తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణానికి టెండర్ ఖరారయింది. షాపూర్జీ పల్లోంజి సంస్థ ఈ టెండర్ ను దక్కించుకుంది. ఏడాదిలోపు సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం షాపూర్ జి పల్లోంజి సంస్థకు నిబంధన పెట్టింది. టెండర్ కోసం షాపూర్ జీ పల్లోంజీ తో పాటు ఎల్ అండ్ టీ సంస్థ చివరి వరకూ పోటీ పడింది. చివరకు టెండర్ ను షాపూర్ జి పల్లోంజి దక్కించుకున్నట్లు రోడ్లు భవనాల శాఖ తెలిపింది.
టెండర్ కాంట్రాక్ట్ ప్రకారం 2 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ భవన నిర్మాణం చేపడతారని సమాచారం. మిగతా 25 ఎకరాల క్యాంపస్ లో ల్యాండ్ స్కేపింగ్, వాహనాల పార్కింగ్ తో పాటు ఇతర సదుపాయాలు ఉంటాయి. భవనంలోని మధ్య పోర్షన్ లో 15 అడుగుల ఎత్తులో అశోకుడి ధర్మ చక్ర స్తూపం ఉంటుంది. సీఎం కార్యాలయం ఆరో అంతస్తులో ఉంటుంది.
ఆధునిక హంగులతో సచివాలయం
సెక్రటేరియట్ లో అందరూ పనిచేసుకోవడానికి అనుకూలంగా ఆధునిక సౌకర్యాలు ఉండేలా డిజైన్ చేశారు. కొత్త సెక్రటేరియట్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల ఛాంబర్స్ తో పాటు సకల సౌకర్యాలు ఉండనున్నాయి. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాలు ఉండేలా నిర్మించనున్నారు.
తెలంగాణ కొత్త సచివాలయాన్ని రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించేలా అద్భుత రీతిలో నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ డిజైన్ల పై కొన్ని రోజుల పాటు సీఎం కేసీఆర్ కసరత్తు చేశారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ లతో సంప్రదించి డిజైన్ ని ఖరారు చేశారు. ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్స్ తయారు చేసిన నమూనాను కొన్ని మార్పులు చేసి సీఎం ఫైనల్ చేశారు. మొత్తం ఏడు అంతస్తుల్లో సచివాలయ భవనాన్ని నిర్మించనున్నారు. సుమారు 5 వందల కోట్లతో కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టనున్నారు.
సంవత్సరం లోపు నిర్మాణం పూర్తి
టెండర్లు ఖరాయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, షాపూర్ జి పల్లోంజి సంస్థల మధ్య ఒప్పందం జరగనుంది. ఒప్పందం ప్రకారం టెండర్లు దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న రోజు నుంచి 12 నెలల్లోపు సచివాలయ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దీపావళికి సెక్రటేరియట్ భవనాల నిర్మాణం ప్రారంభమయితే వచ్చే ఏడాది దసరా నాటికి పూర్తయ్యే అవకాశాలుంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రూ. 500 కోట్ల రూపాయలతో సచివాలయాన్ని ఆధునిక హంగులతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో, పర్యావరణ హితంగా నిర్మించనున్నారు.