- ప్రజాప్రభుత్వం ఏర్పడిందంటున్నారు
- కార్యాచరణలో అది నిరూపించాలి
- సంక్షేమ పథకాలను పునస్సమీక్షించవచ్చు
- శక్తికి మించిన భారం తలకెత్తుకోకూడదు
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. 11మంది మంత్రులతో కొత్త మంత్రిమండలి కూడా ఏర్పాటైంది. ఈ మహోత్సవం ఘనంగా జరిగింది. అధిష్టానం అధినేతలు అందరూ వచ్చి ఈ ఆనందంలో భాగాన్ని పంచుకున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక ముగ్గురూ తరలి రావడం విశేషం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, తదితర కాంగ్రెస్ నేతలు వేడుకలో పాల్గొనడం సహజమే అయినా, ఇందరి రాకతో వేదికకు శోభ మరింత ప్రభాసమానమైంది. ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసినా, ఎన్నో త్యాగాలు జరిగినా, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి వుండేది కాదు. అందులో సోనియాగాంధీ పాత్ర అత్యంత కీలకం. రాష్ట్ర విభజన వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ చెల్లించుకున్న మూల్యం అంతా ఇంతా కాదు. తెలంగాణలో కాస్త ఉనికిని కాపాడుకున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో సోదిలో లేకుండా పోయింది. రెండు రాష్ట్రాల్లో అధికారానికి ఆమడదూరంగా వెళ్లిపోయింది. తెలంగాణ రాష్ట్రం వస్తే, టీ ఆర్ ఎస్ ను విలీనం చేస్తానని చెప్పిన కెసీఆర్, యూ టర్న్ తీసుకున్నారు. తమ ఉద్యమ సంస్థనే రాజకీయ పార్టీగా మలిచి, ఎన్నికల్లో గెలిచి, కాంగ్రెస్ ను గేలిచేశారు. కెసిఆర్ కొట్టిన ఈ దెబ్బకు కాంగ్రెస్ కు దిమ్మ తిరిగింది. తెలంగాణ సెంటిమెంట్ కెసిఆర్ కు ఎంతో ఉపయోగపడినా, కాంగ్రెస్ కు కనీస వాటా కూడా దక్కలేదు. 2014,2018 రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిల పడింది. తెలంగాణ ఇచ్చింది నేనే అని సోనియాగాంధీ స్వయంగా చెప్పినా, తెలంగాణ తల్లి సోనియా అని పార్టీ శ్రేణులు అరచి మాట్లాడినా ఓటర్లు పట్టించుకోలేదు. అధికారానికి, ఆనందానికి రెండింటికీ కాంగ్రెస్ దూరమైంది.
ఇన్నేళ్ళకు కాంగ్రెస్ చేతికి అధికారం
మళ్ళీ ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు తెలుగురాష్ట్రంలో అధికార పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నిన్నటి ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలై,కోల్పోయిన ఆనందాన్ని ఇక్కడ వెతుక్కుంది. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు నిజమైన ఆనందం ఈరోజు దక్కింది. పార్టీ పరంగా, గాంధీ కుటుంబపరంగా తెలంగాణ గెలుపు గొప్ప గెలుపు, గొప్ప మలుపు. ఈ గెలుపునకు అనేక అంశాలు సహకరించినా, రేవంత్ రెడ్డి వాటా పెద్దది. కష్టకాలంలో, క్లిష్ట సమయంలో పార్టీకి కిక్కునిచ్చిన క్రెడిట్ రేవంత్ కే దక్కుతుంది. ఆ విధంగా,గాంధీ కుటుంబం హృదయాన్ని రేవంత్ టోకుగా గెలుచుకున్నారు. ఆ అభిమానంతోనే ముగ్గురు గాంధీలు భాగ్యనగరానికి తరలి వచ్చారు. తన్మయులైనారు. రేవంత్ రెడ్డి కూడా సభా ముఖంగా, హృదయపూర్వకంగా తన కృతజ్ఞతను చాటుకున్నారు. కెసిఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి పాలన నేటి నుంచి మొదలైనట్లే. కెసిఆర్ కట్టుకున్న ప్రగతి భవనాన్ని ప్రజాభవన్ గా మారుస్తానని ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే రేవంత్ రెట్టింపు ఉత్సాహంతో ప్రజా బాహుళ్యానికి మాట యిచ్చారు. మాట తప్పకుండా కార్యాచరణ మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారం కంటే ముందుగానే ప్రగతి భవన్ చుట్టూ వున్న కంచెలను తెంచేశారు. సామాన్యుల రాకపోకలకు అవరోధాలు తొలగించేశారు.
