‘ఇట్లు అమ్మ’ సినిమా రివ్యూ
ఒక తల్లి, ఒక కొడుకు. వాళ్ళదైన ఒక చిన్న ప్రపంచం. ఎక్కడినుంచో బతకటానికి వచ్చి ఎవరితోనూ పెద్దగా పరిచయం పెట్టుకోకుండా తమదే లోకంగా బతికే తల్లి కొడుకుల ప్రపంచం అది. ఒక తుఫాను రాత్రి పనికి వెళ్ళిన కొడుకు తిరిగి వెనక్కి రాకపోతే ఆ తల్లి ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. చివరికి ఆ కొడుకు శవంగా కనపడితే కూలిపోయిన తల్లి ప్రపంచం, అతను తుఫానులో చిక్కుకుని చనిపోలేదని ఎవరో చంపేస్తే చనిపోయాడని తెలిసినప్పుడు అయోమయానికి గురవుతుంది. ఎవరితో గొడవలు లేని, ఎవరికీ అపకారం తలపెట్టలేని, కనీసం ఏ ప్రేమ వ్యవహరం కూడా లేని కొడుకును చంపే అవసరం ఎవరికి ఉంటుంది? ఎవరు చంపి ఉంటారు? అసలెందుకు చంపి ఉంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం తల్లి చేసే ప్రయత్నం, అందుకు ఆమె చేసే ప్రయాణం ఇట్లు మీ అమ్మ సినిమా.
తన కొడుకును చంపినవాడిని కనుక్కోవడంలో వ్యవస్థ విఫలమైతే తానే స్వయంగా వెతకడానికి ఒక వినూత్న మార్గం ఎన్నుకున్న పాత్రలో రేవతి నటించింది. పిచ్చి పని అని, అటెన్షన్ కోసం చేస్తోందని అందరూ నిరుత్సాహ పరిచినా తన కొడుకును చంపిందెవరో తెలుసుకోవటానికి అతనికే బహిరంగ లేఖలు రాయటం మొదలు పెదుతుంది. డిజిటల్ యుగంలో ఉత్తరాలా అనిపించవచ్చు. కాని తల్లి పాత్ర నేపథ్యానికి అది ఇబ్బందిగా అనిపించదు. అప్పటిదాకా కొడుకుతో కూడిన తన ప్రపంచంలో తానుగా ఉండి చుట్టూ జరిగే వాటి పట్ల ఉన్న ఉదాసీనత నుంచి బయటపడి చుట్టూ జరిగే సంఘటనలని కొత్తగా చూడటం మొదలుపెడుతుంది.
ఈ ప్రయాణంలో సమాజంలో “నేరం” ఎలా పుడుతుందో ఎందుకు పెరుగుతుందో, అసలు నేరస్తులు ఎవరో, ఏ “నేరం” చెయ్యని వాళ్ళు కూడా ఎలా నేరంలో భాగమవుతారో అర్ధం చేసుకోవటంతో పాటు మనుషులు ద్వీపాల్లా బతకటం కూడా ఎందుకు నేరమో అర్ధం చేసుకుంటుంది. ఒక మనిషి కోసం మరో మనిషి నిలబడని సమాజం ఎంత ప్రమాదకరమో, ప్రేమలేని తనం ఎటువంటి నేరస్తులను పుట్టిస్తుందో అర్ధం చేసుకుంటుంది. తాము భద్రంగా ఉన్నాం కనుక మిగిలిన ప్రపంచం ఏమైనా ఫర్వాలేదు అనుకొనే భద్రజీవుల జీవితాల్లో భద్రత ఎంత అన్న ప్రశ్న ఆమెకు మాత్రమే కాదు చూసే ప్రేక్షకులకు కూడా కలిగించటమే ఈ సినిమా చేసే పని.
తన కొడుకును చంపిన వాడెవరో ఆ తల్లి కనుక్కోగలుగుతుందా? కనుక్కుంటే ఏం చేస్తుంది? విఫల వ్యవస్థలు ఈ ప్రయత్నం పట్ల ఎట్లా స్పందించాయి? వంటివన్నీ సినిమాలో చూడొచ్చు. కానీ నేరం వైపు కాక నేరస్తుల వైపు చూసే ధోరణి పెరిగి, సమాజం సమాజమే పగలను ప్రతీకారాలను ఒక “శిక్ష” గా చూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా తప్పనిసరిగా ఒక అవసరమైన అలోచనను రేకెత్తిస్తుంది. అందుకోసమైనా తప్పక చూడాల్సిన సినిమా.
90 ల్లో మానవ హక్కులకు సంబంధించి ఒక మంచి సినిమా అంకురం కు దర్శకత్వం వహించిన సి. ఉమామహేశ్వర రావు మరో సున్నితమైన కీలకమైన అంశంతో ఎక్కడా ఎమోషన్ దెబ్బ తినకుండ ఈ సినిమా తీసారు.
తల్లిగా నటించిన రేవతి తో పాటు ఆమె కొడుకును చంపిన వాడిగా నటించిన కొత్త నటుడు సినిమాకు హైలైట్ అయితే గోరటి వెంకన్న ఆట పాట ఒక సర్ప్రైజ్ . డబ్బింగ్ డైలాగ్ డెలివరీలో మరికొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. మొత్తంగా ఇది తప్పనిసరిగా చూడాల్సిన ఒక మంచి సినిమా. Sony Liv లో ఉంది.