ఆకాశవాణిలో నాగసూరీయం-20
వినుడు వినుడు నాగాథ, బొమ్మా-బొరుసా, కథారవళి, వారం-వారం, మరపురాని సంపాదకులు, తెలుగునాట స్వాతంత్ర్యోద్యమం, అలనాటి సినీ వైతాళికులు, వ్యక్తిత్వ వికాసం, ఈవారం, తెలుగు స్వీయచరిత్రలు, చరిత్రపుటల్లో…, శతవసంత సాహితీమంజీరాలు, వెలుతురు చినుకులు… ఇవన్నీ కొన్ని వారాలపాటు విజయవాడ ఆకాశవాణితో 1996 తర్వాత మూడు నాలుగేళ్ళలో నేను నిర్వహించిన ధారావాహిక కార్యక్రమాల పేర్లు. వీటిలో రెండో, మూడో ఒకే కళాకారుడు చేసిన శీర్షికలుంటాయి – మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ‘అలనాటి సినీవైతాళికులు’ చేసినట్టు! మిగతావన్నీ వేర్వేరు ప్రసంగకర్తలు వేర్వేరు కోణాల మీద ప్రసంగించారు!
Also read: రేడియోకూ, పత్రికలకూ పోలిక ఉందా?
1996 సంవత్సరం మధ్యలో బదిలీ మీద విజయవాడ వెళ్ళగానే నాకు అప్పగించిన కార్యక్రమం – ఉదయరేఖలు! అంతకు సుమారు ఓ దశాబ్దం క్రితం రేడియో, టెలివిజన్ ఛానళ్ళలో ఉదయపు పూట ఆడియన్స్ ను ఆకర్షించడానికి ‘మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎమ్మైయస్)’ అన్ని కేంద్రాలలో ప్రారంభించారు. నిత్యజీవితంలో అవసరమైన సమాచారం, ఆరోగ్యకరమైన సంగీతం మేళవింపుగా అరగంట సాగే కార్యక్రమమది! ఈ కాన్సెప్ట్ తో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మొదలైనప్పుడు నేను గోవా ఆకాశవాణిలో ఉన్నాను. కార్యక్రమాలు ఎలా సాగేవో జాగ్రత్తగా గమనించి ఉన్నాను. 1991లో అనంతపురంలో ఉదయప్రసారాలు లేవు కనుక — ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే ఆలోచన అక్కడ రాలేదు.
విజయవాడ కేంద్రం సంచాలకులు పద్మనాభరావు
అనంతపురంలో విజయవాడ, హైదరాబాదు ఆకాశవాణి కేంద్రాలు వినబడే పరిస్థితి లేదు. అప్పట్లో కడప, ధార్వాడ, బెంగుళూరు, మైసూరు రేడియో స్టేషన్లు అక్కడికి బాగా వినబడేవి. క్వాలిటీ లేని ప్రసారాలు వినడం నాకు తొలినుంచి చీదరగా ఉండేది. టెలివిజన్ ఉన్నా ఉదయం పూట టీవీ చూసే అలవాటు ఏర్పడలేదు.
అనంతపురం రేడియో స్టేషన్లో పని చేసిన డా. ఆర్. ఎ. పద్మనాభరావుగారే నేను విజయవాడ వెళ్లేసరికి అక్కడ డైరెక్టరుగా ఉన్నారు. వెళ్ళగానే ‘ఉదయరేఖలు’ కార్యక్రమాన్ని పర్యవేక్షించమని కోరారు. “ఎలా చెయ్యాలి, ఏమి చెయ్యాలి” – అని వారిని అడిగాను. “…ఇంతవరకు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ చూస్తున్నారు. మీరు ఏమిటో తెలుసు… మీ పద్ధతిలో మీరు ప్లాన్ చేసుకోండి…” అని మాత్రమే జవాబుగా చెప్పి ఎక్కడ స్వేచ్ఛ తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో చక్కగా ధ్వనించారు. అంతకు మించి మరేమీ సలహా ఇవ్వలేదు. అయితే ప్రతి రోజూ ఎవరో ఒకరి పేరు సూచించడం వారికి అలవాటు. కానీ వారు అక్కడ ఉన్నది కేవలం ఓ సంవత్సరం. అంతే!
