అందమైన రూపం, వాచకం, హృదయం
కొప్పరపు కవులంటే మహాఇష్టం
ఎన్టీఆర్ కి క్లాస్ మేట్, బెంచ్ మేట్
నోబెల్, జ్ఞానపీఠ్ పురస్కారాలలో ప్రస్తావన
అవార్డులకు అతీతుడు
మాశర్మ
(జర్నలిస్ట్, కాలమిస్ట్)
శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారు. ఇంత అందమైన కవి ఈ మధ్యకాలంలో ఎవ్వరూ లేరు. ఒకే ఒక్కసారి వారితో రెండు గంటలపాటు గడిపే భాగ్యం నాకు దక్కింది. వీరిని కలిసి పుష్కరం దాటింది. జాన్ బాగ్ (జ్ఞాన్ బాగ్?) ప్యాలెస్ కు వెళ్లి కలిశాను. అంతకు ముందు ఉత్తరం రాశాను. నాకు రిప్లై ఇలా ఇచ్చారు ” పద్య కవితావేశంలో నన్ను చాలా ప్రభావితం చేసినవారు కొప్పరపు సోదరకవులు. వారి పద్యాలు కొన్ని వందలు నా నోటికి వచ్చు”. ఈ ప్రత్యుత్తరం తర్వాత నేను హైదరాబాద్ పనిమీద వెళ్ళినప్పుడు కలిశాను. జాన్ బాగ్ ప్యాలెస్ అంటే? ముత్యాల ముగ్గు సినిమా షూటింగ్ అక్కడే జరిగింది. నేను కలిసే సమయానికే వారి ఆరోగ్యం బాగా దెబ్బతిని వుంది. అది 2005/2006అనుకుంటాను. అప్పుడు వీల్ చైర్ లో కూర్చొని వున్నారు. వారి సతీమణి ఇందిరాదేవి కూడా ఉన్నారు. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. నాతో పాటు నా మిత్రుడు, గాయకుడు మోహన్ దాస్ ను కూడా తీసుకెళ్ళాను. ప్రారంభంలో కొంచెంసేపు కొప్పరపు కవుల గురించి మాట్లాడుకున్నాము. మోహన్ దాస్ తోటి జయదేవుని అష్టపదులు పాడించాను. దంపతులిద్దరూ ముగ్ధులయ్యారు. మోహన్ దాస్ (విజయనగరం) ఘంటసాల పాటలు బాగా పాడతాడు. మోహన్ దాస్ పాడుతూవుంటే, శేషేంద్రశర్మగారు ఇందిరాదేవిగారికి ఇంగ్లీష్ లో వ్యాఖ్యానం చేస్తూ వివరించారు. ఆమె మంచి కాఫీ ఇచ్చారు. శర్మగారు మమ్మల్ని వెంటపెట్టుకొని ఇల్లంతా చూపించారు. వారు, మేము మొదట్లో కూర్చున్న హల్ లో ఒక ఫోటో ఉంది. అది నన్ను అమితంగా ఆకర్షించింది. అందులో ఎన్టీఆర్, శేషేంద్రశర్మగారు ఉన్నారు. ఎన్టీఆర్ స్వచ్ఛంగా చిన్నపిల్లవాడిలా నవ్వుతూ అత్యంత వాత్సల్యంగా శేషేంద్రశర్మగారి వైపు చూస్తున్నారు. అందులో ఒక చెప్పలేని ఆప్యాయత కనిపిస్తోంది. మీరంటే ఎన్టీఆర్ కు ఇష్టమా? అని అడిగాను. ఇష్టం కాదు ప్రాణం అని శర్మగారు సమాధానం చెప్పారు. ఇంకా ఇలా చెప్పారు… మేమిద్దరం గుంటూరు ఏసీ కాలేజీలో క్లాస్ మేట్స్, బెంచ్ మేట్స్ మని చెప్పారు. నేను