సినియర్ జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు ఆదివారం అర్ధరాత్రి (జనవరి 10-11) మృతి చెందారు. ఆయన వయస్సు 87. బహుముఖ ప్రజ్ఞశాలి, పత్రికా రచయిత, కాలమిస్టు, ఉపన్యాసకుడు తుర్లపాటి తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఆయన భార్య కృష్ణకుమారి చాలా సంవత్సరాల కిందటే ఈ లోకం వీడి వెళ్ళారు. ఆమె ప్రఖ్యాతివహించిన నృత్యకారిణి. ఆయన 10 ఆగస్టు 1933 నాడు జన్మించారు. ఇద్దరు పిల్లలు. ప్రేమజ్యోతి, జవహర్ లాల్ నెహ్రూ.
ప్రకాశం కార్యదర్శి
కుటుంబరావు టంగుటూరి ప్రకాశం పంతులుకు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. ఆ సంగతి ఆయన సగర్వంగా చెప్పుకునేవారు. పాతతరం పాత్రికేయుడు. ఎన్ జి రంగా నిర్వహించిన ‘వాహిని’కి సహసంపాదకుడుగా, చలసాని రామారావు నిర్వహించిన ‘ప్రతిభ’కు సంపాదకుడుగా పని చేశారు. ప్రకాశం పంతులు నడిపిన ‘ప్రజాపత్రిక’లొ ఆంధ్రప్రాంత వార్తలు సంచాలకులుగా పని చేశారు. 1955 నుంచి డాక్టర్ చలపతిరావుతో కలిసి ప్రజాసేవ చేశారు. 1963లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేరారు. 1991 వరకూ ఆ పత్రికలోనే పని చేశారు. తర్వాత స్వేచ్చాయుతమైన (ఫ్రీలాన్స్ జర్నలిస్టు) పాత్రికేయులుగా కొనసాగారు. నార్లవెంకటేశ్వరావు, నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మతో కలిసి ఆంధ్రజ్యోతి సంపాదకవర్గంలో ప్రముఖులుగా చాలా సంవత్సరాలు పని చేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే ఉన్నారు. వ్యక్తిత్వ చిత్రణలో ఆయన సిద్ధహస్తులు. వార్తలలోని వ్యక్తి అనే పేరు తో ఒక శీర్షికను దీర్ఘకాలం నిర్వహించారు. ఈ శీర్షిక కింద సుమారు నాలుగు వేలమంది రాజకీయ నాయకుల, ఇతర రంగాల ప్రముఖుల జీవిత రేఖా చిత్రాలు రచించారు. వార్తలలో ఉన్న వ్యక్తుల పూర్వాపరాలనూ, వ్యక్తిత్వ విశేషాలనూ సులభగ్రాహ్యంగా రాయడం ఆయన ప్రత్యేకత. 2010లో ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ అధ్యక్షుడిగా పని చేశారు. 2002లో పద్మశ్రీ అవార్డు స్వీకరించారు.
తుర్లపాటికి ఉపన్యాస కేసరి అనే బిరుదు ఉంది. ఆయన వేయికి పైగా ఉపన్యాసాలు 1993 నాటికే చేశానని నాకు చెప్పారు. విజయవాడలో ఏ సినిమా, సాంస్కృతిక సభ జరిగినా ఆయన అధ్యక్షత వహించడమో, ముఖ్యఅతిధిగా పాల్గొనడమో ఆనవాయితీ. నేను ఆయనతో వేదిక పంచుకొని రెండు సంవత్సరాలు కూడా కాలేదు. దాదాపు రెండేళ్ళ కిందట విజయవాడలో మహానటి సావిత్రి జయంతి ఉత్సవాలలో నేను ముఖ్యఅతిధిని. ఆయన సభాధ్యక్షుడు. సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి, ఆమె భర్త, నా చిరకాల మిత్రుడు గోవిందరావు కూడా విజయవాడ వచ్చారు. తుర్లపాటి వేదికమీద అటూ ఇటూ పచార్లు చేస్తూ చూపుడి వేలితో తనను తాను చూపించుకుంటా, ‘ఐ యామ్ ఏ ఎయిటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ యంగ్ మ్యాన్‘ (నేను 85 ఏళ్ళ యువకుడిని) అంటూ ఎలుగెత్తి చాటారు. సభను రక్తికట్టించారు. ఆయనలో కనిపించిన చోదకశక్తి, మాటలలో పటుత్వం, వేషధారణలో రాజీపడని వైఖరి (సఫారీ) నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసేవి.