Also read: నా మైక్రోఫోన్ ముచ్చట్లు
ఉదయరేఖలు
విజయవాడలో ఉన్న ఐదున్నర సంవత్సరాల కాలం నేను ‘ఉదయరేఖలు’ పర్యవేక్షించాను. చాలా ఇతర కార్యక్రమాలు, బాధ్యతలు అదనంగా వస్తూ పోతూ వుండేవి కానీ ‘ఉదయరేఖలు’ మాత్రం నాతోనే సాగింది. అది లైవ్ గా సాగే సంచికా కార్యక్రమం. ఆరోగ్య విషయాలు, వినియోగదారుల జాగ్రత్తలు, పర్యావరణ అవగాహన, సైన్స్ సమాచారం, చరిత్ర, సామాజిక, ఆర్థిక విషయాలు, సైకాలజి, సాహిత్యం, కళలు – ఇలా ఎన్నో విషయాలు అందులో సంగీతంతో పాటు ప్రసారం అయ్యాయి. కథలు, కవిత్వం వేరొక విభాగంలో ఉండేవి. ఇందులో సంగీతం అంటే ఒకటి, రెండు సినిమా పాటలు ఉండేవి. వారంలో ఓరోజు మాత్రమే పదినిమిషాల లలిత సంగీతం ఉండేది.
అనంతపురం వంటి చిన్న కేంద్రంలో పనిచేసిన నాకు విజయవాడలో ఉదయం వార్తలు తర్వాత అరగంట కార్యక్రమం ఇవ్వడం అంటే చిన్న సవాలు మాత్రమే కాదు. అంతవరకు చదువుకున్న పత్రికలు, పుస్తకాలు, అభ్యసించిన విద్య, గడించిన నైపుణ్యం, గమనించిన విషయాలు ఒక వైపు ఉండగా; కొనతట్టుపల్లి, పాలసముద్రం, హిందూపురం, పుట్టపర్తి, తిరుపతి వంటి చోట్ల నివాసం కారణంగా తెలుసుకున్న అంశాలు, పొందిన అనుభవం; గోవా ఆకాశవాణి అనుభవం; ఆకాశవాణి లో శిక్షణా కార్యక్రమాలు – వీటన్నిటి ద్వారా నేను పొందిన అవగాహన, జ్ఞానం, దృక్పథం నేను ఏమి చేయాలో సూచించాయి.
మన విజయవాడ
అంతకు మించి మళ్ళీ (అప్పటి) నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కొంత అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించాను. తెలకపల్లి రవి విజయవాడ సంబంధించి వారి దినపత్రిక సంస్థ ప్రచురణ ఒకటి ‘మన విజయవాడ’ ఇచ్చినట్టు, దాన్ని బాగా పరిశీలించినట్టు నాకు గుర్తు. ఇప్పుడా పుస్తకం 2003లో కడప సి.పి. బ్రౌన్ లైబ్రరీకి పంపిన పుస్తకాలలో ఉండి ఉంటుంది!
Also read: హేమావతి… రత్నగిరి… సేద్యపు సుద్దులు
ఇదివరకే అనుకున్నట్టు ఐదు నిమిషాల సమాచారం ఇంకా ఒక అంశం మీద పది పన్నెండు నిమిషాల ప్రసంగాలు, ఇంకా ఇరవై నిమిషాల ఇంటర్వ్యూలు (వారానికి ఒకటి చొప్పున) ఉండేలా ప్రణాళిక చేశాను. చరిత్ర, సామాజిక అంశాలు, సైన్స్, పర్యావరణం, సైకాలజి, ఫిలాసఫి సంబంధించిన వర్తమాన అవసరాలకు తగిన కోణంలో యోగ్యులైన ప్రసంగకర్తలతో రూపొందించడం ప్రారంభించాను.