షాక్ తిన్నాను. వారిద్దరి బంధం మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది. కొంచెంసేపు చర్చ ఎన్టీఆర్ పై వెళ్ళింది. రామారావు గొప్ప స్నేహితుడు అని ముగించారు. స్వదస్తూరితో సంతకం పెట్టి ఆధునిక మహాభారతం మొదలైన పుస్తకాలు నాకు ఇచ్చారు. కొప్పరపు కవుల పురస్కారం ఇవ్వాలనుకున్నాను. వారి ఆరోగ్య పరిస్థితి చూసి, ఆయన్ను physical గా ఇబ్బంది పెట్టకూడదని విరమించుకున్నాను. నాకు ఇది ఒక తీరని వెలితి. ఆరోగ్యం దెబ్బతిని, అప్పటికే సుమారు 80ఏళ్ళ ప్రాయంలోకి వచ్చినా, ముఖంలో ఆ తేజస్సు,హృదయంలో రసాత్మకత ఏమాత్రం తగ్గలేదు. మీ ఇంటిపేరు గుంటూరు అని ఉంది కదా? మీకు గుంటూరుకు ఉన్న సంబంధం ఏమిటి? అని వారిని అడిగాను. మా పూర్వీకులు గుంటూరు ప్రాంతానికి వలస వచ్చారు, అని చెబుతూ… ఒక ఝలక్ ఇచ్చారు. మేము అసలు తెలుగువాళ్ళం కాదు. కశ్మీర్ పండితులము. అక్కడి నుండి ఈ తెలుగు ప్రాంతాలకు ఎప్పుడో వచ్చాము అని, వారి మూలలను వివరించారు. అందుకేనేమో? కశ్మీర్ యాపిల్ లాగా ఇంత అందంగా, మేలిమిబంగారు ఛాయతో బ్రహ్మ వచ్ఛస్సుతో రాకుమారుడులా ఉన్నారని మనసులో అనుకున్నాను.ఆయనతో కూడా అన్నాను.ఆయన పెద్దగా నవ్వారు. కొన్నాళ్ళకు ఆయన వెళ్లిపోయారు. ఆ తీపి గురుతులు, ఆ మర్యాద, ఆ ఆప్యాయత, ఆ కవితా రసహృదయం, ఆ అద్భుతమైన రూపం పచ్చగా గుండెగొంతుల్లో దాగివున్నాయి. సాహిత్యానికి నోబెల్ నామినేషన్ వరకూ వీరి ఖ్యాతి ప్రాకింది. అది రూపు దాల్చుకోలేదు. జ్ఞాన్ పీఠ్ పురస్కారం కూడా పలుమార్లు వినిపించింది. కానీ వరించలేదు. ఆ సరస్వతీ వర పుత్రునికి లౌకికమైన ఈ పురస్కారాలు కొలబద్ద కానే కాదు. బహుభాషా కోవిదుడు, బహు కవితారూపుడు, ప్రతిభా సరస్వతి గుంటూరు శేషేంద్రశర్మగారికి తెలుగునేలపైనే కాదు, భారతదేశంలో, ప్రపంచంలో చాలా ఖ్యాతి వుంది. ఆ కీర్తి మచ్చలేనిది. నోబెల్ సాహిత్య పురస్కారాలు తాజ ాగా ప్రకటించిన సందర్భంలో పుంభావ భారతి గుంటూరు శేషేంద్రశర్మగారు గుర్తుకు వచ్చారు. ఆ మహనీయుడు కీర్తికాయుడు. ఆ దివ్య భవ్య స్మృతికి నీరాజనాలు పలుకుతున్నాను.
iDI PACHICHI PADUVUVRUTTHI / TAARPUDU RAATA .
HE IS / OUR FAMILY IS FROM NELLORE DISTRICT / tHOTAPALLI GUDUR VILLAGE . THESE DETAILS ARE AVAILABLE EVERY WHERE.