శకుని గాంధార రాకుమారుడు. గాంధారి సోదరుడు. కౌరవులకు అనుకూల శత్రువు. గాంధారి జాతక దోషాన్ని పరిహరించడానికి తనకో జంతువుతో వివాహం చేసి దాన్ని చంపి తరువాత దృతరాష్టృడితో వివాహం జరిపిస్తారు. చాలాకాలం తరువాత విధవరాలి బిడ్డగా అధిక్షేపించబడి దుర్యోధనుడు విషయం తెలుసుకుని గాంధార రాజును, అతని పుత్రులందరిని ఖైదుచేసి అందరికీ కలిపి రోజుకొక్క కబళం మాత్రమే భోజనం ఏర్పాటు చేస్తాడు. వారందరూ పగ తీర్చుకునే ఉద్దేశంతో అందరిలోకి తెలివైన వాడైన శకునికి ఆ ఆహారం ఇచ్చి తాము మరణిస్తారు. తండ్రి ఎముకలతో తయారైన మాయా పాచికలతో ఒక్కడిగా మిగిలిన శకునిని దుర్యోధనుడు క్షమించి చేరదీస్తాడు.
శకుని కాలు కాస్త వంకర. కాని బుద్ది మాత్రం పూర్తిగా వంకర. ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే మాట చాతుర్యం, కపట నాటకంతో ఎవరినైనా వశం చేసుకోగల తెలివి అతని సొంతం. తన రాజ్యానికి వెళ్ళక దుర్యోధనుడితో ఉండిపోవడం అతని వినాశనానికి మార్గం సుగమం చెయ్యడం కోసమే. దుర్యోధన, దుశ్శాసన, కర్ణులతో కలసి దుష్టచతుష్టయంగా వినుతికెక్కాడు. అసూయాపరుడైన దుర్యోధనుడిని పాండవులకు వ్యతిరేకంగా పురికొల్పడమే అతని ఉద్దేశ్యం. కౌరవ పాండవుల మధ్య విద్వేషాన్ని రగిలించి పాండవులద్వారా కౌరవులను సర్వనాశనం చేయించడమే అతని అంతిమ లక్ష్యం.
దుర్యోధనుడి ద్వారా ధర్మరాజును జూదానికి పిలిపించి మాయ పాచికలతో తన రాజ్యాన్ని, తన తమ్ములను, తనను, పాంచాలిని పందెంలో గెలిచి ద్రౌపది వస్త్రాపహరణానికి కారకుడౌతాడు. రెండవసారి జూదంలో అరణ్య అజ్ఞాత వాసాల షరతుతో మళ్లీ ధర్మరాజును ఓడించి అందరిని రాజ్య భ్రష్టులను చేస్తాడు.
శకుని కుట్ర కుతంత్రాలతో దృతరాష్ట్ర, దుర్యోధనుల స్వార్ధంతో పాండవులు అష్ట కష్టాల పాలవుతారు. పదమూడేళ్లు వాళ్ల మనసుల్లో చెలరేగిన క్రోధం కురుక్షేత్రంలో కౌరవులందరి నాశనానికి దారి తీస్తుంది. అధర్మ మార్గంలో పయనించిన శకుని తన పగ తీర్చుకునే ప్రయత్నంలో తన శతృవులైన కౌరవులతోపాటు తానూ ప్రాణాలను బలిచేయవలసి వస్తుంది. ధర్మహాని ప్రాణాంతకం.
Also read: తెలుగు మీడియం
Also read: మనువు చెప్పిన చతుర్వర్ణాల పుట్టుక వెనుక ప్రతీకలు (symbols).
Also read: “దృతరాష్టృడు”
Also read: మహా భారతంలో ధర్మం
Also read: బలరాముడు విష్ణు అవతారమా?