Sunday, December 22, 2024

సెతల్వాడ్ కు బెయిలు, జస్టిస్ లలిత్ వ్యాఖ్యలకు స్వాగతం

దేశంలో న్యాయం, ధర్మం కొనఊపిరితోనైనా బతికే ఉన్నాయనడానికి సాక్ష్యం శుక్రవారంనాడు కొత్త ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్ కు తాత్కాలిక బెయిలు మంజూరు చేయడం. తీస్తా సెతల్వాడ్ గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బాధితులకు న్యాయస్థానాలలో న్యాయం లభించే విధంగా కృషి చేస్తూ వస్తున్నారు. నరేంద్రమోదీ, అమిత్ షాలు ఎనిమిదేళ్ళుగా ఈ దేశానికి ప్రధానిగా, దేశీయాంగమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంతటి బలమైన నాయకుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా గుజరాత్ కోర్టులలో, సుప్రీంకోర్టులో న్యాయంకోసం పోరాడటం అన్నది ధీరోదాత్తమైన చర్య. అధినాయకులను ఇరికించడం ఉద్దేశం కాదు. వాస్తవాలను వెలుగులోకి తేవడం పటిషనర్ల పరమావధి.

ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. గుజరాత్ అల్లర్లపైన ప్రభుత్వం నియమించిన ప్రత్యేక పరిశోధన బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్  – సిట్) సమర్పించిన నివేదికను ఆమోదించింది. మోదీకి కానీ ఇతర రాజకీయ నాయకులకు కానీ అల్లర్లలో ఎటువంటి పాత్రా లేదని స్పష్టం చేసింది. అంతటితో ఊరుకుంటే పెద్దగా గొడవ ఉండేది కాదు. ఈ కేసును ఇంతదూరం తీసుకువచ్చిన హక్కుల కార్యకర్తలను ప్రత్యక్షంగానే తప్పుపట్టింది. న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సీటీ రవికుమార్ లతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు పోలీసులను పురికొలిపే మాదిరిగా ఉన్నాయి. తమ రహస్య లక్ష్యాలకోసం (హక్కుల కార్యకర్తలు) కుండను మరిగేటట్టు ఉంచారంటూ బెంచి వ్యాఖ్యానించింది. ‘‘వారిపైన చట్టప్రకారం తీసుకోదగిన చర్యలు తీసుకోవాలి’’ అని కూడా అంది. అసలే గుజరాత్ ప్రభుత్వం, అందులోనూ పోలీసులు. సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలతో పోలీసులు రెచ్చిపోయారు. వెంటనే బయలుదేరి ముంబయ్ వెళ్ళి సెతల్వాడ్ ను అరెస్టు చేసి గుజరాత్ కు తీసుకొని వచ్చారు.

సెతల్వాడ్ బెయిలు కోసం గుజరాత్ హైకోర్టులో దరఖాస్తు పెట్టుకున్నారు. ఆమె పిటిషన్ పైన స్పందిస్తూ కోర్టు పోలీసులకు నోటీసు జారీ చేసింది. ఆరు వారాల తర్వాత సమాధానం పంపమంది. ఎంత జాప్యం? ఎంత అలసత్వం? ఒక మహిళను గుజరాత్ పోలీసులు రెండు మాసాలుగా నిర్బంధంలో ఉంచారు. ఏడు రోజులపాటు పోలీసులు ఆమెను ప్రశ్నించారు. గుజరాత్ హైకోర్టు ఏ మాత్రం తొందరలేకుండా నింపాదిగా వ్యవహరించింది. విధిలేక సెతల్వాడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్ ఉన్నారు. ఆయన గుజరాత్ హైకోర్టును కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు. 1. మీరు మామూలుగా ఏ కేసులోనైనా పోలీసులకు నోటీసులు ఇచ్చి ఆరు వారాల తర్వాతనే సమాధానం పంపమని అంటారా? 2. రెండు నెలలు సెతల్వాడ్ నిర్బంధంలో ఉన్నప్పటికీ చార్జిషీటు ఎందుకు దాఖలు చేయలేదు. 3. ఒక మహిళను నిర్బంధించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆమెను నెలల తరబడి నిర్బంధించవలసిన అవసరం ఉన్నదా? ఈ ప్రశ్నలే కాకుండా సెతల్వాడ్ తరఫున వాదించిన కపిల్ శిబ్బల్ కూడా మరో ప్రశ్న సంధించారు. ఎఫ్ఐఆర్ లో ఆమె కొన్ని పత్రాలు ఫోర్టరీ చేశారని ఆరోపించారు. ఏ పత్రాలు ఫోర్జరీ చేశారో ఎందుకు పేర్కొనలేదు?