మేధావుల సంఖ్య తక్కువ
ఆకాశవాణిలో ఈ ఎనిమిదిన్నర దశాబ్దాల కాలంలో ఉద్యోగులుగా వివిధ హోదాల్లో ఎంతోమంది కళాకారులు, మేధావులు, కవులు, రచయితలు పని చేశారు. కానీ వారి సంఖ్య కార్యక్రమాలకు సంబంధించి పనిచేసిన వారి మొత్తం సంఖ్యతో చూస్తే అది గణనీయం కాదు. అలాగే నేను పనిచేసిన ప్రతి కేంద్రంలో రచయితలు, మేధావులున్నారు. కానీ వారి సంఖ్య మరీ ఎక్కువ కాదు. ఈ ప్రస్తావన ఎందుకంటే – ఇంతకు ముందు పేర్కొన్న అంశాలన్నింటి గురించి ఒక మోస్తరు అవగాహన ఉన్న ఇంకా రేడియో కార్యక్రమ సృజనాత్మకత గల సహోద్యోగులు తక్కువమంది అనే చెప్పుకోవాలి. మనకు పరిష్కారం అవసరమైనప్పుడు, ఉపాయం కావాలన్నప్పుడు అలాంటి వ్యక్తులు మన కార్యాలయంలో ఉంటే కలిగే తృప్తి వేరుగా ఉంటుంది!
ఉదయరేఖలు కార్యక్రమం సంబంధించి తక్షణ అవసరం కోసం నాకు బాగా దోహదపడింది – విజయవాడలో అప్పుడు పనిచేస్తున్న ‘సుమన్’గారు. అది ఆయన కలం పేరు కానీ అసలు పేరు పొట్లూరి వెంకటేశ్వరరావు (1945 మార్చి 21–1997 మే 25). విషాదం ఏమిటంటే సర్వీసులో ఉండగానే వారు కన్నుమూయడం. వారి ఊరు కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర జమ్మిగొల్లేపల్లి. ఆయనే నాకు ఇమ్మిడియేట్ బాస్ కూడా! నా సీటు దగ్గరికి వచ్చి పలకరించే సహృదయుడు. ఇంకా, నేను రచయిత అన్న విషయం కూడా తెలిసిన వ్యక్తి.
Also read: ఉత్సవాలవెల్లువగా ఆకాశవాణి ఉద్యోగపథం!
ధారావాహిక ప్రసంగాలు
ప్రతిరోజూ అరగంట పాటు నడిచే కార్యక్రమంలో ధారావాహిక ప్రసంగాలు (నాలుగు, ఆరు, ఎనిమిది ఇలా పదమూడు గరిష్ఠం) కొన్ని రోజులుంటే బావుంటుందని లోతయిన చర్చ తర్వాత నిర్ణయించుకున్నాం! ప్రసంగకర్త ఒకరే కావచ్చు లేదా పలువురు కావచ్చు సందర్భం బట్టి.
ఒక కీకారణ్యంలోకి వెళ్ళక తప్పని స్థాయిలో తొలుత ఒక దారిని చూసుకునే పరిస్థితి వంటిది నా స్థితి! అటువంటి సమయంలో దోహదపడినవారు సుమన్. చాలామంది ఉండవచ్చు, అయితే మనకు మేధో స్థాయి అవసరం మనకు కలగకపోవచ్చు. కనుక సందర్భాలు కూడా ముఖ్యమే! కదంబ కార్యక్రమం అనే కాన్సెప్ట్ తో మరింతగా మద్రాసు లో కృషి చేయడానికి పునాది విజయవాడలో పడింది.
Also read: బదిలీ బాదరాయణంలో జీవనమాధుర్యం!
డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్: 9440732392