పీఠం ఎక్కగానే ప్రజాదర్బార్
పీఠం ఎక్కిన మరునాడే ప్రగతి భవనంలో ప్రజాదర్బార్ కు శ్రీకారం చుట్టారు. ప్రజలపై ఇక ఆంక్షలు ఉండవు, ఆకాంక్షలు తీరుతాయి అంటూ తెలంగాణ ప్రజకు రేవంత్ మొదటి భరోసా ఇచ్చారు. నియంత్రత్వం ఉండదు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వెల్లివిరుస్తాయి అంటూ హామీ ఇచ్చారు. “ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో ఇక అంతటా సమానాభివృద్ధి సాధ్యం.మేం పాలకులం కాదు, మీ సేవకులం. సంక్షేమం,అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాను” అంటూ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ తన తొలి ప్రసంగం ద్వారా ప్రజలలో విశ్వాసం, మేధావులలో గౌరవం పెంచుకొనే ప్రయత్నం చేశారు. మంచిదే. నిజంగా అవన్నీ ఆచరిస్తే, అంతకంటే కావాల్సిందేముంది? అభివృద్ధి గురించి పెద్దగా అలోచించక్కర్లేదు కానీ, సంక్షేమం తెల్ల ఏనుగు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఆకాశమంత ఎత్తులో వున్నాయి. అవి అందుకోవడం, అందుకొని నిలబడడం ఆషామాషీ కాదు. భాగ్యనగరాన్ని భాగ్యనగరంగానే ఉంచాలంటే చాలా చాలా అలోచించి ముందుకు వెళ్ళాలి. ఆచరణ యోగ్యం కాని పథకాలను ఉపసంహరించుకున్నా తప్పు లేదు. ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందో ప్రజలకు వివరిస్తే అర్ధం చేసుకుంటారు. రాష్ట్రంపై గుదిబండలు పెంచకుండా చూడాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిదే.
ఉద్యమాలు, త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అన్నది జగద్విదితం. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తానని అనడం మంచిమాట. ప్రొఫెసర్ కోదండరామ్ వంటి సచ్ఛీలురను, ఉద్యమ మహానిర్మాతలను గుర్తుపెట్టుకొని, గౌరవించి, పక్కన పెట్టుకోవడం మంచిపని. తెలంగాణ ఆత్మ తెలిసిన, నిజాయితీపరులైన మేధావులు, జర్నలిస్టులు చాలామంది సమాజంలో వున్నారు. సుపరిపాలన అందించడంలో వారి సేవలను, జ్ఞానసంపదను భాగస్వామ్యం చేసి, సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది.
రెండు దస్త్రాలపై సతకం
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రెండు దస్త్రాలపై రేవంత్ సంతకం చేశారు. నిన్నటి ఎన్నికల్లో ఎంతో ఆకర్షణగా నిలిచిన ఆరు గ్యారంటీలపై తొలి సంతకం, దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇస్తూ మలి సంతకం చేసి, మాట నిలబెట్టుకున్నారు. రజనీకి అండగా నిలవడం ముదావహం. ఆరు గ్యారెంటీల అమలు యథాతధంగా ఆచరించడం జరిగేపని కాదు. దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కొన్ని మార్పులు, సవరణలతో ముందుకు వెళ్లడమే క్షేమదాయకం. ఆ దిశగా ఆలోచిస్తారని అనుకోవచ్చు. ప్రమాణ స్వీకార అనంతరం ముఖ్యమంత్రి అధ్యక్షతలో సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం కూడా జరిగింది.ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ నుంచి రెండు గ్యారంటీలను అమలుచేయాలని నిర్ణయించినట్లు మీడియా ముఖంగా మంత్రి శ్రీథర్ బాబు ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10లక్షల వరకూ పెంపు హామీలు 9వ తేదీ నుంచి అమలుకానున్నాయని మంత్రి వెల్లడించారు. ఆ దిశగా క్యాబినెట్ ఆమోదం కూడా జరిగింది. తొలి క్యాబినెట్ సమావేశంలోనే, గత ప్రభుత్వ పాలనకు సంబంధించిన కొన్ని అంశాలపై సమీక్ష కూడా నిర్వహించారు.
