Monday, November 18, 2024

దసరానాడు పూజించవలసిన జమ్మిచెట్టు ఆకులను ఊడబెరకడం న్యాయమా?

మన పురాణాలు జమ్మిచెట్టును అపరాజితాదేవిగా పూజించాలని చెబుతున్నాయి. కాని భక్తి కనబరుస్తూ ఆకుల రెబ్బలను దూసి నిర్దాక్షిణ్యంగా  కోసి అసలు చెట్టునే మోడు చేసి చివరకు చంపేయడం మహపాపం. పూజ చేస్తే పుణ్యం వస్తుందో లేదో చెప్పలేము. కాని ఆకులు కోసి ప్రాణం తీస్తే మాత్రం పరిష్కారం లేని పాపాలే అని పెద్దలు చెబుతారు.

మహిషాసురుడినే భయంకరమైన రాక్షసుడిని చంపడానికి మూడు మూర్తుల శక్తులు ఏకమై ఒక మహాశక్తిగా అవతరించి మహిళామూర్తి రూపంలోవచ్చిన  ఆ తల్లి మహిషాసురుడిని మర్దించినందున ఈ రోజును విజయదశమి అంటారు. దుర్గమ్మ తల్లి, తన తనయులు గణేశుడిని కార్తీకుడిని చూడడానికి వెళ్లి తొమ్మిది రోజులు వారి పూజలు అందుకొని పదోరోజున మళ్లీ పరమ శివుడిని చేరుకుంటుందనీ ప్రజల విశ్వాసం.

విశేషం ఏమంటే ఈ  రోజు సాయంత్రం జమ్మి చెట్టును పూజించి, ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తారు.

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ

అనే శ్లోకాన్ని  చదువుకుంటారు.

జమ్మిచెట్టు పాపాన్ని తొలగిస్తుందని, శత్రువులు లేకుండా చేస్తుందని ఈ శ్లోకం అర్థం. పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు కొలువులో చేరారు. బృహన్నల గా పేడి రూపంలో రహస్యంగా ఉన్న అర్జునుడిని ధనుర్ధారిగా మార్చిన చెట్టు జమ్మి చెట్టు. అజ్ఞాత వాసం ముగిసే చివరిరోజుల్లో కౌరవులు పాండవులను బయటపెట్టడంకోసం విరాటరాజు ఉత్తరదిశలోని గోవులను దొంగతనం చేయడం (ఉత్తరగోగ్రహణం) కోసం యుద్ధానికి వస్తారు. దక్షిణంవైపు సాగిన దాడిని ఎదుర్కొనడానికి అందరూ వెళ్తారు బృహన్నల సారథిగా ఉత్తరకుమారుడు మాత్రమే ఉంటారు కనుక వారే యుద్ధానికి బయలుదేరతారు.  జమ్మి చెట్టు పైన సంవత్సరం పాటు శవరూపంలో ఆయుధాలు భద్రంగా ఉంటాయి, ఉత్తర కుమారుడు ఆ మూట విప్పి గాండీవాన్ని తీసి  అర్జునుడికి ఇస్తాడు. గాండీవ ధారణ చేసి జమ్మి చెట్టుకు నమస్కరించి బృహన్నల విజయుడై గోగ్రహణ సమరంలో కౌరవులపై విజయం సాధిస్తాడు. అందుకే విజయదశమి.

అపరాజితా దేవి

శమీ వృక్షం రూపంలో అపరాజితా దేవి ఉంటుందని ఆమెను పూజించిన వారికి పరాజయం ఉండదని ఆమె తనను వేడినవారికి సదా విజయాన్నే అందిస్తుందని విజయదశమి కథలు వివరిస్తాయి. ఆయుధాలను దాచిన జమ్మి చెట్టు తో పాటు ఆ ఆయుధాలను కూడా పూజించడం ఆనవాయితీగా మారింది. అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబంధిత వస్తువులను శుభ్రపరచి, వాటికి పూజలు చేయడం శరన్నవరాత్రి ఉత్సవాలలో ముఖ్యభాగం. ఆయుధాలకూ, కలాలకూ, హలాలకూ, పరికరాలకూ, ఆధునిక కాలంలో కంప్యూటర్ లకూ తదితర యంత్రాలకూ పూజలు చేస్తారు. పోరాటంలో విజయం కూర్చే ప్రక్రియలో ఆయుధాల పాత్రను కూడా గుర్తించడానికే ఈ పండుగ.

రాముడి పూజలు

ఇక త్రేతాయుగంలో అరణ్యవాసానికి వెళుతున్న రాముడికి శమీవృక్షం విశ్రాంతినిచ్చిందంటారు. ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. దశ కంఠుడిని సంహరించితన ప్రియపత్ని సీతను చూస్తాడు. అందుకని రామస్య ప్రియదర్శినీ. 

ఈ విధంగా “అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనీ” అంటే ఈ ఇద్దరు పురాణ పురుషులకు శమీవృక్ష పూజతో సంబంధముందని వివరించారు పెద్దలు.

మరో శ్లోకం ఈ విధంగా ఉంది

‘‘శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,

ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.

కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,

తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.

