తాలిబాన్ పట్ల భారత్ ఎట్లా వ్యవహరించాలి-9
కాబూల్ విమానాశ్రయంలో ఆత్మహుతి బాంబర్లు పేలి వందమందికిపైగా పౌరులనూ, అమెరికా సైనికులనూ హత్య చేసిన ఉదంతం కథ మొదటికి వచ్దిందా అనే అనుమానం కలిగిస్తోంది. దోహా చర్చల తర్వాత అమెరికా, నాటో దేశాల సైనికుల ఉపసంహరణ ఫలితంగా అఫ్ఘానిస్తాన్ లో శాంతి నెలకొంటుందనుకున్న ఆశాభావానికి గండికొట్టినట్టయింది. తాలిబాన్ కానీ పాకిస్తాన్ లో వారి మద్దతుదారులు కానీ ఏమి హామీలు ఇచ్చినా వాటిని నిలుపుకునే వాతావరణం కనిపించడం లేదు. అఫ్ఘానిస్తాన్ లో శాంతిని పరిరక్షించలేరనీ, వేగుల సమాచారం అందించినప్పటికీ హింసాకాండను నిరోధించే శక్తి కానీ ఉద్దేశం కానీ తాలిబాన్ కి లేదని ఐఎస్-ఖొరసాన్ (ఐఎస్-కె) దాడులు నిరూపించాయి. తాలిబాన్ పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉంది. కాబూల్ నగరాన్నీ, విమానాశ్రయం వెలుపలి ప్రాంతాన్ని రక్షిస్తున్న హకానీ గ్రూప్ ను అటు అమెరికా, ఇటు ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్రవాదముఠాగా అభివర్ణించాయి. తాలిబాన్, హకానీ గ్రూప్ కి సంబంధం లేదనీ, అవి రెండు వేరువేరు సంస్థలనీ, తాము తాలిబాన్ తో సమన్వయం చేసుకుంటున్నామనీ అమెరికా అధికారులు చెబుతున్నారు.
Also read: తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి?
Also read: అఫ్ఘానిస్తాన్ పట్ల ఆసక్తి కోల్పోయిన అమెరికా
తాలిబాన్ అశక్తత, హకానీ గ్రూప్ నిర్వాకం, ఐఎస్-కె విజృంభణ భారత్ కు అత్యంత ప్రమాదకరమైన అంశాలు. మరో వైపు పాకిస్తాన్ భారత సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతోంది. కశ్మీర్ లో మిటిటెంట్లను రెచ్చగొడుతోంది. చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు ఉండనే ఉన్నాయి. ఈ సందర్భంలో భారత్ ఐక్యరాజ్య సమితి వేదికను సమర్థంగా వినియోగించుకోవాలి. తనకున్న ఆందోళనలనూ, అనుమానాలనూ ఎప్పటికప్పుడు అంతర్జాతీయ వేదికలపైన వెలిబుచ్చుతూ ఉండాలి. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అధ్యక్ష హోదాలో ఇండియాపైన గురుతర బాధ్యత ఉంది. ఈ హోదాను తెలివిగా వినియోగించుకొని తాలిబాన్ వ్యవహారాన్నీ, అఫ్ఘానిస్తాన్ పరిణామాలనూ, పాకిస్తాన్, చైనాల పాత్రలనూ క్షుణ్ణంగా చర్చించే వాతావరణం కల్పించాలి. అఫ్ఘాన్ ప్రజల హక్కులనూ, మహిళల భద్రతనూ, విద్యావకాశాలనూ, ఆరోగ్య పరిరక్షణనూ ప్రస్తావించే అవకాశం కల్పించాలి. హకానీ గ్రూప్ ఉపనాయకుడు, ఈ గ్రూపు అధినాయకుడు హైబతుల్లా అఖుండ్ జాదాకు కుడిభుజం అనదగినవాడు సిరాజుద్దీన్ హకానీని ప్రభుత్వంలో చేర్చుకోకుండా చూడటం క్షేమదాయకం. 2008-09లో కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంపైన ఆత్మాహుతి దళం దాడి చేయడానికి ప్రధాన కారణం హకానీ ముఠాలోని ఈ ప్రబుద్ధుడే.
1988 శాంక్షన్స్ కమిటీ అధ్యక్ష హోదాలో 135 తాలిబాన్ ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన భారత్ వారిపై ఆంక్షలను సడలించే ప్రయత్నాలను జాగ్రత్తగా గమనించాలి. ఐక్యరాజ్య సమితిలో అఫ్ఘానిస్తాన్ సీటులో తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి కూర్చోడానికి అర్హుడో కాదో కూడా నిర్ణయించాలి. అంతర్జాతీయ వేదికలలోభారత్ కు గల ఈ హోదాలను తాలిబాన్ తో సంబంధాలు మెరుగుపరచడానికి వినియోగించుకోవాలి. క్వాడ్ శిఖరాగ్ర సభలో కూడా భారత్ అఫ్ఘానిస్తాన్ పరిణామాల పట్ల తన ఆందోళనలనూ, ఆదుర్దాలనూ స్పష్టంగా వెలిబుచ్చాలి. వచ్చే నెల అమెరికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశాన్ని కూడా అప్ఘానిస్తాన్ విషయంలో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడానికి వినియోగించుకోవాలి. అప్పటికి తాలిబాన్ పట్ల ఏ వైఖరి అవలంబించాలో నిర్ణయించుకోగలగాలి.
Also read: మహాసామ్రాజ్యాలను నేలకరిపించిన అఫ్ఘానిస్తాన్
Also read: అఫ్ఘానిస్తాన్ పాతికేళ్ళ కిందట తాలిబాన్ వశం అయింది ఈ విధంగా…..
అఖిలపక్ష సమావేశంలో విదేశాంగమంత్రి జయశంకర్ చెప్పిన విషయాలు అర్థవంతంగానే ఉన్నాయి. వేచి చూసే వైఖరిని అఫ్ఘానిస్తాన్ విషయంలో పాటిస్తున్నామని చెప్పారు. అంతకంటే సాధ్యమైనంత వరకూ అఫ్ఘానిస్తాన్ పరిణామాలను ప్రభావితం చేసే పనులు చేయడం కూడా అవసరమేమో ఆలోచించాలి. పరిస్థితి పూర్తిగా పాకిస్తాన్ కు అనుకూలంగా మారకుండా, భారత అనుకూల శక్తులు అధికారం పంచుకునే విధంగా పరిస్థితులను నడిపించే ప్రయత్నం దౌత్యపరంగా చేయవచ్చును. హమీద్ కార్జాయ్ వంటి వ్యక్తులు కీలక స్థానాలలో ఉంటే ఇండియాకు మేలు జరగకపోయినా, కీడు కాస్త తగ్గుతుంది. దీర్ఘకాలిక దృష్టితో చూసినట్లయితే తాలిబాన్ ప్రభుత్వంతో సంబంధాలను నిర్మించుకోవడానికి భారత్ ప్రయత్నించాలి. తాలిబాన్ నూ, అఫ్ఘానిస్తాన్ నూ పూర్తిగా పాకిస్తాన్, చైనా, రష్యాలకు వదిలిపెట్టకుండా భారత్ కూడా తన ఉనికిని చాటుకునే విధంగా, తనవంతు ప్రయత్నంగా ఏదో ఒక విధంగా పరిణామాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం మంచిది. సప్తసముద్రాల ఆవల ఉన్న అమెరికాతో సంబంధాలను పెంపొందించుకునే పేరుతో అమెరికా అజెండాను అఫ్ఘానిస్తాన్ విషయంలో కూడా అమలు పరచకుండా భారత్ కు ఏ అజెండా ప్రయోజనకరమో దానిని అనుసరించడం ఉత్తమం.
Also read: పాంజ్ షీర్ వైపు కదులుతున్న తాలిబాన్
Also read: అఫ్ఘానిస్తాన్ పై అప్పుడే దాడి ప్రారంభించడం అవసరమా?
అఫ్ఘానిస్తాన్ భౌగోళికంగా చాలా కీలకమైన ప్రాంతం. భారత్ దూరంగా ఉంటే అఫ్ఘానిస్తాన్ చైనా, పాకిస్తాన్ చెప్పు చేతల్లో ఉంటే క్రమంగా చైనాకు మరింత సన్నిహితం అవుతుంది. చైనా ప్రమేయంతో జరుగుతున్న అంతర్జాతీయ రహదారి నిర్మాణానికి అఫ్ఘానిస్తాన్ సహకరించే పక్షంలో ఆర్థిక సహాయం చేస్తాననీ, అఫ్ఘానిస్తాన్ పునర్నిర్మాణానికి దోహదం చేస్తాననీ చైనా ముందుకు వస్తుంది. చైనాకు నిధులు ఉన్నాయి. తాలిబాన్ తో ఇప్పటికే సత్సంబంధాలు ఉన్నాయి. కనుక ఇండియా కూడా తాలిబాన్ తో సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలి. తాలిబాన్ ఉగ్రవాదులనీ, వారి ప్రభుత్వం ఎంతోకాలం మనజాలదనీ అనుకోవడం భ్రమ. తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ జనాభాలో నలభై శాతం పైగా ఉన్న పష్టూన్లకు ప్రతినిధులు. మిగిలిన తెగలను కూడా కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ఘాన్ ప్రజల ఆమోదంతోనే ఆ దేశంలో ప్రవేశించి మొత్తం దేశాన్ని రెండు వారాలలోగానే స్వాధీనం చేసుకున్నారు. తాలిబాన్ వ్యతిరేక ధోరణినీ, ప్రతికూల వైఖరినీ అవలంబించడం వల్ల ఇండియాకు జరిగే మంచి కంటే చెడు ఎక్కువ. అఫ్ఘానిస్తాన్ పట్ల అనుసరించవలసిన వైఖరిని సుదీర్ఘ సమాలోచనలు చేసి నిర్ణయించుకోవడం ఆరోగ్యప్రదం.
Also read: చరిత్రలో అఫ్ఘాన్లను ఓడించి నిలిచిన ఏకైక వీరుడు మహారాజా రంజిత్ సింగ్!
Also read: అఫ్ఘానిస్తాన్ లో ఏం జరుగుతోంది?