జస్టిస్ ఖాన్విల్కర్ నాయకత్వంలోని బెంచి చేసిన వ్యాఖ్యలు పోలీసులను ప్రేరేపించాయి. గుజరాత్ హైకోర్టు వైఖరి వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. సెతల్వాడ్ ను అరెస్టు చేయడంతో పాటు రిటైరై విశ్వాంతి తీసుకుంటున్న మాజీ పోలీసు అధికారి ఆర్. బి. శ్రీకుమార్ ని కూడా అరెస్టు చేశారు. మరో పోలీసు అధికారి సంజీవ్ భట్ అప్పటికే జైలులో మగ్గుతున్నారు. అధికారంలో ఉన్నవారికి వెరవకుండా తమ విధులను నిర్వర్తించడమే ఈ అధికారులు చేసిన నేరం. అహ్మదాబాద్ గుల్బర్గ్ సొసైటీలో అల్లరి మూక దాడి చేసి జాకియా భర్త, మాజీ ఎంపి ఎహసాన్ జాఫ్రీని, మరెంతో మందిని నరికి చంపారు. భర్తను కోల్పోయిన జాకియాకూ, అదే విధంగా బాధితులైన మరికొందరికి అండగా నిలబడటం, కోర్టులో కేసులు కొట్లాడేందుకు వారికి బాసటగా ఉండటం సెతల్వాడ్ చేసిన అపరాధం.

గురువారంనాడు గుజరాత్ హైకోర్టును నిశితంగా ప్రశ్నించి, శుక్రవారంనాడు సెతల్వాడ్ కు తాత్కాలిక బెయిలు మంజూరు చేసిన జస్టిస్ లలిత్ నాయకత్వంలోని సుప్రీం ధర్మాసనం చివరికి ఈ కేసును తిరిగి గుజరాత్ హైకోర్టుకే అప్పగించింది. అక్కడే విచారణ స్వంతంత్రంగా జరగాలనీ, తన వ్యాఖ్యాల ప్రభావం లేకుండా స్వేచ్ఛగా ఒక నిర్ణయానికి రావాలని హైకోర్టుకు జస్టిస్ లలిత్ సూచించారు. ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యానాలను గుజరాత్ న్యాయమూర్తులు పట్టించుకుంటారో లేదో కొంత వ్యవధి తర్వాత కానీ తెలియదు. అభియోగపత్రం దాఖలు చేయకపోవడానికి సెతల్వాడ్ ను ఉపా (అన్ లాఫుల్ యాక్టివిటీస్ – ప్రివెన్షన్ – యాక్ట్) కింద అరెస్టు చేయలేదని కూడా జస్టిస్ లలిత్ గుజరాత్ హైకోర్టుకూ, గుజరాత్ పోలీసులకూ చురక అంటించారు. సెతల్వాడ్ విషయంలోనే పోలీసులకు జారీ చేసిన నోటీసులకు జవాబివ్వడానికి ఆరువారాల వ్యవధి మంజూరు చేశారు. ఇతర కేసులలో గుజరాత్ హైకోర్టు ఈ విధంగా వ్యవహరించలేదన్నది స్పష్టం. అందుకే గుజరాత్ హైకోర్టు నిర్ణయాలను అనుమానంగా చూడవలసి వస్తున్నది. కానీ బెయిలు పిటిషన్ పై విచారణ జరపవలసిందిగా హైకోర్టు కనుక సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టునే పురమాయించింది. మొత్తంమీద జస్టిస్ లలిత్ నాయకత్వంలోని ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వు మరో సుప్రీం ధార్మాసనంలో న్యాయమూర్తులకూ, గుజరాత్ హైకోర్టుకూ, గుజరాత్ ప్రభుత్వానికీ, గుజరాత్ పోలీసులకూ ఒక సందేశాత్మకమైన సంకేతం.

ఈ మధ్య హక్కుల కోసం, వ్యక్తి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి విజయాలు సాధించే వాతావరణం సుప్రీంకోర్టులో లేదు. వ్యక్తిగత స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు సంబంధించిన కేసులను సుప్రీంకోర్టులో గత నలుగురు న్యాయమూర్తుల హయాంలో విచారంచలేదు. దేశ ప్రజలను వేధిస్తున్న ఆరు ప్రధానమైన కేసులు విచారణకు నోచుకోలేదు. ఇటువంటి వాతావరణంలో జస్టిస్ లలిత్ ఆధ్వర్యంలోని ధార్మాసనం సెతల్వాడ్ కు బెయిలు మంజూరు చేయాలని నిర్ణయంచడం న్యాయవ్యవస్థపైన జనబాహుళ్యం విశ్వాసం తిరిగి పాదుకోల్పడానికి దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles