అశ్వనీకుమార్ ఈటూరు
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను నార్కొటిక్ డ్రగ్స్ నిరోధక శాఖ అధికారులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. ముంబయ్ నుంచి గోవా వెళ్ళే ఒక విహార నౌక (క్రూయిజ్ ) లో మాదకద్రవ్యాలతో కొందరు బాలీవుడ్ కు సంబంధించినవారు పార్టీ చేసుకోబోతున్నారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) అధికారులకు సమాచారం అందింది. వెంటనే వారు క్రూయిజ్ పైన దాడి జరిపారు. ప్రయాణికుల వేషంలో వెళ్ళి అదను చూసి దాడి ప్రారంభించారు. అక్కడ ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసి ప్రశ్నించారు. వారిలో ఆర్యన్ ఖాన్ ఒకరు.
ఆర్యన్ ఖాన్ ను వైద్యపరీక్ష కోసం జెజె హాస్పిటల్ కు తరలించారు. మాదకద్రవ్యాలను తాను కొనలేదని ఆర్యన్ ప్రకటన చేశారు. ఆర్యన్ ఖాన్ పేరు బయటికి పొక్కడంతో ఈ కేసుకు విపరీతమైన ప్రాముఖ్యం వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వార్త స్వైరవిహారం చేస్తోంది. 1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ లోని 8(సి) సెక్షన్ కింద ఆర్యన్ ను అరెస్టు చేశారు. మదక ద్రవ్యాలను ఉత్పత్తి చేసినా, తయారు చేసినా, కలిగి ఉన్నా, విక్రయించినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ చేసినా, వినియోగించినా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్టానికి దిగుమతి చేసినా, ఎగుమతి చేసినా, దేశం నుంచి బయటికి ఎగుమతి చేసినా, బయటి నుంచి దేశంలోకి దిగుమతి చేసినా అది శిక్షార్హమైన నేరమని ఈ చట్టం స్పష్టం చేస్తున్నది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారికి ఆరు నెలల వరకూ కఠిన కారాగారం, జరిమానా వేయవచ్చు. లేదా కారాగారవాసం, జరిమానా రెండూ వేయవచ్చు. దాడి చేసినప్పుడు వారి దగ్గర ఎంత మొత్తంలో మాదకద్రవ్యాలు దొరికాయనేదానిపైన ఆధారపడి ఉంటుంది. కార్డేలియా క్రూయిజ్ పైన ఎన్ సీబీ అధికారులు చేసిన దాడిలో 13 గ్రాముల కొకైన్, అయిదు గ్రామలు ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ, రూ. 1,33,000 నగదు దొరికినట్టు అధికారులు కోర్టులో చెప్పారు. పట్టుపడిన మాదకద్రవ్యాల విలువ రూ. 5 కోట్ల వరకూ ఉంటుంది.
కోర్డేలియా క్రూయిజ్ కూ, మాదకద్రవ్యాలకూ ఎటువంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేదనీ, తాము ప్రయాణికుల వినోదం కోసం కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామనీ, కానీ మాదక ద్రవ్యాలు వినియోగించే దుష్ట సంస్కృతి తమకు లేదనీ, దిల్లీకి చెందిన ఈవెంట్స్ కంపెనీకి కార్డేలియా క్రూయిజ్ అద్దె కు ఇచ్చామనీ, మా క్రూయిజ్ సంస్కృతికి మాదకద్రవ్యాలు పూర్తిగా విరుద్ధమైనవని క్రూయిజ్ యాజమాన్యసంస్థ అయిన వాటర్ వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈవో జర్గన్ బెయిలన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేసినవారిని కోర్టులో హాజరుపరిచాయి. ఆర్యన్ నూ, మున్ మున్ ధమేచానూ, అర్బాజ్ మర్చంట్ నూ సోమవారంవరకూ న్యాయస్థానం ఎన్ సీబీ కస్టడీలో ఉండాలని ఆదేశించింది. ఆర్యన్ అరెస్టు వార్త తెలియగానే షారుఖ్ ఖాన్ తన ఇంటి నుంచి బయలు దేరి తమ లాయరు సతీష్ మానెషిండే ఇంటికి వెళ్ళడం కనిపించింది. అదనపు మెట్రొపాలిటన్ మెజిస్ట్రేట్ రాజే భోస్లే ఎదుట ఆర్యన్, తదితరులను హాజరు పరిచినప్పుడు ఆర్యన్ తరఫు న్యాయవాది సతీష్ మానెషిండ్ ఈ వ్యవహారంలో తన క్లయింట్ (ఆర్యన్)కు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. రియా చక్రవర్తి కేసులో సతీష్ మానెషిండే పేరు వ్యాప్తిలోకి వచ్చింది. ఆర్యన్ దగ్గర అభ్యంతరకరమైన పదార్థం ఏదీ దొరకలేదనీ, వాట్సప్ మెసేజ్ ల ఆధారంగా తన క్లయింట్ ను అరెస్టు చేశారనీ, ఇది అన్యాయమనీ న్యాయవాది వాదించారు.