మాశర్మ
చందమామ పత్రిక ఎప్పుడు వస్తుందా, అని పిల్లలు,పెద్దలు ఎదురుచూస్తూ ఉండేవారు. అందులో కథలు, బొమ్మలు రెండూ ప్రధానమైన ఆకర్షణలు. ఆ బొమ్మలు అందించిన వారిలో ఇద్దరు ప్రముఖులు, ప్రధానులు.ఒకరు వడ్డాది పాపయ్య. రెండవవారు శంకర్. నిన్నటి తరం వరకూ తెలుగువారికి తన బొమ్మలతో సందడి చేసిన చందమామ శంకర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చందమామ కథలు చదవని తెలుగువారు నిన్న మొన్నటి వరకూ లేరన్నది అతిశయోక్తి కాదు. బేతాళుడు ఆవహించిన శవాన్ని భుజాన వేసుకొని, ఒక చేత్తో కత్తి దూసి చురుకైన కళ్ళతో చుట్టూ చూస్తూ ముందుకు అడుగులు వేసే విక్రమార్కుడి బొమ్మను చూడగానే పిల్లలు అక్కడే ఆగిపోతారు. పెద్దలు సైతం అదే చూస్తూ ఉంటారు. పిల్లలకు చూపిస్తూ ఉంటారు. ఈ దృశ్యాలు, ఈ అనుభవాలు, ఈ అనుభూతులు తెలుగువారిని దశాబ్దాల పాటు కట్టిపడేశాయి. ఈ బొమ్మలు వేసి విక్రమార్కుడిని మన కళ్ళకు కట్టిన శంకర్ తమిళనాడుకు చెందినవాడు. యువ దీపావళి సంచికలలోని కొన్ని కథలకు కూడా ఈయన బొమ్మలు అందించారు. ఇన్ని కోట్ల మందికి ఇన్నేళ్లపాటు కనువిందు చేసిన శంకర్ 96ఏళ్ళు జీవించి ఇప్పుడే కన్నుమూశారు. చందమామ పత్రిక సంస్కృతం మొదలు ఎన్నో భారతీయ భాషల్లో సందడి చేసింది. చందమామకు బొమ్మలు అందించిన వారిలో వడ్డాది పాపయ్య (వపా), చిత్రా, శంకర్ పాత్రలు మరువలేనివి.
విశ్వనాథకు చందమామ ఇష్టం
చందమామ నా చేత కూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంది. పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా… అంటూ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకూడా అనేవారు. ఈ కథలకు ప్రాణప్రతిష్ఠ చేసిన శంకర్ ప్రతిష్ఠ చాలా గొప్పది. శంకర్ పూర్తిపేరు కరతోలోవు చంద్రశేఖరన్ శివశంకరన్. 19 జులై 1924లో తమిళనాడులోని ఈరోడ్ కు దగ్గరగా ఉండే ఒక గ్రామంలో జన్మించారు. వీరి పూర్వీకులది తమిళనాడులోని కరతోలువు గ్రామం. వీరి నివాసం 1934లో చెన్నైకు మారింది. చందమామను తమిళంలో అంబులిమామ అంటారు.
చివరి చందమామ చిత్రకారుడు
చందమామ పత్రిక ప్రారంభం నుండి ఉన్నవారిలో వీరే చివరివారు. నేడు వీరు కూడా వీడు (ఇల్లు) ఖాళీ చేసి వెళ్లిపోయారు. చిన్నప్పటి నుండీ బొమ్మలు గీయడం అంటే ఈయనకు చాలా ఇష్టం. 12వ తరగతి పూర్తయిన తర్వాత చెన్నైలోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చిత్రకళలో డిగ్రీ పూర్తి చేశారు. బ్రష్ తో బొమ్మలు వేయడంలో సిద్ధహస్తుడు. ఎటువంటి మెటీరియల్ తో నైనా అద్భుతంగా బొమ్మలను తీర్చిదిద్దే నైపుణ్యం శంకర్ ను చిత్రకారుల్లో విభిన్నంగా నిలిపింది. డిగ్రీ అందిన వెంటనే, ఆ కాలంలో తమిళనాడులో సుప్రసిద్ధమైన కలైమగళ్ పత్రికలో చేరారు. 1946లో ఇక్కడ ప్రారంభమైన ఉద్యోగపర్వం చందమామలో చేరడంతో శిఖరానికి చేరింది. లైన్ డ్రాయింగ్ లో ఎందరో వీరి నుండి స్ఫూర్తి పొందారు. దశాబ్దాలపాటు కొన్ని వేల బొమ్మలు వేశారు. 96 ఏళ్ళు నిండు జీవితం గడిపిన పూర్ణకళాకారుడు చందమామ శంకర్. విక్రమార్కుడు, బేతాళుడు రేఖాచిత్రాల ద్వారా కోట్లాదిమంది పాఠకుల మదిలో నిలిచి’పోయిన’ శంకర్ కు బాష్పాంజలి సమర్పిద్దాం.
ఇప్పటి కూడా చందమామ పుస్తకాలు చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు
శంకర్ గారి మృతి తీరని లోటు