- క్రికెట్ ఆస్ట్ర్రేలియాకు డాలర్ల పంట
- బీసీసీఐకి క్రికెట్ ఆస్ట్ర్రేలియా థాంక్స్
కరోనాతో కకావికలమైన ప్రపంచ క్రికెట్ కు భారత్-ఆస్ట్ర్రేలియాజట్ల సిరీస్ కొత్తఊపిరి పోసింది. కొద్దిమాసాలపాటు క్రికెట్ కార్యకలాపాలు స్తంభించిపోడంతో ఆర్ధికంగా డీలా పడిన ఆస్ట్ర్రేలియా క్రికెట్ బోర్డుకు భారతజట్టు రెండుమాసాల పర్యటన డాలర్ల వర్షం కురిపించింది. గల్ఫ్ దేశాలు వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు ముగిసిన వెంటనే ఆస్ట్ర్రేలియా పర్యటనకు వెళ్లిన భారతజట్టు మూడుమ్యాచ్ ల వన్డే, మూడుమ్యాచ్ ల టీ-20సిరీస్ లతో పాటు…నాలుగుమ్యాచ్ లో ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ సిరీస్ లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చింది.
వన్డే సిరీస్ లో ఓటమి పొందిన భారత్ టీ-20 సిరీస్ తో పాటు…టెస్ట్ సిరీస్ లో సంచలన విజయం సాధించింది. అడిలైడ్ ఓవల్, మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ స్టేడియాలలో..బయోబబుల్ వాతావరణంలో నిర్వహించిన ఈ మ్యాచ్ లకు పరిమిత సంఖ్యలోనే అభిమానులను అనుమతించారు. వన్డే, టీ-20 సిరీస్ లను మించి టెస్టు సిరీస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరించడంతో వివిధ రూపాలలో క్రికెట్ ఆస్ట్ర్రేలియాకు 300 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది.
ఇది చదవండి: భారత క్రికెటర్లకు బీసీసీఐ బోనస్
కేవలం భారత క్రికెట్ బోర్డు సహకారం, భారత క్రికెటర్ల త్యాగం, ఓర్పు, ప్రతిభ కారణంగానే సిరీస్ సూపర్ హిట్ గా నిలిచిందని క్రికెట్ ఆస్ట్ర్రేలియా ప్రతినిధులు ఓ లేఖ ద్వారా వివరించారు. భారత క్రికెట్ బోర్డుకు తమ కృతజ్ఞతలను ఓ లేఖ ద్వారా తెలిపారు. కష్టం కాలంలో బీసీసీఐ తమకు అండగా నిలిచిందని, ఆర్థికంగా తాము లాభపడ్డామని, ఎంతగానో రుణపడి ఉంటామని సీఏ తాత్కాలిక సీఈవో నిక్ హాక్లే, అధ్యక్షుడు ఎర్ల్ ఎడ్డింగ్స్ ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాపించిన నేపథ్యంలో తాము క్రికెట్ సిరీస్ లు నిర్వహించడం, విజయవంతం కావడం సంతృప్తినిచ్చిందని, కరోనా నిబంధనల కారణంగా ఎదురైన సవాళ్లు, క్వారెంటెయిన్ నిబంధనలు పాటించడంలో భారతజట్టు సభ్యుల సహకారం మరువలేనిదని కొనియాడారు.
స్టీవ్ స్మిత్, అజింక్యా రహానే బ్యాటింగ్, కమిన్స్, బుమ్రా బౌలింగ్, శుభ్ మన్ గిల్, కామెరూన్ గ్రీన్ లాంటి పలువురు యువఆటగాళ్ల టెస్టు అరంగేట్రం, భారతజట్టు అసాధారణ పోరాటం క్రికెట్ చరిత్రలో మధుర ఘట్టాలుగా నిలిచిపోతాయని క్రికెట్ ఆస్ట్ర్రేలియా గుర్తు చేసుకొంది.
ఇది చదవండి: ఇంగ్లండ్ తో సిరీస్ కు కొహ్లీ, పాండ్యా, ఇశాంత్