7. వారణమ్ ఆయిరమ్ (గజ సహస్రం)
వాయ్ నల్లార్ నల్ల మారై ఓది మందిరత్తాల్
పాశిలై నాణల్ పడుత్త ప్పరిది వైత్తు
కాయ్ శిన మాగిళురు అన్నాన్ ఎన్ కైప్పట్రి
తీవలమ్ శెయ్య క్కనా క్కండేన్ తోళీ నాన్
ప్రతిపదార్థములు
వాయ్ నల్లార్ = శ్రవణపేయముగా ఉచ్ఛరించగల వారు, సుస్వరంగా వేదపఠనము చేయగల ఘనాపాటీలు, నల్ల మఱై ఓది = పరమపావనములయిన వేదవాక్యములను పఠిస్తూ, మందిరత్తాల్ = సందర్భోచితముగా క్రియకు తగిన మంత్రములను పఠిస్తూ, పాశు ఇలై నాణల్ = పచ్చని ఆకులు కలిగిన శోభస్కరమైన దర్భలతను, పడుత్త = అగ్నికి చట్టూ పరిచి, ప్పరిది వైత్తు = సమిధలనుంచి, కాయ్ శినమ్ మాకళిఱు అన్నాన్ = అత్యధిక పౌరుషముకలిగి, మందించిన ఏనుగువంటి వాడైన మనోహర మూర్తి, శ్రీకృష్ణుడు, ఎన్ కై ప్పట్రి = నా చేయిపట్టుకొని, తీవలమ్ శెయ్య = అగ్నికి ప్రదక్షిణము చేసివచ్చినట్లు, క్కనా క్కండేన్ తోళీనాన్ = నేను కలగన్నానే చెలీ.
Also read: గోదా వధువు చేయి పట్టిన గోపాలుడు
తెలుగు పద్యం
దివ్యవేద మంత్రంబులనుచ్ఛైస్వరంబులన్ బాడు విప్రోత్తములు
శ్రావ్యమంగళతూర్యరావముల్, దర్భ తోరణముల మద్యమున
భవ్య ఘన మత్తగజగమన శ్రీకృష్ణుండు హోమాగ్నిసప్తపదికై
నవ్యవధువును నాదు కరగ్రహణముజేసినట్లు నే కలగంటినే చెలీ .
వివాహ ప్రక్రియలో అగ్ని కార్యము ప్రధానమైనది. శ్రావ్యములైన కంఠ స్వరములు కలిగిన వేదపండితులు, ఘనాపాఠి బ్రహ్మవేత్తలు శ్లాఘనీయములైన వేదవాక్యములను పారాయణము చేస్తూ, ఆయా కల్యాణ ప్రక్రియలకు తగిన వేద మన్త్రములను ఉచ్ఛైస్వరముతో పఠిస్తూ ఉండగా, పచ్చని మామిడి ఆకులు,తమలపాకులు, పవిత్రమైన దర్భలు, బాగా ఎండిన మొక్కలు సమిధలు చుట్టూ పరిచిన హోమకుండములో ప్రజ్వరిల్లుతున్న అగ్నికి నమస్కరిస్తూ, రాజస ముఖవర్చస్సుతో మత్త గజ గంభీరగమనముతో శ్రీరంగనాథుడు గోదాదేవి కరకమలాన్ని తన హస్తకమలముతో పట్టుకుని ప్రదక్షిణ చేస్తున్నాడట.
Also read: మధురాధిపతేరఖిలం మధురం
Also read: గోదారంగనాథ కల్యాణ కంకణ ధారణ