శ్వేతపత్రాల విడుదల యోచన
కెసిఆర్ హయాంలో 2014 నుంచి 2023 వరకూ ఏ శాఖలో నిధులు ఎలా ఖర్చు పెట్టారు, వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంత వరకూ చేరువయ్యాయి అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అది మంచిదే. కాకపోతే, అందులో రాజకీయం కూడా వుంది. ఉండడం కూడా సహజం. మరి కొన్ని నెలల్లోనే లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, నిన్నటి దాకా అధికారంలో వుండి, నేడు ప్రధాన ప్రతిపక్షంగా మారిన బిఆర్ఎస్ ను ప్రజలముందు దోషిగా నిలబెట్టాలని, తద్వారా వారి ఓట్లకు గండి కొట్టాలనే ఆట మొదలైందని కూడా అర్ధం చేసుకోవచ్చు. ప్రోటెం స్పీకర్ ఎంపిక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఈ నెల 9వ తేదీన జరుగనున్నట్లు సమాచారం. ఇక మంత్రి వర్గం ఏర్పాటు ముచ్చటకొద్దాం. ముందుగా ఊహించిన అభ్యర్థులకే దాదాపుగా మంత్రి పదవులు లభించాయి. తొలి విడుతలో 11మందికి పదవీయోగం పట్టింది. ఇంకా నియమించడానికి అవకాశం వుంది.వ్యూహాత్మకంగా, దశలవారిగా ఆ నియామక ప్రక్రియ వుంటుందని అంచనా వెయ్యవచ్చు. రేపటి లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలను రాబట్టడంలో వారి వారి శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ముఖ్యమంత్రిపై ప్రధానంగా వుంటుంది. ఇక్కడ, రేవంత్ రెడ్డి తనేంటో నిరూపించుకోవడంపై అతని భవిష్యత్తు ఆధారపడి వుంటుంది.
ప్రజారాజ్యం అందించాలి
వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి వారు ప్రతి దశలో తమేంటో నిరూపించుకొని అధిష్టానం మార్కులు కొట్టేశారు. నేటి కేబినెట్ నిర్మాణం చాలా వరకూ సముచితంగానే జరిగింది. ముఖ్యమంత్రి కుర్చీపై ఆశలు పెట్టుకున్న భట్టి విక్రమార్కకు, ఉత్తమ కుమార్ రెడ్డికి మంత్రి పదవులను అందించడం కూడా తెలివైన పనే. భవిష్యత్తులో జరుగబోయే విస్తరణలో మరికొంతమందికి న్యాయం జరుగవచ్చు. మొత్తంగా చూస్తే, వీళ్లలో చాలామందికి చాలా ఏళ్ళ తర్వాత మంత్రి కిరీటాలు తలపైకి వచ్చాయి. అవి ముళ్లకిరీటాలుగా మారకూడదు.తలకు పొగరునుఎక్కించకూడదు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి చంద్రబాబునాయుడుకు ప్రత్యేక ఆహ్వానం అందినా, ఆయన ఎందుకో రాలేదు. సమీప కాలంలోనే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు వున్నవేళ, ఏ సమీకరణాలు వేసుకొన్నారో తెలియదు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు అనుచరుడని పెద్ద పేరున్న వేళ, బాబు గైరుహాజరుపై కొంత చర్చ అప్పుడే మొదలైంది. తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, ప్రజారాజ్యం అందిస్తారని అభిలషిద్దాం.
Also read: రేవంత రెడ్డికి పట్టం