‘‘నేను శశిథరూర్ గారితో మాట్లాడాను. నేను ఆయనపైన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలియజేశాను. నా సీనియర్ సహచరుడిని గొప్ప గౌరవంగా పరిగణిస్తానని కూడా ఆయనకు చెప్పాను,’’ అంటూ ఒక ట్వీట్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలియజేశారు. పార్టీలో అగ్రస్థానంలో ఉన్న నాయకులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపట్ల గట్టిగా అభ్యంతరం చెప్పిన మీదట రేవంత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
ఇటీవల సమాచార సాంకేతిక (ఐటీ) వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యక్షుడి హోదాలో హైదరాబాద్ లో పర్యటించిన తిరువనంతపురం లోక్ సభ సభ్యుడు శశిథరూర్ తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్ )ను కలుసుకున్నారు. ఆయన నాయకత్వంలో ఐటీ రంగంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని కొనియాడారు. కేటీఆర్ గురించి కూడా కొన్ని అభినందనపూర్వకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది సహజంగానే కేటీఆర్ నూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నూ ఎండగట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్న ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రుచించలేదు. ప్రత్యర్థిని తమ పార్టీ నేత హైదరాబాద్ కు వచ్చి పొగడటాన్ని జీర్ణించుకోలేకపోయిన రేవంత్ రెడ్డి సీనియర్ నేత, బహుగ్రంథకర్త, మేధావి శశిథరూర్ ని తూలనాడారు. గాడిద, బేవఖూఫ్ అని తిట్టారు. ‘యూస్ లెస్ ఫెలో’ అని అన్నారు. ఈ ట్వీట్ ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కేంద్ర బాధ్యుడు మనిక్కం టాగూర్ కు టాగ్ చేశారు.
ఒక యువనాయుడు ఒక సీనియర్ నేతను ఆ విధంగా దుర్భాషలాడటం పార్టీ సీనియర్లకు కోపం తెప్పించింది. మనీష్ తివారీ ట్వీట్ చేస్తూ థరూర్ కి రేవంత్ క్షమాపణ చెప్పాలని కోరారు. ‘‘మీకూ, నాకూ కూడా శిశిథరూర్ ఎంతో విలువైన సహచరుడు,’’అంటూ తివారీ రేవంత్ కి చెప్పారు. ‘‘శశిథరూర్ చేసిన పని పట్ల మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఆయనతో ఫోన్ లో మాట్లాడితే బాగుండేది. మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే హుందాగా, సముచితంగా ఉంటుంది,’’అని తివారీ హితవు చెప్పారు. తివారీ ట్వీట్ నూ పూర్తిగా సమర్థిస్తూ రేవంత్ కు సల్మాన్ అనీజ్ సోజ్ కూడా ట్వీట్ ఇచ్చారు. శశిథరూర్ చాలా గొప్ప నాయకుడని, ఆయన గురించి ఆ విధంగా వ్యాఖ్యానించడం సరికాదనీ సోజ్ అన్నారు.
ఈ సందర్భాన్ని వినియోగించుకొని కేటీఆర్ రేవంత్ పట్ల తనకున్న ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ‘థర్డ్ రేట్ దొంగను నాయకుడిగా నియమిస్తే ఇట్లాగే ఉంటుంది. పుట్టుకతో అబద్ధాలు చెప్పే లక్షణం కలిగిన నాయకుడూ, దోపిడీకి అలవాటుపడిన నాయకుడూ రేవంత్’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడిని దుయ్యపట్టారు.
రేవంత్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడాన్ని ఆమోదిస్తూ శశిథరూర్ ‘మనం అందరం కలిసి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించాలి. ముందుకు సాగిపోదాం. విభేదాలను విస్మరిద్దాం’ అన్నారు. ట్వీట్ లో శశిథరూర్ సకారాత్పకంగా స్పందించడంతో కథ సుఖాంతమైంది. ‘‘తెలంగాణలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మనందరం సమష్టిగా కృషి చేయాలి,’’ అని తిరువనంతపురం లోక్ సభ సభ్యుడు అన్నారు. రేవంత్ రెడ్డి ఆగ్రహంతో శశిథరూర్ ని ‘‘గథా, బేవకూఫ్’’ అంటూ తిట్టిన వ్యాఖ్యల్ని‘‘న్యూ ఇండియన్ఎక్సప్రెస్ ’’ ప్రచురించింది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. దానికి వెంటనే స్పందించి రేవంత్ రెడ్డి శశి థరూర్ కి ఫోన్ చేసి మాట్లాడారు.