరువు తీయడానికి కావాలని ప్రచారం చేస్తున్నారనీ, అంతా దుష్ప్రచారం తప్ప మరేమీ కాదని పదే పదే శశిథరూర్ స్పష్టం చేస్తూ వచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం చేసిన దర్యాప్తులో కూడా శశిథరూర్ నిర్దోషి అని తేలింది. బుధవారం సెషన్స్ కోర్టు తీర్పు వినిన తర్వాత న్యాయమూర్తికి ధన్యవాదాలు చెబుతూ గత ఏడున్నర సంవత్సరాలు చిత్రహింసను అనుభవించాననీ, అన్ని రకాల దురుద్దేశాలను ఆపాదిస్తూ పనిగట్టుకొని చేసిన ఆరోపణలను భరించాననీ, అంతా భారత న్యాయవ్యవస్థపైన విశ్వాసంతోనే ఆరోపణలను ఎదుర్కొని నిలబడ్డాననీ, తన విశ్వాసం ఈ రోజున నిరూపితమైందనీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఈ కోర్టు ఈ సంవత్సరం ఏప్రిల్ 12న విచారణ ముగించి తీర్పును వాయిదా వేసింది. చార్జిషీట్ దాఖలు చేయవలసిన అవసరం లేదనీ, అన్ని ఆరోపణలు నిరాధారమైనవనీ అడిషనల్ సెషన్స్ జడ్డి గీతాంజలీ గోయెల్ స్పష్టం చేశారు.
‘‘ఈ తీర్పు సుదీర్ఘమైన పీడకలకు ముగింపు పలుకుతోంది. దురదృష్టవశాత్తు నా భార్య సునంద మృతి చెందిన తర్వాత నా పైన వెల్లువలా వచ్చిన భయంకరమైన వదంతులనూ, ఆరోపణలనూ, పనికట్టుకొని చేసిన దుష్ప్రచారాన్నీ ఎదుర్కొని నిలబడ్డాను,’’ అని ఒక ప్రకటనలో థరూర్ తెలియజేశారు. థరూర్ కింద పీనల్ కోడ్ సెక్షన్ 498 ఎ (వైవాహిక జీవితంలో క్రూరంగా వ్యవహరించడం), 306 (ఆత్మహత్యకు ప్రోత్సహించడం)సెక్షన్ కింద పోలీసులు కేసులు పెట్టారు. 5జులై 2018న శశిథరూర్ కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బీజేపీకి అనుకూలమైన మీడియా శశిథరూర్ పైన అదే పనిగా బురదచల్లింది. అర్ణబ్ గోస్వామి వంటి యాంకర్లు రెచ్చిపోయి, కట్టుతప్పి వ్యాఖ్యానాలు చేశారు. అన్నిటినీ తట్టుకొని ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఈ ఏడున్నర సంవత్సరాలలో అనేక పుస్తకాలు రాశారు శశిథరూర్.
సునంద మరణించే సమయానికి అనేక వ్యాధులు ఆమెను వేధిస్తూ ఉన్నాయనీ, ఆమె ప్రమాదవశాత్తు మరణించి ఉండాలి కానీ ఆత్మహత్య కానీ విషప్రయోగంతో హత్య కానీ కాదని దర్యాప్తులో తేలిందనీ శశిథరూర్ చెప్పారు.