- ప్రపంచ నంబర్ వన్ షఫాలీ
- 776 రేటింగ్ పాయింట్లతో టాప్
ప్రపంచ మహిళా క్రికెట్ టీ-20 వ్యక్తిగత ర్యాంకింగ్స్ల్ లో భారత జోడీ షఫాలీ వర్మ, స్మృతి మంథానా అదరగొట్టారు. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లో నిలకడగా రాణించడం ద్వారా షఫాలీ 26 రేటింగ్ పాయింట్లు సాధించడం ద్వారా తన టాప్ ర్యాంక్ ను మరింత పటిష్టం చేసుకోగలిగింది. దక్షిణాఫ్రికాతో ముగిసిన ఆఖరి టీ-20 పోరులో ఓపెనర్ గా బరిలోకి దిగిన షఫాలీ కేవలం 30 బాల్స్ లోనే 60 పరుగులు సాధించడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా తన స్థానాన్ని కాపాడుకొంది.
షఫాలీ మొత్తం 776 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిస్తే ఆస్ట్ర్రేలియా ప్లేయర్ బెత్ మూనీ 741 పాయింట్లతో రెండోర్యాంకులో కొనసాగుతోంది. టాప్ ర్యాంకర్ షఫాలీ కంటే మూనీ 35 పాయింట్లతో వెనుకబడి ఉంది. 2019 లో కేవలం 15 సంవత్సరాల వయసులోనే భారత టీ-20 ఓపెనర్ గా బరిలోకి దిగిన షఫాలీ వీరబాదుడు ఓపెనర్ గా గుర్తింపు సంపాదించుకొంది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 73 పరుగుల స్కోరు సాధించడం ద్వారా అత్యంత పిన్నవయసులో టీ-20 హాఫ్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్ గా షఫాలీ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
ఇదీ చదవండి: విజయం మాది…అవార్డులు వారికా?
హర్యానాలో జన్మించి అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగిన షఫాలీ తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 22 టీ-20 మ్యాచ్ ల్లో మూడుహాఫ్ సెంచరీలతో సహా 617 పరుగులు నమోదు చేసింది. 148.31 స్ట్రయిక్ రేటు, 29.83 సగటు సంపాదించింది. విండీస్ తో ఐదుమ్యాచ్ ల సిరీస్ లో 158 పరుగులు సాధించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సైతం షఫాలీ సొంతం చేసుకొంది. మరో ఓపెనర్ స్మృతి మంథానా 28 బాల్స్ లో 48 పరుగులు చేయడంతో పాటు షఫాలీతో కలసి 96 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసింది.
భారత బౌలర్లలో రాజేశ్వరీ గయక్వాడ్ 13వ ర్యాంక్ లోనూ, హైదరాబాదీ పేసర్ అరుంధతీ రెడ్డి 56వ ర్యాంక్ లోనూ నిలిచారు. మహిళా క్రికెట్లో భారత్ జట్టుగా రాణించడంలో విఫలమవుతున్నా షఫాలీ, మిథాలీ, స్మృతి, హార్మన్ ప్రీత్ లాంటి ప్లేయర్లు వ్యక్తిగతంగా రాణించగలుగుతున్నారు.
ఇదీ చదవండి: కరోనాకి క్రికెట్ మాస్క్ బయోబబుల్