శార్వరినామ సంవత్సరం వచ్చింది
రాలిన ఆకుల స్థానంలో సరికొత్తవి మొలుస్తున్నాయ్
పరిసరాలన్నీ కొత్తదనం పులుముకుంటున్నాయ్
కోయిల కూతలు కమ్మగా వినబడుతున్నాయ్
ఎండలు చురుక్కుమంటున్నాయ్
లోపల బయట మాంద్యం వదలి
చురుకుదనం పడగ విప్పుతూంది
నివురు కప్పిన ఆశల నెగళ్లు
మళ్ళీ రాజుకుంటున్నాయ్.
ఇంతలో దాపురించిందో మహమ్మారి
మునుపెన్నడూ ఎరగని భయోత్పాతం కలిగిస్తూంది
దేశాల్ని గడగడ లాడిస్తూంది
మృత్యు దేవత కరాళ నృత్యం కలవర పరుస్తూంది
వడిగాలులు, జడివానలు, ఉరుములు, మెరుపులు,
పిడుగులు, ఉప్పెనలు, భూకంపాలు చూశాం
కాని కంటికి కనిపించని కరోనా క్రిమి
విలయ తాడవం నేడే చూస్తున్నాం
మందులేని వ్యాధిని తప్పించుకునే మార్గం లేక
తప్పుకుని తిరగాలిట ఇల్లే జైలుగా నిలవాలట
శుచిగా ఉండాలట లేకుంటే తప్పదట తంటా
ఇంత ఉత్పాతానికి కారణం వికృత జీవన శైలి
పాములు, గబ్బిలాలు కూడా తినే మనుషులు
రాక్షసుల కన్నా హీనమైన జాతి
ప్రకృతి ప్రసాదించిన మన పంటలను వదలి
శుభ్రమైనవిగా ఆరోగ్యకరమైనవిగా
కాల గమనంలో నిలిచిన మన వంటలను మరచి
ఆదిమనాటి మానవుడికంటే ఘోరంగా
బ్రతికున్న జంతువులను పీక్కుతింటూ
శుచిలేని రుచికోసం మతి లేకుండా పరితపిస్తూ
లోకమెరుగని కొంగొత్త రోగాలకు
ఆహ్వానం పలుకుతున్నాం
మానవ జాతి వినాశాన్ని
రెండు చేతులా హత్తుకుంటున్నాం.
ఇకనైనా బుద్ది తెచ్చుకుని
జరిగినదానికి చెంపలేసుకొని
భేషజాలు వదలి
మంచి చెడు విచక్షణ కలిగిన మనుషుల్లా
ఈ యుగాది నాడు తీర్మానిద్దాం
తీర్మానాన్ని తు చ తప్పకుండా అమలు చేద్దాం
మూలాలు గుర్తించి మానవ జాతి వర్ధిల్లేలా చూద్దాం.
Also read: “సామరస్యం”
Also read: “ఆర్ధిక ప్రగతి – విద్య”
Also read: “దోపిడి”
Also read: “మేలుకో”
Also read: “ప్రయాణం”