నేను వార్తలో సంపాదకుడుగా ఉన్న కాలంలో ఆయన కాలమ్ ‘వార్తలలో వ్యక్తి’ నిర్వహించేవారు. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రేమగా సంబోధిస్తూ ఉత్తరాలు రాసే అభినందించేవారు. అందరి గురించీ మృదుమధురంగా మట్లాడేవారు. సుప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వరావుకు సన్నిహితులు. అక్కినేనికీ, సినిమా హీరోలలో పలువురికీ బిరుదులు ఇచ్చింది తుర్లపాటివారే. అక్కినేని నాగేశ్వరరావుకకు 1957లో విజయవాడలో సన్మానం జరిగినప్పుడు నటసమ్రాట్ బిరుదు ఇచ్చిన వ్యక్తి తుర్లపాటి కుటుంబరావు.
సినిమా పట్ల ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. ‘జ్యోతిచిత్ర’కు సంపాదకులుగా కూడా పని చేశారు. నార్ల వెంకటేశ్వరరావు జీవన సాఫల్య పురస్కారం, సద్గురు శివానందమూర్తి ప్రతిభాపురస్కారం, ఇంటూరి, ఆదుర్తి సుబ్బారావుల పేరు మీద స్మారక పురస్కారం, ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ మొదలైన అనేక పురస్కారాలు పొందారు.
తొలి తెలుగు ప్రధాని పి. వి. నరసింహారావు అనే పేరుతో పుస్తకం రచించి, ప్రచురించి మాజీ ప్రదానికి అందజేశారు. ‘సంక్షిప్తంగా రాసినా సమగ్రంగా రాశారు,’ అంటూ పీవీ ప్రశంసించారని చెప్పారు. ‘నా కలం- నా గళం’ అనే పేరుతో 65 సంవత్సరాల పాత్రికేయ జీవితం పూర్తయిన సందర్భంగా ఆత్మకథ వెలువరించారు. లాల్ బహద్దూర్ శాస్త్రి మీద కూడా ఒక పుస్తకం రాశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో సినిమా శీర్షికను నిర్వహించడమే కాకుండా కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ వార్షికోత్సవాలలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
వెంకయ్య నాయుడు సంతాపం
తుర్లపాటి కుటుంబరావు మృతిపట్ల ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. ‘‘ కుటుంబరావు గారు స్వాతంత్ర్య సమరయోధులు. సంఘసేవకులు, ప్రముఖ పాత్రికేయులు. రచయిత. అద్భుతమైన వక్త. టంగుటూరి ప్రకాశం పంతులుగారికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి నాటి నుంచి ఏ రంగంలో అయినా ఉన్నత ప్రమాణాలు పాటించి ఆదర్శంగా నిలిచారు. ఈ మధ్య నేను విజయవాడ వచ్చిన సందర్భంగా ఇంత వయసులో కూడా నేను బసచేస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ కు వచ్చి నాతో అనేక విషయాలను ప్రస్తావించి ఉత్సాహంగా కనిపించారు. అంతలోనే వారు పరమపదించారనే వార్త వినవలసి రావడం విచారకరం. ఆయన చూపిన మంచి మార్గాన్ని, మంచి సంప్రదాయాన్ని కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ కుటుంబరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను,’’ అంటూ వెంకయ్య నాయుడు సంతాప సందేశం విడుదల చేశారు.