“ఓం ఇభవక్త్రాయ నమః – శమీ పత్రం సమర్పయామి” అంటూ గణపతికి పత్రి పూజ చేస్తారు.

యజ్ఞాగ్ని ప్రదాత

అంతేగాక శమీవృక్షం అగ్ని కాంతికి ప్రతీక. వైదిక భాషలో శమీ వృక్షాన్ని ‘అరణీ’ అంటారు.  రెండు ఎండిన జమ్మికొమ్మలతో ఘర్షణ చేసి నిప్పు పుట్టిస్తారు. హోమాగ్నిని ఈ విధంగానే ప్రజ్వరిల్లజేయాలి. అప్పట్లో అగ్గిపెట్టెలు లేవు కదా. అగ్ని ఉద్భవించేందుకు మధింప యోగ్యమైన కాష్టములకు వినియోగించే దారువని “ఆరణి’కి  అర్ధం. అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది.

ఎడారి ప్రాంతపు బంగారు చెట్టు

పంజాబీలో, హిందీ లో దీన్ని జండ్ అంటారు.  హర్యాన్వీలో జండీ అంటారు. రాజస్తాన్లో ఖేజ్రీ అని పిలుస్తారు. గుజరాత్ లో శమీ శమ్రీ అంటారు. భారతదేశంలో ఈ చెట్టును ఎడారి ప్రాంతపు బంగారు చెట్టు అని పిలుస్తారు. యుగయుగాలనుంచి ఈ చెట్టును పవిత్ర వృక్షంగా దేవతగా పూజిస్తారు. ఎడారిలో పెరిగే ఈ చెట్టు జంతువులకు పక్షులకు నిలువ నీడనిస్తుంది. శాంగ్రీ పేరుతో ఈ చెట్టుకాయలను వంటలో వాడతారు.

జమ్మి చెట్టు శాఖలు వేలాడుతుంటాయి. వాటికి ముళ్లుంటాయి.  మధ్యరకంగా పెరిగే వృక్షం. జమ్మి పత్రాలు సన్నగా దీర్ఘవృత్తాకారంగా గురు అగ్రంతో పత్రకాలున్న ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు. ఈ ఆకు సన్నటి పొడుగాటి కంకులలో అమర్చబడిన పసుపురంగులో ఉంటుంది.

ఈ చెట్టు ఆకులను బంగారం అని పిలుస్తారు. బంగారు లోహంకన్నా ఇదే అసలు బంగారం అని చెప్పడంలో పర్యావరణాన్ని కాపాడుకోండి అది మిమ్మల్ని కాపాడుతుందని చెప్పే గొప్పభావన ఉంది. అయితే జమ్మి చెట్టు ఆకులు పీకి జేబులో వేసుకునే స్వార్థంతో జమ్మి చెట్టును పూజించే బదులు చంపేసే దుర్మార్గం పెరుగుతున్నది. కనుక ఆకులు పీకకుండా చెట్టును గౌరవించడం నేర్చుకోవాలి.

ఔషధీ గుణాలు

జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా సంతానం నిలుస్తుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ లో Prosopis) ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది. ఈ చెట్టు శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా.

కల్పవృక్షం

పాములు తేళ్లు కాటేస్తే  ఆ విషాన్ని ఈ చెట్టు బెరడు బయటకు లాగేస్తుందని, వారిని బతికిస్తుందని తెలిసింది. ఈ చెట్టు బెరడుతో చేసిన మందులతో నరాల బలహీనత, కుష్టు, చర్మవ్యాధులు, డయేరియా డీసెంట్రీ, అర్ష మొలలు, అస్తమా, కండలలో గడ్డలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ చెట్టునుంచి స్రవించిన గోందు రుచికరమైన పోషకాహార పదార్థం. గర్బవతులకు ఉపయోగం. ఈ చెట్టులోని అన్ని భాగాలూ బాగా ఉపయోగపడతాయి. అందుకే కల్పవృక్షం అంటారు.

విజయ దశమి నాటి సాయంత్రం అపరాజితా దేవిగా కొలిచి శమీ వృక్షం (జమ్మి చెట్టు) వద్దపైన వివరించిన శ్లోకాలు చెప్పుకొని ప్రార్థించాలి కాని జమ్మి చెట్టు ఆకులను త్రుంచరాదు.  అసలు ఏ చెట్టైనా సాయంత్రం వేళ ముట్టుకోకూడదనే ఆచారం కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణా ప్రాంతంలో శమీపూజ తరువాత’పాలపిట్ట’ను చూచే ఆచారం కూడా ఉన్నది. పాలపిట్ట కనిపిస్తే విజయసంకేతంగా భావిస్తారు. మిత్రులనూ బంధువులనూ ఆత్మీయంగా కౌగిలించుకుంటారు. బంధు మిత్ర పరిష్వంగ పవిత్ర దినం ఈ రోజు. ప్రేమ భావాన్ని పెంచాలని సౌభ్రాత్రుత్వాన్ని పెంచాలనీ ఈ పండుగ లక్ష్యాలుగా తీర్చిదిద్దారు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

1 COMMENT

  1. చాల బాగుంది దసరా పండుగ సందర్భంగా అనెక విషయాలు తెలియ చేశారు ధన్యవాదములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles