Wednesday, January 22, 2025

షర్మిల ప్రజాప్రస్థానం ముహూర్తం అక్టోబర్ 20

  • చేవెల్ల నుంచి ప్రారంభించి చేవెల్లలోనే ముగించే యోచన
  • సంవత్సరంపాటు సాగనున్న ప్రజాప్రస్థానం
  • సగటున 12 నుంచి 15 కిమీ నడక
  • హైదరాబాద్ మినహాయించి, 90 నియోజకవర్గాలలో యాత్ర
  • అన్ని అంశాలనూ ప్రజలలో చర్చకు పెడతాం

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల పాదయాత్రను అక్టోబర్ 20న చేవెల్ల నుంచి ప్రారంభించనున్నారు. సంవత్సరం తర్వాత 90 నియోజకవర్గాలలో పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత తిరిగి చేవెల్లలోనే ముగించాలని ప్రణాళిక రచించారు. చేవెల్ల వైఎస్ రాజశేఖరరెడ్డికి కలసి వచ్చిన ప్రాంతం. అదొక సెంటిమెంటు. షర్మిల పాదయాత్ర పేరు ‘ప్రజాప్రస్థానం’ అని పెట్టారు. పాదయాత్రలో జీహెచ్ఎంసి పరిధిని మినహాయించారు. పాదయాత్ర ముగించిన తర్వాత నగరంలోని నియోజకవర్గాలలో పర్యటించాలని ఆలోచన.

తన తండ్రి, దివంగత రాజశేఖరరెడ్డి తనకు ఒక బ్రాండ్ అనీ, ఆయన పేరు మీదనే పార్టీ పెట్టాననీ, ఆయన సంక్షేమ కార్యక్రమాలనే పార్టీ అజెండాగా పెట్టుకున్నాననీ, ఆయనక కలసి వచ్చిన సెంటిమెంటు ప్రాంతమైన చేవెల్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తాననీ షర్మిల సోమవారంనాడు మీడియాతో చెప్పారు. చేవెల్ల చెల్లెమ్మ అంటూ వైఎస్ ఆప్యాయంగా పిలుచుకునే సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ప్రభుత్వంలో విద్యామంత్రిగా ఉన్నారు. షర్మిల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపైన తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వరు. పనులు చేయించి సర్పంచ్ లకు డబ్బులు ఇవ్వరు. ఫీజు రీయంబర్స్ మెంటు చెల్లించరు. కొత్త కొలువులు ఇవ్వరు. పాతకొలువులకు భరోసా లేదు. ఆరోగ్యశ్రీ బకాయీలు పేరుకుపోయాయి. అప్పుగా తెచ్చిన నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో తెలియదు,’’ అంటూ నిశితంగా విమర్శించారు.

సమస్యలపై పోరాటం

రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయనీ, వాటి పరిష్కారానికి ప్రజల మధ్య ఉంటూ పోరాడవలసిన అవసరం ఉన్నదనీ షర్మిల అన్నారు. తన పార్టీ సిద్ధాంతాలైన ‘సమానత్వం, సంక్షేమం, స్వయంసమృద్ధి’ సాధనకోసం పోరాడే క్రమంలో వైఎస్ అడుగుజాడలలో నడుస్తానని చెప్పారు. ‘‘ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా వాటి పరిష్కారానికి ఏమి చేయాలో కూడా చెబుతాం. ప్రజలకు భరోసా ఇస్తాం. ఏడేళ్ళలో సీఎం కేజీఆర్ అన్ని వర్గాలనూ మోసం చేశారు. ప్రజలు ఏమి కోల్పోయారో వారికి తెలియాల్సిన అవసరం ఉంది. స్వార్థ రాజకీయం కోసం, కుటుంబ ప్రయోజనాలకోసం కేసీఆర్ రాష్ట్రాన్ని ఎట్లా భ్రష్టు పట్టించారో ప్రజలకు వివరిస్తాం,’’అని షర్మిల ఆత్మవిశ్వాసంతో అన్నారు.

కేసీఆర్ పాలన సాగిన ఏడేళ్ళలో ఏడు వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనీ, రుణమాఫీ హామీని మూడు లక్షలమందికి అమలు చేసి, 36 లక్షలమంది రైతులకు ఎగకొట్టారనీ, 91 శాతం మంది రైతులు తలకు రూ. 15 లక్షల చొప్పున అప్పులు చేసినట్టు ఒక సర్వే నిర్ధారించిందనీ, 16 లక్షల మంది కౌలురైతులను పట్టించుకున్న నాధుడే లేడనీ, లోగడ ప్రభుత్వాలు ఇచ్చిన అస్సైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి లాక్కున్నదనీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దళితులపైన దాడులు 800 శాతం పెరిగాయనీ, మాదక ద్రవ్యాలూ, గంజాయి వచ్చిలవిడిగా లభిస్తున్నాయనీ, ఫలితంగా చిన్నారు మానప్రాణ రక్షణకు పూచీ  లేకుండాపోతున్నదనీ విమర్శించారు.  బంగారు తెలంగాణను తాగుబోతుల రాజ్యంగా మార్చివేశారని షర్మిల ధ్వజమెత్తారు.

బోడుప్పల్ లో నిరాహార దీక్ష

బీజేపీ, కాంగ్రెస్ లు టీఆర్ఎస్ కు అమ్ముడుపోయాయనీ, టీఆర్ఎస్ కు వైఎస్ఆర్ టీపీ ఒక్కడే ప్రత్యామ్నాయమనీ, పాదయాత్ర సాగుతున్నప్పటికీ నిరుద్యోగులకు అండగా తాను ప్రతిమంగళవారం నిరాహారదీక్ష కొనసాగిస్తాననీ, పాదయాత్ర మధ్యలో బహిరంగ సభలు ఉంటాయనీ, చేవెల్లలో ప్రారంభమయ్యే పాదయాత్ర ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మహాబూబ్ నగర్ జిల్లాలలో కొనసాగి తిరిగి చేవెల్లలో ముగుస్తుందని వివరించారు. నిరుద్యోగుల సమస్యపైన మంగళవారంనాడు బోడుప్పల్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో షర్మిల దీక్ష  ఉదయం పది గంటలకు ఆరంభమైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles