- ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు వ్యూహరచన
- పీకేతో చర్చలు
- ప్రత్యర్థి పార్టీలలో ఆందోళన
- అభిమానులతో సమావేశాలు
మీకోసం నిలబడతా… మిమ్మల్ని నిలబెడతానంటూ ధైర్యవచనాలు పలుకుతున్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేందుకు కావాల్సిన క్షేత్ర స్థాయి సన్నాహాలకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. జిల్లా నాయకులు, వైఎస్సార్ అభిమానులతో సమావేశమై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. తెలంగాణ కల సాకారమైనా ఇంకా గ్రామాల్లో అష్ట కష్టాలు పడుతున్న వారి కన్నీరు తుడిచేందుకు సమాయత్తమవుతున్నారు.
ప్రజలతో మమేకమయ్యేందుకు సమాచార వ్యవస్థ :
రాజన్న రాజ్యం కోసం పార్టీ పెడుతున్న షర్మిల ప్రజల్లోకి చొచ్చుకుపోవాలంటే ఏకైక మార్గం మీడియానే. తనకు, ప్రజలకు మధ్య సరైన సమాచార వ్యవస్థ లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లనున్నట్లు తెలుసుకున్న షర్మిల సొంత మీడియా సంస్థను ప్రారంభించనున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల విమర్శలను ఎదుర్కొనేందుకు, పాలకపక్షం తప్పిదాలను ఎండగట్టేందుకు షర్మిల న్యూస్ ఛానల్ తప్పనిసరి అని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అభిమానులతో సమావేశం సందర్భంగా జరుగుతున్న ఘటనలను ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో చిలవలు పలవలుగా ఎవరికి తోచినట్లు వారు విమర్శలు కురిపిస్తున్నారు. దీంతో సొంత మీడియా ఉంటే వాస్తవాలను ప్రజలకు నిర్భయంగా చెప్పొచ్చనే భావనతో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని “మనసాక్షి” పేరుతో న్యూస్ ఛానల్, దినపత్రికను ప్రారంభించనున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: కేసీఆర్ పై షర్మిల విమర్శనాస్త్రాలు తొందరపాటు చర్యా?
తెలంగాణ రాజకీయాల్లో కాక :
ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపఎన్నికలతో తెలంగాణలో రాజకీయ వేడి రగులుతోంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కనీసం మరో రెండున్నరేళ్లు ఆగాల్సిఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నానంటూ ఇటీవల ప్రకటన చేశారు. అంతేకాదు ఎన్నికలతో సబంధంలేకుండా పార్టీ ఏర్పాటుకు అభిమానులు, కార్యకర్తలతో భేటీ అవుతుండటంతో అధికార పార్టీకి కంటి మీద కునుకులేకుండా పోతోంది. మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమేనంటూ బీజేపీ కూడా ఇప్పటి నుండే ధీమా వ్యక్తంచేస్తోంది. ఈ సమయంలో షర్మిల పార్టీ పెడితే అధికారం కోసం అర్రులు చాస్తున్న పార్టీల ఆశలకు భారీగా గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రశాంత్ కిశోర్ తో మంత్రాంగం :
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఫిబ్రవరి నెలాఖరులో షర్మిల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహాలను పీకేతో చర్చించి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గతంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇచ్చిన సూచనలవల్లే జగన్ మోహన్ రెడ్డి సీఎం కాగలిగారు. రాజకీయ వ్యూహాల కోసం షర్మిల అన్న బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం:
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో క్షేత్ర స్థాయిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలకు మంచి ఆదరణ ఉన్నట్లు అభిమానుల సమావేశల్లో తెలుస్తోంది. షర్మిల పార్టీ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ లోని ప్రముఖ నేతలంతా బయటకు వస్తారని అపుడు తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువనేతలంతా షర్మిల పార్టీలో చేరతారని సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి 12 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ తెలంగాణలో ఆయన అభిమానులు 10% పైనే ఉన్నారని వీరంతా షర్మిల వెంట ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: త్వరలో వైఎస్సార్ స్వర్ణయుగం- షర్మిల
వరుస భేటీలతో షర్మిల బిజీ బిజీ :
ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా షర్మిల మహబూబ్ నగర్, నల్గగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ఖమ్మం జిల్లాల అభిమానులతో సమావేశమయ్యారు. వీరితో పాటు పలు యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులతోనూ ముచ్చటించారు. రాబోయే రోజుల్లో రైతులు, కార్మిక సంఘాల నేతలతో కూడా సమావేశం కానున్నారు. షర్మిల అనుసరిస్తున్న వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు గురవుతోంది. కాంగ్రెస్ పార్టీ తరువాత ఏ పార్టీ పుట్టి మునగనుందోనని ఆందోళనలో ఉన్న రాజకీయ పార్టీలు తమ వారిని కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.