Thursday, November 7, 2024

సీనియర్ జర్నలిస్టు కె.ఎల్. రెడ్డి మృతి

హైదరాబాద్, నవంబర్ 3 : సీనియర్ జర్నలిస్టు కె. ఎల్. రెడ్డి గురువారం తెల్లవారుజామున వరంగల్లులో కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. నల్లగొండ జిల్లా పరసాయపల్లెకు చెందిన కంచర్ల లక్ష్మారెడ్డి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వరంగల్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 1950లో ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన కె.ఎల్.రెడ్డి సూర్యదేవర రాజ్యలక్ష్మి నిర్వహించిన తెలుగు దేశం రాజకీయ వారపత్రికతో తన సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, నేటి నిజం, సాయంకాలం, మహానగర్ – ఇలా కె.ఎల్. రెడ్డి తెలుగులో వెలువడిన పలు పత్రికల్లో పని చేశారు. తెలంగాణ ప్రభ పేరుతో వారపత్రికను, కాలేజీ విద్యార్థి పేరుతో మంత్లీని స్వయంగా నడిపారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో “నేడు” పేరుతో మూడు నెలలపాటు ఒక కరపత్రాన్ని వెలువరించారు. తెలంగాణ ఉద్యమ వార్తలను ఇందులో ప్రముఖంగా ప్రచురించేవారు. అయితే వార్తాపత్రికల రిజిస్ట్రార్ అనుమతి లేకుండా పత్రిక స్థాయిలో “నేడు”ను వెలువరించడం నేరంగా పరిగణించి కె. ఎల్. రెడ్డికి నెల రోజులపాటు కఠిన కారగార శిక్ష విధించారు. ముషీరాదాబ్ జైలులో ఆయన ఇతర ఖైదీలతో పాటు ఈ శిక్ష అనుభవించారు. ప్రత్యేక తెలంగాణ కోసం అక్షరాలనే ఆయుధాలుగా చేసుకున్న కె.ఎల్. రెడ్డి, జైలు శిక్షకు వెరవలేదు. తెలంగాణ అక్షర యోధుడు పేరిట కె.ఎల్. రెడ్డి గురించి గోవిందరాజు చక్రధర్ ఆంధ్రభూమిలో రాసిన ప్రత్యేక కథనం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని ఆకర్షించింది.

కె.ఎల్. రెడ్డి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ అందించారు. తొలి రోజుల్లోనే వైవాహిక జీవితంలో వైమనస్యాలు ఏర్పడటంతో ఆయన జీవిత పర్యంతం ఒంటరిగానే ఉన్నారు. తెలుగు పత్రికా భాషపై పుస్తకం రాసిన కె.ఎల్. రెడ్డి నమ్మిన విషయాల్లో ఎక్కడా రాజీ పడేవారు కాదు. ముక్కసూటిగా మాట్లాడేవారు.

కె.ఎల్. రెడ్డి మరణం పట్ల ప్రముఖ సంపాదకులు ఎం.విఆర్. శాస్త్రి, సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ మాడభూషి శ్రీధర్, గోవిందరాజు చక్రధర్ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కె. ఎల్. రెడ్డితో తమ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. కె.ఎల్. రెడ్డి మృతి పట్ల వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేశవరావు, ఉపాధ్యక్షులు ఉడయవర్లు, కార్యదర్శి కొండా లక్ష్మణరావు తమ సంతాపం ప్రకటించారు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles